Tuesday, September 30, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంజర్నలిస్టులకు ప్రజాప్రభుత్వం అండ

జర్నలిస్టులకు ప్రజాప్రభుత్వం అండ

- Advertisement -

– మంత్రి సీతక్క
నవతెలంగాణ-హైదరాబాద్‌

రాష్ట్రంలోని జర్నలిస్టులకు ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి నేతృత్వంలోని ప్రజాప్రభుత్వం అండగా ఉంటుందని రాష్ట్ర పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క అన్నారు. సోమవారంనాడు హైదరాబాద్‌లోని తెలంగాణ మీడియా అకాడమీ ఆడిటోరియంలో జర్నలిస్టుల సంక్షేమ నిధి చెక్కుల పంపిణీ కార్యక్రమానికి ముఖ్యఅతిధిగా హాజయ్యారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ మీడియా రంగంలో వృత్తిని కొనసాగిస్తూ అమరులైన జర్నలిస్టులకు జోహర్లు అర్పించారు. సమాజంలోని జర్నలిస్టులు సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువస్తారన్నారు. అలాగే ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా పని చేస్తూ ప్రజలను చైతన్యవంతులను చేస్తున్నారని అన్నారు. జర్నలిస్టులంతా తెలంగాణ ఉద్యమంలో పాల్గొని మిగతా సమాజానికి ఆదర్శంగా నిలిచారని కొనియాడారు. తెలంగాణ మీడియా అకాడమీ చనిపోయిన జర్నలిస్టు కుటుంబాలకు ఆర్థిక చేయూతను అందించడం వలన ఆయా కుటుంబాలకు ఎంతో మేలు జరుగుతుందని గుర్తుచేశారు. ఇదిలావుండగా జర్నలిస్టులకు వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించడానికి శిక్షణా కార్యక్రమాలు సైతం మీడియా అకాడమీ చేపడుతున్నదన్నారు. దీంతో విలేకరులకు ఎంతో మేలు జరుగుతోందన్నారు. ప్రభుత్వం చేపట్టిన గృహా నిర్మాణ పథకంలో ఇండ్లు లేని జర్నలిస్టులకు ఇండ్లను కేటాయించాలనీ, మరణించిన కుటుంబాలకు హెల్త్‌ కార్డులు అందజేసేలా చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేయనున్నట్టు చెప్పారు. మీడియా అకాడమీ చైర్మెన్‌ కె. శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ మరణించిన 18 మంది వర్కింగ్‌ జర్నలిస్టుల కుటుంబాలకు ఒక లక్ష రూపాయల చొప్పున ఎక్స్‌గ్రేషియా మంజూరు చేసినట్టు చెప్పారు. ఐదేండ్ల పాటు పెన్షన్‌ సైతం ఇచ్చినట్టు తెలిపారు. ప్రమాదాలతో దీర్ఘకాలికంగా అనారోగ్యం బారిన పడిన ఆరుగురు వర్కింగ్‌ జర్నలిస్టులకు రూ. లక్ష, తీవ్ర గాయాలైన ఒక్కో జర్నలిస్టుకు రూ. 50 వేలు మొత్తం రూ.24.50 లక్షల మేర ఆర్థిక సహాయం చెక్కులను మంత్రి చేతుల మీదుగా లబ్దిదారులకు అందజేయడం జరిగిందన్నారు. ఇప్పటికే కొన్ని జిల్లాలలో శిక్షణా తరగతులు నిర్వహించడం జరిగిందన్నారు. సమాచార పౌర సంబంధాల శాఖ స్పెషల్‌ కమిషనర్‌ సీహెచ్‌ ప్రియాంక మాట్లాడుతూ మీడియా అకాడమీ భవనం బహుళ అంతస్తులలో కొనసాగుతున్నందున అందులో శిక్షణ కొరకు ఆడిటోరియం ఉండడంతో జర్నలిస్టులకు ఏ.ఐ., సోషల్‌ మీడియా, భాషపై పట్టు కోసం నిరంతరం జర్నలిస్టులకు శిక్షణా తరగతులు నిర్వహిస్తున్నట్టు ఆమె వివరించారు. అలాగే జర్నలిస్టుల సౌకర్యార్ధం కంప్యూటర్‌ ల్యాబ్‌, లైబ్రేరి ఏర్పాటు చేస్తున్నట్టు ఆమె తెలిపారు. సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి సూచన మేరకు క్షేత్రస్థాయిలో పని చేస్తున్న పౌర సంబంధాల అధికారులకు మీడియా అకాడమీ ఆధ్వర్యంలో శిక్షణను ఏర్పాటు చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో మీడియా అకాడమీ కార్యదర్శి నాగులపల్లి వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -