Tuesday, September 30, 2025
E-PAPER
Homeట్రెండింగ్ న్యూస్సత్ఫలితాలిస్తున్న ప్రహరీ క్లబ్‌లు

సత్ఫలితాలిస్తున్న ప్రహరీ క్లబ్‌లు

- Advertisement -

స్కూళ్లలో మత్తు చేరకుండా ‘ప్రహరీ’
విద్యార్థులు, ఉపాధ్యాయులు, పోలీస్‌ భాగస్వామ్యం
గంజాయి, ఇతర మత్తు పదార్థాలు స్కూళ్లలోకి రాకుండా అడ్డుకట్ట
బాధిత విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు కౌన్సిలింగ్‌


నవతెలంగాణ-సిటీబ్యూరో
తెలంగాణ రాష్ట్రంలో పాఠశాల విద్యార్థులను మాదకద్రవ్యాల బారిన పడకుండా రక్షించేందుకు ప్రభుత్వం ‘ప్రహరీ క్లబ్స్‌’ అనే వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రయివేట్‌ ఉన్నత పాఠశాలల్లో ఈ ప్రహరీ క్లబ్‌లను ఏర్పాటు చేయగా.. సత్పలితాలనిస్తోంది. ఆరు నుంచి పదో తరగతి చదువుతున్న విద్యార్థులతో ప్రహరీ క్లబ్‌లు ఏర్పాటు చేయగా.. ఇవి ముఖ్యంగా స్కూళ్లలోకి గంజాయి, ఇతర మత్తు పదార్ధాలు రాకుండా అడ్డుకట్ట వేస్తాయి. అయితే ఫలితాలు కొంతమేర కనిపిస్తున్నప్పటికీ.. క్షేత్రస్థాయిలో మాత్రం మరింత నిఘా పెంచి.. పకడ్బందీగా నిర్వహించాల్సిన బాధ్యత విద్యాశాఖ, ఇతర విభాగాలపై ఉంది. హైదరాబాద్‌ నగరంలోని పలు మండలాల్లో ప్రయివేట్‌, ప్రభుత్వ స్కూళ్లలో ఇప్పటివరకు 20కిపైగా కేసులు నిఘాకు చిక్కగా.. సదరు విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు కౌన్సెలింగ్‌ ద్వారా వారికి అవగాహన కల్పించి చర్యలు తీసుకుంటున్నారు. అయితే నిఘా దొరకని కేసులు పెద్ద సంఖ్యలో ఉంటున్నాయని పలువురు విద్యారంగ నిపుణులు విశ్లేషిస్తున్నారు.

జిల్లాలో 2262 ప్రభుత్వ పాఠశాలలు, ఎయిడెడ్‌, ప్రయివేట్‌, కార్పొరేట్‌ పాఠశాలలున్నాయి. వీటిలో ఆరు నుంచి 10వ తరగతి చదువుతున్న విద్యార్థులు సుమారు 4లక్షలకుపైనే ఉంటారు. వీరికి ఇప్పటికే మత్తుపదార్థాల వల్ల జరిగే నష్టాలపై అవగాహన కల్పిస్తున్నారు. తద్వారా పాఠశాలల్లో విద్యార్థులు డ్రగ్స్‌ వినియోగించకుండా చూడటం, వాటిని వినియోగించేవారిని గుర్తించి అవగాహన కల్పించడం, పాఠశాలల చుట్టు పక్కల ఎవరూ విక్రయించకుండా, పాఠశాలల్లోకి చేరకుండా, విద్యార్థులు చిక్కుకోకుండా క్లబ్‌లు చర్యలు చేపడుతున్నాయి. మాదక ద్రవ్యాలపై విద్యార్థులకు అవగాహన పెంపొందించడంతోపాటు నిఘా పెడుతున్నారు. అంతేగాక ఈ ప్రహరీ క్లబ్‌ల ఏర్పాటు, వాటి పనితీరును పర్యవేక్షించేందుకు జిల్లా స్థాయిలో ఒక కో-ఆర్డినేటర్‌ కూడా పని చేస్తున్నారు. ఎప్పటికప్పుడు ప్రహరీ క్లబ్‌ పనితీరును పరిశీలిస్తారు. అయితే విద్యాశాఖ ఆదేశాల మేరకు జిల్లాలోని పాఠశాలల్లో వీటిని ఏర్పాటు చేయాలని ఇప్పటికే పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు జిల్లా విద్యాశాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేయగా.. కమిటీల ఏర్పాటు ప్రక్రియ చాలా ప్రభుత్వ స్కూళ్లలో బాగుండగా.. అసలు ప్రయివేట్‌ స్కూళ్లలో ఎంతమంది క్లబ్స్‌ ఏర్పాటు చేశారో లేదో.. తెలియదు.

పలు మండలాల్లో కేసులు..
గతేడాది స్కూళ్లలో ఏర్పాటుచేసిన ప్రహరీ క్లబ్‌ల ద్వారా మత్తుపదార్ధాలకు గురవుతున్న విద్యార్థులను గుర్తిస్తున్నారు. ఉదాహరణకు నాంపల్లి మండలంలోని ఓ స్కూల్‌ ప్రధానోపాధ్యాయుడికి ఒకరిద్దరు తొమ్మిదవ తరగతి విద్యార్ధులపై అనుమానం వచ్చి బ్యాగ్‌ చేక్‌ చేయగా.. ఈ-సిగరేట్లు దొరికాయి. ఖైరతాబాద్‌ మండలంలో మరో ప్రముఖ స్కూల్లో విద్యార్థులు గంజాయి తీసుకున్నట్టు గుర్తించిన ఉపాధ్యాయులు.. ఆ విషయాన్ని బయటకు పొక్కకుండా.. విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు కౌన్సెలింగ్‌ ఇచ్చి వదిలేశారు.

సైదాబాద్‌లోని ఓ స్కూల్లో చదువుతున్న ఇద్దరు విద్యార్ధులకు బలపాలు తినే అలావాటు ఉంది. వారు పాఠశాల దగ్గరల్లోని ఓషాపులో బలపాల బాక్స్‌ కొని వాటిని తిన్నారు. ఆ బలపాలు తిన్న ఇద్దరు పిల్లలు ఆస్పత్రి పాలయ్యారు. ఈ విషయాన్ని స్కూల్‌ హెడ్‌మాస్టారు ప్రహరీ క్లబ్స్‌ టీమ్‌కు తెలియజేయగా.. వారు చేసిన ఎంక్వైయిరీలో పలు విస్తుపోయే విషయాలు బయటకు వచ్చాయి. ఈ ఇద్దరు పిల్లలు తిన్న బలపాలు రాజస్తాన్‌, అస్సాంలో తయారైనట్టు గుర్తించి.. వీటిల్లో డ్రగ్స్‌ వినియోగం ఉన్నట్టు తేల్చారు. దాంతో ఆ ప్రాంతాల్లో నార్కోటిక్స్‌ బ్యూరో నిఘా ఉంచింది. అంతేగాక పాతబస్తీల్లోని కొన్ని ప్రాంతాల్లో డ్రగ్స్‌ అమ్ముతున్నట్టు దొరికాయి. ముఖ్యంగా పిల్లలను బానిసలు చేసేందుకు స్మైలీ స్టిక్కర్స్‌ పేరిట వారిని వాటికి బానిసలను చేస్తున్నారు. వీటిల్లో మత్తు పదార్ధాలు ఉన్నట్టు గుర్తించారు.

వైటనర్స్‌లోనూ మత్తు ఉండగా.. హెచ్‌పీఎస్‌ సిగార్స్‌, కొకైన్‌ వైట్‌ ప్యాకెట్స్‌, పౌడర్స్‌, ఇతర డ్రగ్స్‌ విక్రయిస్తున్నారు. పాతబస్తీల్లోని కొన్ని ప్రాంతాలు, బండ్లగూడ సరిహద్దుల్లో డ్రగ్స్‌ దొరికినట్టు బృంద సభ్యులు ఒకరు తెలిపారు. ఇవేకాక నాంపల్లి, ఖైరతాబాద్‌, జూబ్లీహిల్స్‌, బేగంపేటతో పాటు పలు మండలాల్లో 20కిపైగా కేసులను గుర్తించి వారికి కౌన్సెలింగ్‌ ఇచ్చారు. వారిని పర్యవేక్షిస్తున్నారు. ఇదంతా కూడా పక్కనున్న విద్యార్థులకు ఎలాంటి అనుమానం రాకుండా అవగాహన కల్పిస్తున్నారు. ప్రహరీ క్లబ్స్‌ ఏర్పాటుతో జిల్లాలో కొంతమేర తగ్గినప్పటికీ.. క్షేత్రస్థాయిలో పరిస్థితి మరోరకంగా ఉంది.

కమిటీ సభ్యులు ఇలా..
జిల్లాలోని ప్రభుత్వ, ఎయిడెడ్‌, ప్రయివేట్‌, కార్పొరేట్‌ పాఠశాలల్లో ఆరు నుంచి పదో తరగతి చదువుతున్న విద్యార్థులతో ప్రహరీ క్లబ్‌లను ఏర్పాటు చేశారు. ఈ క్లబ్‌కు ప్రధానోపాధ్యాయుడు, ప్రిన్సిపల్‌ అధ్యక్షుడిగా, సీనియర్‌ ఉపాధ్యాయుడు ఉపాధ్యక్షుడిగా, చైల్డ్‌ ఫ్రెండ్లీ టీచర్‌, ఎస్‌హెచ్‌జీ సభ్యులుగా ఆరు నుంచి పదో తరగతి వరకు చదువుతున్న విద్యార్థులు ప్రతి తరగతికి ఇద్దరు సభ్యులుగా ఉంటారు. విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి ఒకరు, సమీపంలోని పోలీస్‌స్టేషన్‌ నుంచి ఒక కానిస్టేబుల్‌ను సభ్యులుగా ఉంటారు. పాఠశాలలకు దగ్గరలో మత్తుపదార్థాల వినియోగం, విక్రయం వంటివి జరిగితే వెంటనే పోలీసులకు సమాచారాన్ని అందిస్తారు. ఎవరైనా విద్యార్థులు మత్తుపదార్థాల బారిన పడినట్టు వారి దృష్టికి వస్తే కౌన్సెలింగ్‌ కూడా ఇస్తారు. ఈ కమిటీల్లోని సభ్యులు, పాఠశాలల్లోని విద్యార్థులకు 1908 టోల్‌ ఫ్రీ నంబర్‌కు కాల్‌ చేయడంపై అవగాహన కల్పిస్తారు.

తల్లిదండ్రులదే బాధ్యత
పాఠశాలల సమయంలో విద్యార్థులపై పూర్తి నిఘా ఉంచుతాం. వారి ప్రవర్తన ఎలా ఉంటుందో ఎప్పటికప్పుడు మానిటరింగ్‌ చేస్తాం. పిల్లలు స్కూల్‌ నుంచి ఇంటికి వెళ్లాక.. వారు ఏం చేస్తున్నారు.. ఎక్కడికి వెళ్తున్నారు అనేది తల్లిదండ్రులే చూసుకోవాలి.
ఆర్‌.రోహిణి, డీఈవో, హైదరాబాద్‌

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -