బీరాకుల కోసం నన్ను పక్కింటికి తోలి
పొట్టనిప్పుతానికి సిల్కేరాకుకని
నాయినను పాతగుడికాడికి పంపి
కట్లపూల కోసం కలియదిరిగి
తంగెడు పూత కోసం చెల్కలు మడికట్లెమ్మటి
పాదాలను భూమికి కట్టి
బొంగరం లెక్క తిరిగి తిరిగి
గంపెడు పూలుదెచ్చి సాప మీద రాశి పోసేది
అయినా చాలవన్నట్టు
అప్పుడే ఊర్లెజనమంత
పూలన్నీ తెంపకపోయిన్రని
గీ నాలుగు పూలు
నాలుగొరుసలకు వస్తయా అని
గొణిగే నాయనమ్మ ఆపసోపాలు
ఆకాశాన్ని అంటేవి
మందిలకు పోయినంక
తన బతుకమ్మ మరీ నల్లపూసయితదేమోనని
తాతను అంగడికి తోల్తె ఆరూర్లు తిరిగి
అద్దకిలపూలు కొనుక్కొచ్చిండని అనలేక
తనలో తాను రుసరుసలాడుకుంట
సద్దముద్దలు దబ్బున చేయాల్నని
అమ్మపై ఆరాటిస్తుంటె
అయ్యాల అర్థంకాలే
అంతెత్తు బతుకమ్మ ఎనక
ఎన్నెన్ని బతుకు అగచాట్లు ఉన్నయోనని!
తీరుతీరు బాధలుపడి
తీరొక్క పూలతో బతుకమ్మను పేర్చి
దేవునికాడ పెట్టి పూజయినంక..
హమ్మయ్య అనుకుంటే
మల్లోకథ మొదలు
ఊరు వాడ ఆడక్కలంత
పట్టు పీతాంబరాలతో
బతుకమ్మలకు సాటిగ ముస్తాబయి
చప్పట్లెయ్యడానికొస్తరని
మనమెట్ల బోవాల్నోనని తండ్లాడుతూ
అంతోటి సముద్రంల
మరకతాన్ని దొరకబుచ్చుకున్నట్టు
సందక పెట్టెల్నుండి కొత్త బట్టలు తీసి
ఇస్తుండె మా మూలపుటమ్మ
ఆడపిల్లలమైనందుకు బతుకమ్మలను
మా చేతికిచ్చి నీల్లారబోసి దండం పెట్టి
బతుకమ్మ ఆడిరాపోండి బిడ్డ
అనుకుంట సాగనంపుతుండె
గౌరమ్మను నిలుపుకోవడానికి
ఎనక ఇంత తతంగం ఉంటుండె
అందుకేనేమో బతుకమ్మంటే నాయనమ్మ యాది
తెలంగాణ బతుకుల సొద
మన సంస్కతి గుండె చప్పుడు
ఆడుకుంటూ పాడుకుంటూ నిలుపుకుంటూ
తరతరాలకు అందిద్దాం పదండి..
- డా. ఉప్పల పద్మ, 9959126682