Tuesday, September 30, 2025
E-PAPER
Homeజిల్లాలుకాంగ్రెస్‌ 'బాకీ కార్డు`ను విడుదల చేసిన హరీశ్‌రావు

కాంగ్రెస్‌ ‘బాకీ కార్డు`ను విడుదల చేసిన హరీశ్‌రావు

- Advertisement -

నవతెలంగాణ సిద్దిపేట: రాష్ట్రంలో ఏ పల్లెకు వెళ్లినా గుంతల రోడ్లే దర్శనమిస్తున్నాయని.. రోడ్లు వేయకుండా ఫ్యూచర్‌సిటీకి ఆరులేన్ల రహదారికి శంకుస్థాపన చేయటం విడ్డూరంగా ఉందని మాజీమంత్రి, బీఆర్ఎస్ సీనియర్‌ నేత హరీశ్‌రావు మండిపడ్డారు. ఆరు గ్యారంటీలకు టాటా చెప్పిన రేవంత్‌రెడ్డి విలువైన భూములను విక్రయిస్తూ లంకె బిందెల వేట సాగిస్తున్నారని విమర్శించారు. మార్పు.. మార్పు అంటూ రాష్ట్ర ప్రజలను ఏమార్చారని మండిపడ్డారు. మంగళవారం సిద్దిపేటలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన నియోజకవర్గ స్థాయి ముఖ్యకార్యకర్తల సమావేశం ఆయన మాట్లాడారు.

ఈ సందర్భంగా కాంగ్రెస్‌ ‘బాకీ కార్డు`ను విడుదల చేశారు. కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చి 22 నెలలవుతున్నా ఒక్క హామీని పూర్తిస్థాయిలో అమలు చేయలేదన్నారు. మాటిమాటికీ మహిళలను కోటీశ్వరులను చేస్తానంటూ మోసం చేశారన్నారు. కాంగ్రెస్‌ పార్టీ చేతిలో మోసపోని వర్గమంటూ లేదని విమర్శించారు. తెలంగాణలో ఆరుగ్యారంటీలు అమలు చేస్తున్నామంటూ బిహార్‌ ప్రజలను కూడా రాహుల్‌గాంధీ మోసం చేస్తున్నారన్నారు. అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ప్రతీరైతుకు రూ.75 వేలు, ప్రతీ మహిళకు రూ.44 వేలు కాంగ్రెస్‌ బాకీ పడిందన్నారు.

అధికారంలోకి వచ్చి 22 నెలలువుతున్నా ఒక్క హమీని నెరవేర్చలేదని, అదే విషయాన్ని కాంగ్రెస్‌ బాకీ కార్డు రూపంలో ఎండగడతామన్నారు. రానున్న రోజుల్లో ఈ బాకీ కార్డే కాంగ్రెస్‌ పార్టీకి ఉరితాడు కాబోతుందన్నారు. ఇందుకోసం భారాస నాయకులు, కార్యకర్తలు శ్రమించాలని, పట్టణాలు, గ్రామాలు అన్న తేడా లేకుండా ప్రతీఇంటికీ ఈ కార్డును అందజేసి కాంగ్రెస్‌ పార్టీ వైఫల్యాలను వివరించాలన్నారు. కార్డుపై ప్రతి ఇంట్లో చర్చ జరగాలని పిలుపునిచ్చారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓట్లడగటానికి వచ్చే కాంగ్రెస్‌ నాయకులను ప్రజలు నిలదీయాలన్నారు. ఒక్కొక్కరికీ ఎంత బాకీ పడ్డారో ఇచ్చాకే కాంగ్రెస్‌ నాయకులు ఓట్లడగాలన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -