సినిమాలపై 100శాతం సుంకాలు
భారతీయ చిత్రాలపై భారీ ప్రభావం
మోడీ జోక్యం చేసుకోవాలంటున్న సినీ పరిశ్రమ
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే భారత ఎగుమతులపై 50శాతం సుంకాలు, ఫార్మాపై 100 శాతం సుంకాలు విధించిన ట్రంప్ తాజాగా మరో నిర్ణయం తీసుకున్నారు. దాంతో భారతీయ చిత్రాలపై భారీ ప్రభావం పడనున్నది. అమెరికా వెలుపల నిర్మించే సినిమాలపై సుంకాలు అమలు చేయనున్నట్టు హెచ్చరించారు. వందశాతం సుంకాలను విధించనున్నట్టు ప్రకటించారు. విదేశీ సినిమాలపై వందశాతం సుంకాలు అమలుకానున్నాయి. ‘మా సినిమా నిర్మాణ వ్యాపారాన్ని అమెరికా నుంచి.. ఓ శిశువు నుంచి మిఠాయిని తొలగించినట్టుగా ఇతరదేశాలు దొంగిలించాయని ఆయన ఆరోపించారు. బలహీనమైన, అసమర్థ గవర్నర్‌తో ఉన్న కాలిఫోర్నియా ముఖ్యంగా తీవ్రంగా దెబ్బతింది అంటూ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ట్రూత్ సోషల్‌లో పోస్ట్ పెట్టారు. ఈ దీర్ఘకాల, ఎప్పటికీ అంతం కాని సమస్యను పరిష్కరించడానికి తాను అమెరికా వెలుపల నిర్మించే అన్ని సినిమాలపై 100శాతం సుంకం విధించనున్నట్టు పేర్కొన్నారు. విదేశీ సినిమాలతో అమెరికన్ సినిమా పరిశ్రమకు ‘జాతీయ ముప్పు’గా ట్రంప్ భావిస్తూ ట్రంప్ ఇలాంటి ప్రకటన చేశారు.