Tuesday, September 30, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్స్థానిక ఎన్నికల నిర్వహణకు అధికారులు సిద్దంగా ఉండాలి: కలెక్టర్

స్థానిక ఎన్నికల నిర్వహణకు అధికారులు సిద్దంగా ఉండాలి: కలెక్టర్

- Advertisement -

నవతెలంగాణ – నిజామాబాద్ సిటీ 
స్థానిక సంస్థల ఎన్నికలకు షెడ్యూల్ విడుదలైన దృష్ట్యా, ఎం.పీ.టీ.సీ, జెడ్.పీ.టీ.సీ, గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణ బాధ్యతలను సమర్ధవంతంగా నిర్వర్తించేలా అన్ని విధాలుగా సన్నద్ధం కావాలని కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి సూచించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం కన్ఫరెన్స్ హాల్ లో మంగళవారం ఎం.పీ.డీ.ఓలు, ఎం.పీ.ఓలతో కలెక్టర్ సమావేశం నిర్వహించారు. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ కోసం అన్ని ఏర్పాట్లను పూర్తి చేసుకోవాలని సూచించారు. నియమ, నిబంధనలపై పూర్తి అవగాహనను ఏర్పర్చుకోవాలని, ఎలాంటి వివాదాలు, తప్పిదాలకు తావులేకుండా నిబంధలను తు.చ తప్పకుండా పాటిస్తూ ఎన్నికల విధులను జాగ్రత్తగా నిర్వర్తించాలని హితవు పలికారు.

స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణలో అధికారులు, సిబ్బంది అందరూ క్రియాశీలక పాత్ర పోషించాల్సి ఉంటుందని, పరస్పరం సమన్వయంతో పని చేస్తూ ప్రశాంత వాతావరణంలో సాఫీగా ఎన్నికలు జరిగేలా కృషి చేయాలని హితవు పలికారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులోకి వచ్చినందున పక్కాగా కోడ్ అమలయ్యేలా చూడాలన్నారు. రాజకీయ పార్టీలకు సంబంధించిన హోర్డింగులు, పోస్టర్లను, ప్రభుత్వ కార్యాలయాలు, సంస్థల గోడలపై రాతలు ఉంటే తొలగించాలని ఆదేశించారు. ఏ దశలోనూ అలసత్వానికి తావు ఇవ్వకూడదని, ఎన్నికల ప్రక్రియ ముగిసేంత వరకు అనుక్షణం జాగరూకతతో వ్యవహరించాలని సూచించారు.

నిఘా బృందాలను నియమించి, పకడ్బందీగా కోడ్ అమలు జరిగేలా పర్యవేక్షణ చేయాలని అన్నారు. ఓటర్లను ప్రభావితం చేసే చర్యలను ఎక్కడికక్కడ నిరోధించాలని, మద్యం, డబ్బు పంపకాలు, ఇతర ప్రలోభాలకు గురి చేసే వస్తువుల పంపిణీపై నిఘా ఉంచాలన్నారు. ఓటరు జాబితాను మరోమారు నిశితంగా పరిశీలించాలని, ఎక్కడైనా ఇబ్బందులు ఉన్నట్లు గమనిస్తే తమ దృష్టికి తేవాలని కలెక్టర్ సూచించారు. ఎన్నికల నిర్వహణకు అవసరమైన సిబ్బందిని పూర్తి స్థాయిలో నియమిస్తూ, ఎన్నికల విధుల పట్ల పరిపూర్ణ అవగాహన కల్పించేలా శిక్షణ తరగతులను మరోమారు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. బ్యాలెట్ బాక్సులు, ఎన్నికల సామాగ్రిని జాగ్రత్తగా సరి చూసుకోవాలని అన్నారు. పోలింగ్ కేంద్రాలను క్షేత్రస్థాయిలో పరిశీలిస్తూ, ఎక్కడైనా సదుపాయాలు లేకపోతే యుద్ధప్రాతిపదికన సౌకర్యాల కల్పనకు చర్యలు తీసుకోవాలని సూచించారు. ఎం.పీ.టీ.సీ, జెడ్.పీ.టీ.సీ ఓట్ల లెక్కింపు కోసం రెవెన్యూ డివిజన్ కేంద్రాల వారీగా కౌంటింగ్ హాల్ లను గుర్తించాలని అన్నారు. 

కాగా, ఎన్నికల కమిషన్ ప్రకటనను అనుసరిస్తూ ఆర్.ఓలు నోటిఫికేషన్ జారీ చేసి, ఆ రోజు నుండే నామినేషన్లు స్వీకరించాల్సి ఉంటుందని తెలిపారు. దీనిని దృష్టిలో పెట్టుకుని నామినేషన్ల స్వీకరణ ప్రక్రియకు అనువుగా తగిన ఏర్పాట్లు చేసుకోవాలని కలెక్టర్ సూచించారు. నామినేషన్ల స్వీకరణ, స్క్రూటినీ, ఉపసంహరణ, పోలింగ్, కౌంటింగ్ తదితర అన్ని ప్రక్రియలను రాష్ట్ర ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలకు అనుగుణంగా పూర్తి పారదర్శకంగా నిర్వహించాలని అన్నారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్లు అంకిత్, కిరణ్ కుమార్, బోధన్, ఆర్మూర్ సబ్ కలెక్టర్లు వికాస్ మహతో, అభిగ్యాన్ మాల్వియ, ట్రైనీ కలెక్టర్ కరోలిన్ చింగ్తియాన్ మావి, జెడ్పీ సీ.ఈ.ఓ సాయాగౌడ్, నిజామాబాద్ ఆర్డీఓ రాజేంద్రకుమార్, జిల్లా పంచాయతీ అధికారి శ్రీనివాస్, నోడల్ అధికారులు, డీ.ఎల్.పీ.ఓలు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -