సీపీఐ(ఎం) భద్రాద్రి జిల్లా కార్యదర్శి మచ్చా వెంకటేశ్వర్లు
భద్రాచలం- వెంకటాపురం ప్రధాన రహదారికి మరమ్మతులు చేపట్టాలని పాదయాత్ర
పాదయాత్ర బృందానికి అడుగడుగునా జననీరాజనాలు
నవతెలంగాణ- దుమ్ముగూడెం
ఇసుక లారీల రాకపోకలతో ధ్వంసమైన భద్రాచలం-వెంకటాపురం ప్రధాన రహదారికి మరమ్మతులు చేపట్టే వరకూ ప్రజా పోరాటాలను మరింత ఉధృతం చేస్తామని సీపీఐ(ఎం) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యదర్శి మచ్చా వెంకటేశ్వర్లు అన్నారు. సోమవారం సీపీఐ(ఎం) చర్ల, దుమ్ముగూడెం, భద్రాచలం మండల కమిటీల ఆధ్వర్యంలో ములకపాడు సెంటర్ నుంచి చేపట్టిన మహా పాదయాత్రను డీసీసీబీ మాజీ చైర్మెన్ యలమంచి రవికుమార్ జెండా ఊపి ప్రారంభించారు. వందలాది మంది పార్టీ కార్యకర్తలతో ప్రారంభమైన పాదయాత్రకు అడుగు అడుగున ప్రజలు నీరాజనాలు పలికారు. పాదయాత్ర రథసారథి మచ్చా వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. ఇసుక తోలకాలకు ఇబ్బడి ముబ్బడిగా అనుమతులు ఇచ్చిన రాష్ట్ర ప్రభుత్వం రహదారి ధ్వంసం అవుతుంటే కనీసం మరమ్మతులు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానికి లేదా అని ప్రశ్నించారు. దేశంలోనే ప్రసిద్ధిగాంచిన భద్రాద్రి రామయ్య ఉన్నటువంటి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం పట్టణం మొదలు ములుగు జిల్లా వాజేడు వరకు 120 కిలోమీటర్ల ప్రధాన రహదారి ఇసుక లారీల వల్ల పూర్తిగా ధ్వంసం అయిందని అన్నారు. జిల్లాలో ముగ్గురు మంత్రులు ఉండి కూడా రోడ్డు నిర్మాణానికి నిధులు కేటాయించకపోవడం.. వారి బాధ్యతా రాహిత్యానికి నిదర్శమని అన్నారు. ప్రజల ప్రాణాలు పోతున్నప్పటికీ ప్రజాప్రతినిధులకు చలనం లేకుండా పోయిందని విమర్శించారు. ఈ పాదయాత్రకు బీఆర్‌ఎస్ నాయకులు సంఘీభావం తెలిపారు.