Tuesday, September 30, 2025
E-PAPER
Homeసినిమా'కాంతార : చాప్టర్‌ 1'కి ఆటంకాలు కల్పించవద్దు

‘కాంతార : చాప్టర్‌ 1’కి ఆటంకాలు కల్పించవద్దు

- Advertisement -

రిషబ్‌ శెట్టి కథానాయకుడిగా నటించి, దర్శకత్వం వహించిన ‘కాంతార : చాప్టర్‌ 1’ సినిమా టికెట్‌ ధరల పెంపునకు ఏపీ ప్రభుత్వం సానుకూలంగా నిర్ణయం తీసుకుంది. తెలుగు సినిమాలకు కర్ణాటకలో ఆటంకాలు కల్పిస్తున్నారని, ఈ తరుణంలో అక్కడి చిత్రాలకు ఇక్కడ టికెట్‌ ధరలు పెంచడం ఎంత వరకు సమంజసం అంటూ తెలుగు సినీ వర్గాల నుంచి ఏపీ ప్రభుత్వానికి అభ్యంతరాలు వచ్చాయి. కర్ణాటకలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి: తెలుగు సినీ వర్గాలు విడుదల సమయంలో తెలుగు సినిమాలకు కర్ణాటక రాష్ట్రంలో పలు ఆటంకాలు ఎదురవుతున్నాయి. మన చిత్రాలకు టికెట్‌ ధరల పెంపు విషయంలో అక్కడి రాష్ట్ర ప్రభుత్వం సానుకూలంగా ఉండటంలేదు. అదే విధంగా తెలుగు సినిమా అనే ఉద్దేశంతో సినిమా పోస్టర్లు, బ్యానర్లు కూడా తొలగించే చర్యలకు కొందరు దిగుతున్నా, కన్నడ సినీ పరిశ్రమ నుంచి స్పందన రావడం లేదు. ఎన్‌.టి.ఆర్‌., రామ్‌ చరణ్‌ నటించిన ‘ఆర్‌.ఆర్‌.ఆర్‌.’ సినిమా విషయంలో కూడా అక్కడ తరతమ బేధాలు చూపిన విషయాన్ని ప్రస్తావిస్తూ ‘గేమ్‌ ఛేంజర్‌, హరిహర వీరమల్లు’, తాజాగా ‘ఓ.జి.’ విషయంలో చోటు చేసుకున్న పరిణామాలను తెలుగు సినీ వర్గాలు ప్రస్తావించాయి.

అక్కడ తెలుగు సినిమాకు టికెట్‌ ధరల విషయంలో హైకోర్టుకు కూడా వెళ్లారని తెలిపాయి. ఈ నేపథ్యంలో కన్నడ చిత్రాలకు టికెట్‌ ధర పెంపుపై ముందుకు వెళ్ళే విషయంలో పునరాలోచన చేయాలని కోరాయి. ఈ అంశంపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ స్పందిస్తూ, ‘కర్నాటకలో పరిణామాలను దష్టిలో ఉంచుకొని అక్కడి చిత్రాలకు ఇక్కడ ప్రోత్సాహం ఇవ్వడం ఆపవద్దు. కళ అనేది మనసుల్ని కలపాలి… విడదీయకూడదు అనేది వాస్తవాన్ని దృష్టిలో ఉంచుకుందాం. మంచి మనసుతో, జాతీయ భావనలతో ఆలోచనలు చేయాలి. కన్నడ కంఠీరవ డా.రాజ్‌ కుమార్‌ కాలం నుంచి ఇప్పటి కిచ్చా సుదీప్‌, ఉపేంద్ర, శివరాజ్‌ కుమార్‌, రిషబ్‌ శెట్టి వరకూ అందరినీ తెలుగు ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. సోదరభావంతో ఉన్నాం. మన సినిమాకు వ్యాపారపరంగా ఎదురవుతున్న ఇబ్బందుల్ని రెండు భాషల ఫిల్మ్‌ ఛాంబర్స్‌ కూర్చొని మాట్లాడుకోవాలి. అప్పుడు ప్రభుత్వపరంగా మనమూ మాట్లాడదాం. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళతాను. కర్ణాటకలో ఎదురైన పరిణామాలను దృష్టిలో పెట్టుకొని ‘కాంతారా ఛాప్టర్‌ 1’కి ఆటంకాలు కల్పించవద్దు’ అన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -