– స్థానిక పేదలు పై వివక్ష
– నిరసన తెలిపిన నందమూరి నగర్ వాసులు
– మద్దతు పలికిన బీఆర్ఎస్
నవతెలంగాణ – అశ్వారావుపేట
బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో నిర్మించిన డబల్ బెడ్ రూమ్ ల కేటాయింపులో నిబంధనలు పాటించకుండా లబ్ధిదారుల ఎంపిక చేపట్టారని మంగళవారం నందమూరి కాలనీకి వాసులు ఆందోళనకు దిగారు. విషయం తెలుసుకున్న బీఆర్ఎస్ జిల్లా నాయకులు యూఎస్ ప్రకాశ్ డబల్ బెడ్ రూమ్ ఇండ్లను అర్హులైన నిరుపేదలకు కాకుండా ఇష్టానుసారంగా కేటాయింపులు ఎట్లా జరుపుతారని ప్రశ్నించారు. లాటరీ పద్ధతిలో ఇండ్లను కేటాయించాల్సి ఉండగా,అందుకు విరుద్ధంగా కేటాయింపులు జరిగాయని ఆరోపించారు.కేసిఆర్ ప్రభుత్వ హయాంలో నిర్మించిన ఇళ్లను స్థానిక కాంగ్రెస్ నాయకుల సూచనలు మేరకే ఇష్టానుసారంగా కేటాయింపులు జరిపారని ఆరోపించారు.
సమాచారం అందుకున్న ఎస్ హెచ్ ఓ యయాతి రాజు,అదనపు ఎస్ఐ రామ్మూర్తి లు సిబ్బందితో ఘటనాస్థలికి చేరుకొని ఆందోళనకు దిగిన వారితో మాట్లాడారు. తహసిల్దార్ సీహెచ్వీ రామక్రిష్ణ అందుబాటులో లేకపోవడంతో అతను రాగానే చర్చించి సమస్యకు పరిష్కారం చూపుతామని హామీ ఇచ్చారు. దీంతో తాత్కాలికంగా ఆందోళనను విరమించారు.