Tuesday, September 30, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంఎల్‌ఐసీ ఏజెంట్లకు వెల్ఫేర్‌ ఫండ్‌ ఏర్పాటు చేయాలి

ఎల్‌ఐసీ ఏజెంట్లకు వెల్ఫేర్‌ ఫండ్‌ ఏర్పాటు చేయాలి

- Advertisement -

ఎల్‌ఐసీ ఏజెంట్స్‌ ఆర్గనైజేషన్‌ ఆఫ్‌ ఇండియా (ఎల్‌ఐసీఏఓఐ) వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ మంజునాధ్‌, జోనల్‌ ప్రధాన కార్యదర్శి పీఎల్‌ నర్సింహారావు, సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి జె. వెంకటేశ్‌
యాదాద్రి జిల్లా చౌటుప్పల్‌లో ముగిసిన ఎల్‌ఐసీఏఓఐ రాష్ట్ర 4వ మహాసభ
54వ మందితో నూతన కమిటీ ఎన్నిక
అధ్యక్ష కార్యదర్శులుగా తాళ్ళూరి శ్రీనివాసరావు, తన్నీర్‌కుమార్‌


నవతెలంగాణ-చౌటుప్పల్‌
ఎల్‌ఐసీ ఏజెంట్లకు వెల్ఫేర్‌ ఫండ్‌ ఏర్పాటు చేయాలని ఎల్‌ఐసీ ఏజెంట్స్‌ ఆర్గనైజేషన్‌ ఆఫ్‌ ఇండియా (ఎల్‌ఐసీఏఓఐ) వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ మంజునాధ్‌, జోనల్‌ ప్రధాన కార్యదర్శి పీఎల్‌ నర్సింహారావు, సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి జె. వెంకటేశ్‌ డిమాండ్‌ చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌ పట్టణంలో సోమవారం నిర్వహించిన ఎల్‌ఐసీఏఓఐ రాష్ట్ర 4వ మహాసభలో వారు మాట్లాడారు. ఎల్‌ఐసీ రక్షణ, ఏజెంట్ల పరిరక్షణ లక్ష్యంతో ఎల్‌ఐసీఏఓఐ 14 లక్షల మంది ఏజెంట్ల హక్కుల కోసం 23 ఏండ్లుగా పోరాటం చేస్తున్నట్టు తెలిపారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న సరళీకృత ఆర్థిక విధానాల వల్ల పెరుగుతున్న దేశసంపదలో జీతాల వాటా 2019లో 18.9 శాతం ఉంటే ఇప్పుడు 15.9 శాతానికి పడిపోయిం దని అన్నారు. అదే కాలంలో కంపెనీల లాభాల వాటా 38.7 శాతం నుంచి 51.9 శాతానికి పెరిగిందన్నారు. దాంతో కొద్దిమంది ప్రపంచ కుబేరులుగా ఎదిగారని తెలిపారు. 80 శాతం పైగా సామాన్య ప్రజలు పూట గడవని స్థితికి నెట్టబడుతున్నారని విమర్శించారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రభుత్వరంగ సంస్థలను కారుచౌకగా తన అనుయాయులైన కార్పొరేట్‌ కంపెనీలకు అమ్ముతున్నద న్నారు. బీజేపీ అధికారంలో ఉన్న ఈ 11ఏండ్లులో రూ.16.35 లక్షల కోట్లు కార్పొరేట్‌ మొండి బకాయిలను బ్యాంకులు రద్దు చేశాయని తెలిపారు.

ఇన్సూరెన్స్‌ చేయ గలిగిన స్థోమత ఉన్న జనాభాలో 70 శాతానికి పాలసీలు అందించడం ద్వారా ఎల్‌ఐసీ ఇన్సూరెన్స్‌ వ్యాపారాన్ని రికార్డ్‌స్థాయికి పెంచగలిగిందని తెలిపారు. 99 శాతం క్లెయిమ్‌ సెటిల్మెంట్‌తో ప్రపంచంలో అగ్రగామి సంస్థగా ఎదిగిందని అన్నారు. ఇంతటి ప్రతిష్టాత్మకమైన ఎల్‌ఐసీని 100శాతం విదేశీ పెట్టుబడులతో ఇన్సూరెన్స్‌ కంపెనీలను స్థాపించే వీలు కల్పిస్తూ చట్టం చేయడం అన్యాయమని చెప్పారు. ప్రధాన కార్యదర్శి తన్నీరు కుమార్‌ మాట్లాడుతూ.. మార్కెట్‌ పోటీని తట్టుకొని సమర్ధవంతంగా ఆర్థికాభివృద్ధికి తోడ్పడటం కోసం నాలుగు సాధారణ బీమా కంపెనీను విలీనం చేయాలనే ఉద్యోగుల డిమాండ్‌ను కేంద్రం పెడచెవినపెడుతున్నదని అన్నారు. జీవితబీమా, సాధారణ బీమా వ్యాపారం ఒకే కంపెనీ చేసుకోవడానికి వీలు కల్పిస్తూ కాంపోజిట్‌ లైసెన్స్‌ విధానాన్ని ప్రవేశపెట్టే ప్రయత్నాలను ప్రతిఘటించాలని పిలుపునిచ్చారు. ఎల్‌ఐసీ ఏజెంట్లకు వెల్ఫేర్‌ ఫండ్‌ ఏర్పాటు చేయాలని, పెన్షన్‌ సౌకర్యం కల్పించాలని, ప్రొఫెషనల్‌ ట్యాక్స్‌ రద్దు చేయాలనే వంటి డిమాండ్లను మహాసభ తీర్మానించింది. ఈ సందర్భంగా రాష్ట్ర నూతన కమిటీని ఎన్నుకున్నారు.

54 మందితో నూతన రాష్ట్ర కమిటీ
మహాసభ అనంతరం 54 మందితో నూతన కమిటీ ఏర్పడింది. గౌరవాధ్యక్షులుగా జె.వెంకటేష్‌, అధ్యక్షులుగా తాళ్ళూరి శ్రీనివాసరావు, వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా కొత్తపల్లి రామనరసయ్య, ప్రధాన కార్యదర్శిగా తన్నీర్‌కుమార్‌, కోశాధికారి జి.ఆధిత్య, ఉపాధ్యక్షులుగా పాలమాకుల రాజబాబురెడ్డి, కమటం స్వామి, సంగెం వెంకటేశ్వర్లు, కార్యదర్శులుగా పడిదం కట్టస్వామి, ఉలిపె రవికుమార్‌, ఆమందు రాజ్‌కుమార్‌, సోయం జోగారావు, ఎం. అరుణ ఎన్నికయ్యారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -