Tuesday, September 30, 2025
E-PAPER
Homeజాతీయంకులవివక్షకు వ్యతిరేకంగా పాఠాలను చేర్చండి

కులవివక్షకు వ్యతిరేకంగా పాఠాలను చేర్చండి

- Advertisement -

ఎన్‌సీఈఆర్‌టీకి అలహాబాద్‌ హైకోర్టు ఆదేశం

అలహాబాద్‌ : కుల వివక్షకు వ్యతిరేకంగా పాఠశాల పుస్తకాల్లో పాఠాలను చేర్చాలని జాతీయ పాఠ్యపుస్తకాల తయారీ సంస్థ ఎన్‌సీఈఆర్‌టీని అలహాబాద్‌ హైకోర్టు ఆదేశించింది. ఈ నెల 16న జస్టిస్‌ వినోద్‌ దివాకర్‌ నేతృత్వంలోని ధర్మాసనం ఇచ్చిన ఉత్తర్వుల్లో కులం, సామాజిక అసమానతలపై విద్యార్థులకు సున్నితంగా బోధించే పాఠ్య పుస్తకాల కంటెండ్‌ అవసరాన్ని ప్రస్తావించింది. ఈ ఉత్తర్వుల వివరాల్లోకి వెళితే..హర్యానా నుంచి ఉత్తరప్రదేశ్‌ మీదుగా బీహార్‌కు మద్యం అక్రమ రవాణా కేసులో క్రిమినల్‌ చర్యలను రద్దు చేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌ను హైకోర్టు విచారిస్తోంది. ఈ కేసులో నిందితుల కులాలను ప్రస్తావిస్తూ ఎఫ్‌ఐఆర్‌ను పోలీసులు నమోదు చేశారు. కులాన్ని ప్రస్తావించకుండా ఉండాలని హైకోర్టు పోలీసుల్ని ఆదేశించింది. అలాగే, కుల ఆధారిత అసమానతలను అధిగమించడానికి ప్రభుత్వాలు తీసుకుంటున్న చర్యలను ప్రస్తావించింది. ‘కుల వివక్షతకు సంబంధించిన బహిరంగ చర్యలనే చట్టం శిక్షించగలదు. కానీ సంస్థలు, పాఠశాలలు, కార్యాలయాలు, గ్రామాల్లో ఇప్పటికీ ప్రబలంగా ఉన్న సూక్ష్మమైన వివక్షలను పరిష్కరించడానికి చట్టం పెద్దగా ఉపయోగపడదు. పరిశుభ్రత, లింగ సమానత్వం వంటి ఆంశాల మాదిరిగా కుల వివక్షపై దేశవ్యాప్తంగా ప్రత్యేక అవగాహన కార్యక్రమం లేదు’ అని హైకోర్టు తన ఉత్వర్వుల్లో పేర్కొంది.

‘పాఠశాల సిలబస్‌ల్లో కూడా కుల వివక్షకు వ్యతిరేకంగా ప్రత్యేకంగా అంకితమైన పాఠ్య ప్రణాళిక లేదు. కుల వివక్షను అంతంచేయడానికి ప్రభుత్వ చట్టాలతో పాటు స్థిరమైన కార్యక్రమాలు అవసరం. సామాజిక సామరస్యం, కుల సమానత్వాన్ని ప్రోత్సహించే జాతీయ ప్రచారం అవసరం. పాఠశాల విద్యార్థులకు సమానత్వం, గౌరవం, కుల పక్షపాతం వలన కలిగే ప్రమాదాల గురించి బోధించాలి’ అని హైకోర్టు తెలిపింది. దాదాపు అన్ని తరగతులకు ఎన్‌సీఈఆర్‌టీ నూతన పాఠ్యపుస్తకాలను సిద్ధం చేస్తున్న సమయంలో హైకోర్టు ఆదేశాలు రావడం విశేషం. అలహాబాద్‌ హైకోర్టు ఆదేశాలను పలువురు విద్యావేత్తలు సమర్థిస్తున్నారు. ఢిల్లీ యూనివర్సిటీ పరిధిలోని ఒక కళాశాల అధ్యాపకుడు, ఫోరం ఆఫ్‌ అకాడెమిక్స్‌ ఫర్‌ సోషల్‌ జస్టిస్‌ చైర్మెన్‌ హన్సరాజ్‌ సుమన్‌ మాట్లాడుతూ ఎన్‌సీఈఆర్‌టీ ఇప్పటికే కుల వ్యవస్థకు వ్యతిరేకంగా తగినంత విషయాలను చేర్చి ఉండాల్సి ఉందని అన్నారు. కులాన్ని సమర్థించే బదులుగా అంబేద్కర్‌, జ్యోతిబా ఫూలే, పెరియార్‌ల జీవితం, వారసత్వం, వారి పోరాటాల గురించి మెటీరియల్‌ ఇవ్వాలని అన్నారు. అంబేద్కర్‌ పాఠశాల జీవితంలో కుల వివక్షను ఎలా ఎదుర్కొన్నాడో విద్యార్థులు తెలుసుకోవాలని చెప్పారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -