సమస్యకు శాశ్వత పరిష్కారం జరిగేనా..?
నవతెలంగాణ – రాజన్న సిరిసిల్ల
తెలంగాణ రాష్ట్రంలోనే ఏకైక విద్యుత్ సహకార సంఘం ప్రస్తుతం జిల్లాలో విద్యుత్ అంతరాయంతో మూడు పువ్వులు ఆరు కాయలుగా వర్ధిల్లుతుంది. గత ప్రభుత్వంలో రాజన్న సిరిసిల్ల జిల్లాలో విద్యుత్ అంతరాయం అనేది కనిపించలేదని కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే సెస్ పరిధిలో విద్యుత్ అంతరాయం విపరీతంగా పెరిగిందని విద్యుత్ వినియోగదారులు పేర్కొంటున్నారు. 1970లో ప్రారంభించిన సిరిసిల్ల సహకార విద్యుత్ సరఫరా సంఘం గతంలో ఉత్తమ సేవలు అందించింది ప్రస్తుతం ఉత్తమ సేవలు అందిస్తున్నప్పటికీ విద్యుత్ అంతరాయం ప్రతిరోజు 12 సార్లు జరుగుతుంది జిల్లాలోని విద్యుత్ వినియోగదారులు అనేక ఇబ్బందులు పడుతున్నారు దేశంలోనే సిరిసిల్ల సహకార విద్యుత్ సరఫరా సంఘం ఉత్తమ సంస్థగా కొనసాగుతుంది అయినప్పటికీ ఇక్కడ మాత్రం విద్యుత్ అంతరాయ వేధింపులు అపడం లేదు.
జిల్లా జనాభా: 5.52 లక్షలు
గ్రామపంచాయతీలు: 255
సెస్ ఏరియా: 1870 కిలోమీటర్లు
విద్యుత్ వినియోగం: 3,46,000
11/కెవి లైన్: 6,534 కిలోమీటర్లు
6.3/కెవి లైన్: 1049 కిలోమీటర్లు
ఎల్ .టి లైన్: 8,552 కిలోమీటర్లు
ట్రాన్స్ఫార్మర్లు: 9906
సబ్ స్టేషన్లు: 76
ఫీడర్లు: 279
ఆస్తులు: 250 కోట్లు
సేస్ పరిధిలో విద్యుత్ అంతరాయం.. పరిష్కారం..
సిరిసిల్ల సహకార విద్యుత్ సరఫరా సంఘం (సెస్) రాజన్న సిరిసిల్ల జిల్లాలోనే కాకుండా జగిత్యాల జిల్లాలోని కొన్ని గ్రామాలకు విద్యుత్ సేవలు అందిస్తుంది కానీ ప్రతిరోజు 24 గంటల్లో 12సార్లు విద్యుత్ అంతరాయం కలుగుతుంది. విద్యుత్ అంతరాయానికి ప్రధాన కారణం ఓవర్ లోడ్ అని తెలుస్తుంది. రాజన్న సిరిసిల్ల జిల్లాలో విద్యుత్ అంతరాయం అరికట్టాలంటే 33/11కెవి సబ్ స్టేషన్లు 18 అవసరం ఉన్నవి. అలాగే 132/కెవి సబ్ స్టేషన్ నేరెళ్ల ప్రాంతంలో ఏర్పాటు చేస్తే విద్యుత్ అంతరాయం తగ్గుతుందని ఇంజనీరింగ్ అధికారులు పేర్కొంటున్నారు. అలాగే వేములవాడ డివిజన్లో 33/11 కెవి సబ్ స్టేషన్లు మరో ఐదు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది అంతేకాకుండా 132/kv సబ్స్టేషన్ బోయిన్పల్లి మండల కేంద్రంలో ఏర్పాటు చేయాలి.
అలాగే పాత ట్రాన్స్ఫార్మర్లు కండక్టర్లు పాత విద్యుత్ వైర్లు తొలగించడం వల్ల విద్యుత్ సరఫరా లో నష్టం తగ్గ అవకాశాలు ఉన్నాయి దీంతో విద్యుత్ కొనుగోలు వ్యయం తగ్గుతుంది. సిరిసిల్ల డివిజన్ పరిధిలో 33/11 కేవీ సబ్ స్టేషన్లు తంగళ్ళపల్లి మండలం రామన్న పల్లె, గోపాల్ రావు పల్లె, పద్మా నగర్ ప్రాంతాల్లో ఏర్పాటు చేయాలి. అలాగే ఇల్లంతకుంట మండలంలోని దాచారం ,అనంతారం, గుండారం, ఎల్లారెడ్డిపేట మండలంలోని గొల్లపల్లి, హరిదాస్ నగర్, బండ లింగంపల్లి ,గంభీరావుపేట మండలంలోని మల్లారెడ్డిపేట ,కోళ్ల మద్ది ,దేశాయిపేట, వీర్నపల్లి మండలంలోని మద్దిమల్ల, వన్పల్లి శాంతినగర్, సిరిసిల్ల పట్టణంలోని సుభాష్ నగర్ ,శాంతినగర్ ,మెడికల్ కాలేజీ ప్రాంతంలో ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. అలాగే వేములవాడ డివిజన్లోని బోయినపల్లి మండలంలోని నల్లగొండ, జగ్గారావు పల్లి, వరద వెళ్లి, వేములవాడ పట్టణంలోని తిప్పాపూర్, దేవస్థానం, అగ్రహారం ప్రాంతాల్లో ఏర్పాటు చేసినట్లయితే విద్యుత్ సమస్య పూర్తిస్థాయిలో తొలగిపోయే అవకాశం ఉంది.
సెస్ భవనాలకు స్థలాలు కరువు…
రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వివిధ మండలాల్లో సెస్ భవనాలు నిర్మాణానికి స్థలాలు లేకపోవడంతో అనేక మండలాల్లో సెస్ భవనాలు అద్దె ఇండ్లలో ఉన్నాయి. ప్రభుత్వం స్థలాలు కేటాయించినట్లయితే సెస్ సంస్థ నుంచి భవనాల నిర్మాణాలకు నిధులు మంజూరు చేసే అవకాశాలు ఉన్నాయి. ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని సెస్ భవనం గత కొన్నేళ్ల నుంచి పోలీసు ల ఆధీనంలో ఉంది. అనేకసార్లు విన్నవించిన సంబంధిత భవనం సెస్ కు అప్పగించడం లేదు. అలాగే వీర్నపల్లి ,వేములవాడ లోని నాంపల్లి ,రుద్రంగి, బోయినపల్లి ,గంభీరావుపేట, చందుర్తి, కోనరావుపేట మండల కేంద్రాల్లో 15 గుంటల స్థలం చొప్పున ఇచ్చినట్లయితే ఈ ప్రాంతాల్లో సెస్ సంస్థ నిధులు మంజూరు చేసి భవనాలు నిర్మించే అవకాశం ఉంది. అలాగే గత ప్రభుత్వం సెస్ వినియోగదారులకు సంబంధించిన 5 ఎకరాల స్టోర్ స్థలమును తీసుకుంది. గత పాలకవర్గం తమ సొంత ఆస్తులు అన్నట్లు స్థలం అప్పగించారు. కానీ ఇప్పటివరకు సెస్ స్టోర్కు ప్రభుత్వం స్థలం ఇవ్వకపోవడం పలు చర్చలకు దారి తీస్తుంది.
సెస్ లో ఖాళీల భర్తీకి ప్రభుత్వం అనుమతి ఇవ్వాలి: చిక్కాల రామారావు చైర్మన్, సెస్, రాజన్న సిరిసిల్ల
సెస్ లో ఉద్యోగుల ఖాళీలు అనేకంగా ఉన్నాయి ఎన్ పి డి సి ఈ ఎల్ ద్వారా సెస్ ఉద్యోగుల రిక్రూట్మెంట్ చేయించినట్లయితే ఎలాంటి అక్రమాలు జరగకుండా ఉంటుంది. సిబ్బంది పూర్తిస్థాయిలో ఉన్నట్లయితే ప్రస్తుతం ఉన్న 18 కోట్ల రెవెన్యూ వసూలు 25 కోట్ల వరకు పెరిగే అవకాశం ఉంది. చిత్తశుద్ధితో పాలకవర్గం సెస్ ఉద్యోగులు పారదర్శకంగా ఎలాంటి అపోహాలకు తావు లేకుండా సంస్థ అభివృద్ధి కోసం పనిచేస్తున్నారు. వినియోగదారులు ఎలాంటి వదంతులను నమ్మవద్దు. చట్టం పరిధిలో పనిచేస్తున్నాం. సంస్థను పటిష్టవంతంగా చేయడానికి పరిపాలనలో సంస్కరణలు చేపట్టడం వల్ల కొంతమందికి ఇష్టం లేక కొన్ని అపవాదులు సృష్టిస్తున్నారు. వినియోగదారులు నమ్మవద్దు.