కళలు అరవైనాలుగు రకాలంటారు. సాంప్రదాయ కళల్లో హస్తకళలు ప్రధానమైన పాత్ర పోషిస్తాయి. హస్తకళలు అంటే చేతులతో చేసే అందమైన వస్తువులు అని అర్ధం. హస్త కళల్లో ఎక్కువగా మహిళలు మాత్రమే పాల్గొంటారు. సున్నితమైన పనిలో మహిళలు ఎక్కువగా ఏకాగ్రత, నైపుణ్యం కలిగి ఉంటారు కాబట్టి మహిళలే హస్త కళాకారులుగా ఉంటారు. అలాంటి హస్త కళాకారుల్లో ఈ రోజు ఒక విభిన్నమైన హస్తకళా చిత్రకారిణిని పరిచయం చేసుకోబోతున్నాము. ఇంట్లో అలంకరణకు వాడుకునే వస్తువులే కాకుండా టీచింగ్ ఎయిడ్స్‌గా పనికొచ్చే కళాఖండాల్ని తయారు చేసిన ఒక అద్భుమైన కళాకారిణిని మనం కలవబోతున్నాం. అది ఎలాంటి కళో వాటి ప్రయోజనాలేమిటో ఆమె మాటల్లోనే విందాం.
‘నేను తయారు చేసిన వస్తువులు ఆసుపత్రి వ్యర్థాలతో తయారైనవి. చాలా మంది రకరకాల వ్యర్థాలతో ఉపయోగపడే వస్తువులు లేదా అలంకరణకు పనికొచ్చే వస్తువులు తయారు చేస్తుంటారు. నేను కూడా అలాంటివన్నీ తయారు చేశాను. అయితే మా ఆసుపత్రిలో ప్రతి రోజూ ఎన్నో వ్యర్థాలను పారవేయటం గమనించి వీటితో ఏమైనా తయారు చేయవచ్చా అని ఆలోచించాను. మొదటగా ఇంజక్షన్ సీసాల మీద ఉండే చిన్న తళుకుల్లాంటి పదార్థాలు నన్నాకర్షించాయి. అవి బొట్టు బిళ్ళ సైజులో గుండ్రంగా తెల్లగా అల్యూమినియం రేకుల్లా ఉంటాయి. వాటితో అందమైన పెయింటింగుల్లాంటి చిత్రాలు చేశాను. అప్పుడు నేను సిజేరియన్ ఆపరేషన్ చేయించుకుని బెడ్ రెస్ట్‌లో ఉన్నాను. ఆ సమయాన్ని వినియోగించుకుని చిత్రాలు చేయడం మొదలు పెట్టాను.’
ఇప్పుడర్ధమైందా! ఇలా ఆసుపత్రి వ్యర్థాలతో అద్భుమైన కళా సంపదను సష్టించిన కళాకారిణి ఎవరో తెలిసిందా! సజన్ చిల్డ్రన్ హాస్పిటల్‌కు మేనేజింగ్ డైరెక్టర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్న బాలసాహితీవేత్త బహుముఖ ప్రజ్ఞాశాలి డా.కందేపి రాణీప్రసాద్. ఈమె సిరిసిల్లలోని తమ ఆసుపత్రి నిండా బొమ్మల్ని పెట్టుకున్నారు. దాదాపు ఆరేడు వేల బొమ్మలతో ఆసుపత్రిని మ్యూజియంగా మర్చారు.
సిరిసిల్లలోని వారి హాస్పిటల్‌ను పరిశీలించినప్పుడు అడుగడుగునా బొమ్మలే దర్శన మిచ్చాయి. వాకిట్లోకి వెళ్ళగానే పూల చెట్లున్న రెండు నీటి కుండీలు వళ్ళంతా రంగులు వేసుకుని స్వాగతం పలికాయి. పిల్లలకు అత్యంత ఇష్టమైన కార్టూన్ కారక్టర్ లైన టామ్ అండ్ జెర్రీ, మిక్కిమౌస్ అండ్ డోనాల్డ్ డక్ బొమ్మల్ని శరీరం మీద రాణీప్రసాద్ చేత చేయించుకుని హాస్పిటల్ గేటు వద్ద ఈ నీటి కుండీలు పిల్లలను ఆహ్వానిస్తూ కనబడతాయి. హాస్పిటల్లో ఇంజక్షన్ వేస్తారు మేము రామంటూ మారాం చేసే పిల్లలు ఈ ఆసుపత్రికి రాగానే ఆ బొమ్మలు చూసి డిశ్చార్చి చేసినా ‘మేము ఇంటికి రాము ఇక్కడే ఉంటాము’ అని గొడవ చేయటం చూశాం. పిల్లల కోసం ఆవిడ చేసే కార్యక్రమాలు, ఎగ్జిబిషన్లు కూడా అందుకు కారణమై ఉండవచ్చు.
టీచింగ్ ఎయిడ్స్‌గా
సాధారణంగా హస్తకళలు ఏవైనా చూసి ఆస్వాదించటానికి మాత్రమే పనికొస్తాయి లేదా ఇంటిని అలంక రించుకోవడానికి ఉపయోగించు కుంటారు. కానీ రాణీప్రసాద్ తయారు చేసిన బొమ్మలు విద్యార్థులకు సైన్స్ సోషల్ పాఠాలు నేర్పడానికి పనికొస్తున్నాయి. ఆమె తయారుచేసిన మూత్ర పిండాలు, ఊపిరి తిత్తులు, మెదడు, గర్భాశయం, క్రోమోజోములు, క్లోమం వంటి శరీర అవయవాలను పిల్లలకు టీచింగ్ ఎయిడ్స్‌గా వాడవచ్చు. అలాగే వాటిని పిల్లల చేత తయారు చేయించవచ్చు. వీటిని పాఠ్యాంశాలుగా బోధించినప్పుడు వినని విద్యార్థులు బొమ్మల రూపంలో కళారూపాల ద్వారా చూపిస్తున్నపుడు చాలా ఉత్సాహంగా వింటారు. ఆయా అవయవాలు చేసే పనులు లక్షణాలను వివరంగా తెలుసుకోవచ్చు. ఈ బొమ్మలతో రాణీప్రసాద్ దాదాపు వంద స్కూళ్ళలో ఎగ్జిబిషన్లు పెట్టి పిల్లలకు అవగాహన కల్పించటంలో కతకత్యులయ్యారు. అంతే కాకుండా తమ ఆసుపత్రిలోనూ అవగాహనా తరగతులు నిర్వహించడంలోనూ, పిల్లలను సజనాత్మకంగా మలచటంలోనూ ఎన్నో కార్యక్రమాలు చేపడుతున్నారు.
ప్లాస్టిక్ రీసైక్లింగ్
రాణీప్రసాద్ మందులలో వచ్చే అనేక ప్లాస్టిక్ డబ్బాలు, ప్యాకింగులు, మూతలు, గ్లూకోజ్ బాటిల్స్, గ్లూకోజ్ సెట్లు వంటి అనేక ప్లాస్టిక్ వ్యర్థాలతో బొమ్మలు తయారుచేశారు. వీటన్నిటికీ ఆమె ‘ప్లాస్టిక్ రిసైక్లింగ్’ అని నామకరణం చేశారు. ఆసుపత్రి వ్యర్థాలలో ఉండే ప్లాస్టిక్‌ను రీసైక్లింగ్ ద్వారా ఇంట్లో వాడుకునే వస్తువులను రూపొదించారు. ఇందులో ప్లాస్టిక్ కవర్లతో కూడా ఎన్నో రకాల అలంకరణ వస్తువులను రూపొందించారు. ఇలాంటి ప్లాస్టిక్ రీసైక్లింగ్ వస్తువుల తయారీని ప్రతి స్కూల్లో నేర్పించాలి. ఇంకా చెప్పాలంటే వీటిని పాఠ్యాంశాలుగా పెట్టినా తప్పులేదు ఎందుకంటే ప్లాస్టిక్ వస్తువులతో ప్రపంచం ఎంతగా కలుషితమవుతుందో అందరికీ తెలిసిన విషయమే. రాణీప్రసాద్ కేవలం ఆసుపత్రి వ్యర్థాలైన ప్లాస్టిక్కునే కాకుండా ఇంటిలో సాధారణంగా లభించే ప్లాస్టిక్‌తో కూడా బొమ్మలు తయారు చేశారు. దాదాపు 300 బొమ్మలను తయారు చేసి ప్రముఖ దిన పత్రికల్లో వాటి తయారీ విధానాన్ని వివరిస్తున్నారు.
పుస్తకాల ప్రచురణ
రాణీప్రసాద్ కేవలం చిత్ర కారిణి, హస్త కళాకారిణి మాత్రమే కాకుండా సాహితీ వేత్త, రచయిత్రి, కవయిత్రి కూడా. అందువల్లనే తాను తయారు చేసిన బొమ్మలను ఎలా తయారు చేసు కోవాలో వివరిస్తూ 1995 నుంచి అనేక దినపత్రికల్లో వ్యాసాలు రాస్తూనే ఉన్నారు. వేస్ట్ టు బెస్ట్ శీర్షిక ద్వారా నవతెలంగాణ పత్రికలో ఆరేండ్లు కాలమ్ నిర్వహించారు. చేసి చూద్దాం, ఇలా చేద్దాం, కళాకతులు, వ్యర్థాల కళలు అంటూ రకరకాల శీర్షికల ద్వారా పత్రికలలో బొమ్మల తయారీ వ్యాసాలు రాశారు. ఇలా రాసిన వ్యాసాలను పుస్తకాలుగా కూడా ప్రచురించారు. సరదా సరదా బొమ్మలు, బాటానికల్ జూ, వర్ణలిపి, కళాకతి, మగయాపురి, చిత్ర కళార్ణవం పుస్తకాలుగా బొమ్మల తయారీ వ్యాసాలను చక్కని చిత్రాలతో సహా ప్రచురించారు. ఈ హాస్పిటల్ ఆర్ట్‌ను ఇతర రాష్ట్రాలూ, విదేశాల్లోనూ ప్రదర్శించారు. కానీ ఆమెకూ ఆమె సష్టించిన హాస్పిటల్ ఆర్ట్ కూ తగినంత గుర్తింపు రాలేదు. కళాకతుల వ్యాసాలు ఈ ముప్పై ఏండ్లలో దాదాపు వెయ్యికి పైగా రాసి ఉంటారు ఇంకా వీటన్నిటినీ పుస్తకాలుగా తీసుకురావలసి ఉన్నది. ఆమె చిత్రాలన్నీ ఉపాధ్యాయుల ప్రశంసలు అందుకున్నాయి.
ప్రత్యేక చిత్రాలు
బాక్టీరియా, వైరస్ వంటి క్రిముల ఆకారాలను వ్యర్థాలు, చెట్ల ఆకులతో తయారు చేశారు. జీర్ణాశయం, గర్భాశయం వంటి అవయవాలు వాటికి వచ్చే వ్యాధులు, చికిత్సలను కూడా చిన్న చిత్రాలుగా, కార్టూన్లుగా రూపొందించారు. ఎయిడ్స్ వైరస్‌ను కంది పప్పు వంటి ధాన్యాలతో, ఆకులు, కాయలుతో రూపొందించారు. కరోనా వైరస్ ప్రపంచాన్ని వణికిస్తున్న సమయంలో భీతిల్లిన ప్రజలకు రక రకాల బొమ్మలను ప్రదర్శించడం ద్వారా సైన్స్ విషయాలను వ్యాప్తి చెందేలా ప్రయత్నించారు. ఆరోగ్య దినోత్సవం, డౌన్స్ సిండ్రోమ్, పర్యావరణ దినోత్సవం, ధరిత్రి దినోత్సవం, ఆటిజండే, ఎయిడ్స్ దినోత్సవం వంటి సామాజిక వైద్య ఆరోగ్య విషయాలకు సంబంధించిన దినోత్సవాలకు వ్యాసాలతో పాటుగా బొమ్మల్ని చిత్రీకరించడం రాణీ ప్రసాద్‌కు అలవాటు.
కరోనా చిత్రాలు
కరోనా సమయంలో తమ హాస్పిటల్ తరుపు నుంచి ఎన్నో అవగాహనా కార్యక్రమాలు చేపట్టారు. ప్రజలకు నిత్యావసర వస్తువులు, కూరగాయలు పంచి పెట్టారు. ఆ ఆపద సమయంలో ఆక్సిజన్ సిలిండ్లర్ల కొరకు, ప్రత్యేకమైన మందుల కొరకు జిల్లా కలెక్టర్‌కు రాణీ ప్రసాద్ దంపతులు (డా.కందేపి ప్రసాదరావు, డా.కందేపి రాణీ ప్రసాద్) లక్ష రూపాయలను డొనేషన్ ఇచ్చారు. ఇది వ్యక్తిగా సామాజిక బాధ్యతను నిర్వర్తించినట్లైతే కళాకారిణిగా ఆసుపత్రి వ్యర్థాలతో కరోనా వైరస్ చిత్రాలను, వలస కూలీల ప్రయాణాన్ని తయారుచేసి వారి ఆసుపత్రిలో ప్రదర్శించారు. హాస్పిటల్లో వెంటిలేటర్లనే కత్రిమ శ్వాసకు మిషన్లు ఉంటాయని ప్రజలందరికీ తెలిసింది కరోనా సమయంలోనే. అలాంటి వెంటిరేటర్‌ల వేస్ట్‌తో సైతం ఎన్నో చిత్రాలు చేశారు. మాస్క్‌లు, ఫేస్ షీల్డులు వంటి వాటితో ఉపయోగపడే బొమ్మలు చేశారు. మాస్క్‌తో చిన్న మనీపర్స్‌లను చేయటం చాలా మందిని ఆశ్చర్య పరిచింది. మాస్క్‌లకు ఉండే తాళ్ళతో పువ్వులను తయారు చేసి అందర్నీ అబ్బుర పరిచారు. విలక్షణ కళాకారిణిగా పేరు తెచ్చుకున్నారు.
జంతువుల చిత్రాలు
ఆమె తన ఆర్ట్‌లో జంతువులకు ఒక ప్రముఖమైన పాత్ర ఇచ్చారు. జంతువులకు కథలు, కవితలు, గేయాలు పొడుపు కథలు రాయడంతో పాటు వ్యర్థాలతో జంతువుల ఆకారాల్ని సష్టించారు. అందరికీ తెలిసిన జంతువులు కొన్నైతే విదేశాల్లో జీవించే జంతువుల్ని కూడా వారి హాస్పిటల్‌కు రప్పించారు. వాటి తయారీని వ్యాస కథనాల ద్వారా వివరించారు. దీనివల్ల బాలబాలికలు కేవలం బొమ్మల తయారీయే కాకుండా సైన్స్ విషయాలను తెలుసుకునే వీలుంటుంది. దీనిని రాణీ ప్రసాద్ ఎలా వర్ణిస్తారంటే ‘చదువుకొమ్మని పిల్లలను బలవంత పెడితే పిల్లలు చదువు మీద ఇష్టాన్ని చూపరు. వారి చేత సైన్స్‌ను చదివించాలంటే ఒకటే మార్గం. వారికి నచ్చిన సరదా బొమ్మలు చేయిస్తే విజ్ఞాన విషయాలను మెదడులోకి చొప్పించవచ్చు. ఇదెలా అంటే జ్వరంతో వచ్చిన పిల్లాడికి చేదు మాత్రలు ఇస్తే వేసుకోడు. పంచదార కోటింగ్‌తో చేదు మాత్రలు మింగించి జ్వరం తగ్గించినట్లుగా అనుకోండి’.
ఎగ్జిబిషన్లు
రాణీప్రసాద్ తన బొమ్మలతో చాలా ప్రదర్శనలు నిర్వహించారు. సిరిసిల్లలో ఉన్న స్కూళ్ళలో అనునిత్యం ప్రదర్శనలు పెడుతూనే ఉంటారు. ప్రపంచ జీవ వైవిధ్య సదస్సు హైదరా బాదులో జరిగినప్పుడు జీవ వైవిద్యానికి సంబంధించిన చార్టులను సిరిసిల్లలోని గవర్నమెం టు కాలేజీలో ప్రదర్మించారు. చార్టుల్ని, బొమ్మల్ని కేవలం ప్రదర్మించి చూస్తూ కూర్చోకుండా వాటికి సంబంధించిన ఎన్నో విషయాలను పిల్లలతో మాట్లాడుతూ చెబుతూ ఉంటారు. దీని వల్ల ఎక్కడ ప్రదర్శన పెట్టినా చిన్నారులు ఆమెను వదిలి పెట్టకుండా చుట్టూ తిరుగుతూనే ఉంటారు. ముంబయి, భువనేశ్వర్, వంటి కొన్ని రాష్ట్రాలలో సైతం ఎగ్జిబిషన్లు పెట్టారు. రాణీ ప్రసాద్ భర్త, పిల్లలు డాక్టర్లు అయినందున వారి కాన్ఫరెన్సులలో సైతం అనేక చోట్ల ఎగ్జిబిషన్లు నిర్వహించారు. రవీంద్ర భారతిలో వారం రోజుల పాటు ప్రదర్శన నిర్వహించారు. సింగపూర్ తెలుగు సమాజం నిర్వహించిన కార్యక్రమంలోనూ తన కళల్ని పరిచయం చేశారు. ఈ బొమ్మలు కేవలం రసానందాన్ని, విజ్ఞానాన్ని కలిగించడమే గాకుండా రోగాలు, నొప్పులు, జ్వరాలతో బాధ పడుతున్న పేషెంట్లుకు కాస్త ఊరట, మానసిక స్వాంతన కలిగిస్తున్నాయి అనటంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. ఒక ప్రముఖ దిన పత్రిక వీరి ఆర్ట్ గురించి వ్యాసం రాస్తూ ‘ఇది విద్యాలయమా! వైద్యాలయమా’ అని శీర్షిక పెట్టారంటే చిన్నారి బాలలకు ఎంత బాగా ఉపయోగపడుతుందో తెలుస్తుంది. ఈ కొత్త దనపు ఆర్ట్‌ను అన్ని విద్యాలయాల్లోనూ, వైద్యాలయాల్లోనూ ప్రదర్శింప చేయాలని కోరుకుంటున్నాను. వీలైన వారందరూ ఈ బొమ్మలను చూసే ప్రయత్నం చేయండి.
మీడియా ప్రసారాలు
మొదటిసారిగా 1995లో ఈటివీ డా.కందేపి రాణీప్రసాద్ ఆసుపత్రి వ్యర్థాలైన ఇంజక్షన్ సీసాల మూతలతో నెమలిని తయారు చేయడాన్ని ప్రసారం చేసింది. ‘సుధామయి’ అనే హస్తకళల కార్యక్రమంలో ఆమె తయారు చేసిన బొమ్మల్ని ప్రసారం చేశారు. అంతేకాక అనేక టీవి ఛానెల్స్ తమతమ కార్యక్రమాల ద్వారా రాణీప్రసాద్ ఆర్ట్‌ను ప్రత్యక్షంగా చూపించారు. అనేక పత్రికలతో పాటుగా దిన, వార, మాస పత్రికలు ఆమె సజించిన చిత్రాలను ఇంటర్వ్యూల ద్వారా ప్రచురించాయి. అనేక వెబ్ మ్యాగజైన్లు సైతం రాణీ ప్రసాద్ ఆర్ట్‌ను వారం వారం ప్రచురిస్తూ పాఠకులకు పరిచయం చేస్తున్నాయి. ఆమె కూడా తన యూట్యూబు ఛానల్ ద్వారా కథలు, బొమ్మలను నాలుగు వందల వీడియోలుగా పాఠకలోకానికి అందుబాటులోకి తెచ్చారు.
అయినంపూడి శ్రీలక్ష్మి