అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తమ దేశంలోకి దిగుమతయ్యే ఫార్మాస్యూటికల్ డ్రగ్స్‌పై వంద శాతం సుంకాలు బాది ప్రపంచ ఔషధ మార్కెట్‌ను అనిశ్చితిలోకి నెట్టారు. కొత్త సుంకాలు అక్టోబర్ ఒకటి (నేడు) నుంచి అమల్లోకొస్తాయని ట్రంప్ ప్రకటించారు. కేవలం బ్రాండెడ్, పేటెంట్ ఔషధాల పైనే వంద శాతం సుంకాలని పైకి చెబుతున్నా అమల్లోకొస్తేనే వాస్తవం బోధ పడుతుంది. తమ వాణిజ్య భాగస్వాములపై జాతీయంగా విధించిన సుంకాలకు కొత్తవి అదనమా కాదా అన్నదానిపై స్పష్టత లేదు. సుంకాలపై చట్టపరంగా వివరించలేదు. అమెరికాలో ఔషధ ఉత్పత్తి ప్లాంట్లు స్థాపించిన, నెలకొల్పే దశలో ఉన్న వారికి సుంకాల నుంచి మినహాయింపునిచ్చారు. దేశీయంగా తయారీని పెంచి, తద్వారా బడ్జెట్ లోటును పూడ్చుకునేందుకే సుంకా లంటూ ఆగస్టు నుంచి ట్రంప్ చెలరేగి పోతున్నారు. ఆ వాదనలో ఎంతమాత్రం నిజం లేదని ఎవరైనా చెబుతారు. దేశ భద్రత, ఇతర కారణాల రీత్యానే సుంకాలు వేస్తున్నామనడం ఎంత మాత్రం పొసగదు. తన మాట వినని దేశాలపై కక్ష సాధించడానికే సుంకాల బాదుడు. పైగా ఏకపక్షంగా వేస్తున్నారు. వాణిజ్యపర, ద్వైపాక్షిక చర్చలకు ఆస్కారం లేకుండా, గిట్టని దేశాలను ఎంపిక చేసుకొని మరీ సుంకాల విధింపునకు బరి తెగించారు.
ప్రస్తుతం ఔషధ దిగుమతులపై ట్రంప్ విధించిన సుంకాల వలన ఇప్పటికిప్పుడు భారత్ ఫార్మా పరిశ్రమపై ప్రభావం ఉండదని, అందుకు కారణం మన దేశం జనరిక్ మందుల ఎగుమతిదారుగానే ఉందన్నది ఇండిస్టీ పెద్దల ప్రాథమిక అంచనా. భవిష్యత్తులో సుంకాలు జనరిక్‌నకు కూడా విస్తరించే అవకాశం లేకపోలేదు. అదే జరిగితే మన దేశ ఫార్మా ఇండిస్టీకి పెద్ద దెబ్బే. ఇప్పుడు కూడా ఫార్మా స్టాక్స్‌పై సెంటిమెంటల్ ప్రభావం కచ్చితంగా ఉంటుందనే వారు లేకపోలేదు. అమెరికా ఔషధ అవసరాలలో 40 శాతం మేర భారతదేశం తీరుస్తోంది. 2024లో ఆ దేశానికి దిగుమతైన ఫార్మా డ్రగ్స్ విలువ 27.9 బిలియన్ డాలర్లు (దాదాపు రూ.2.45 లక్షల కోట్లు) కాగా వాటిలో 31 శాతం, అంటే 8.7 బిలియన్ డాలర్లు (సుమారు రూ.77 వేల కోట్లు) భారత్‌వే. అమెరికాలో వినియోగించే జనరిక్ ఔషధాల్లో 45 శాతం మన దేశం నుంచే సరఫరా అవుతున్నాయి. ఇండియాలో ప్రముఖ ఫార్మా కంపెనీలైన డాక్టర్ రెడ్డీస్, అరబిందో, జైడస్, సన్, గ్లాండ్ వంటి సంస్థల ఆదాయాల్లో 30-50 శాతం వరకు అమెరికా మార్కెట్ నుంచే లభిస్తున్నాయి. ఈ విధంగా చూస్తే భారత్‌ను దెబ్బతీయాలన్న ప్రధాన లక్ష్యంతోనే ట్రంప్ వంద శాతం సుంకాలు వేశారని అర్థమవుతుంది. అందుకే తమ దేశంలో మందుల ధరలు పెరిగినా పట్టించుకోలేదు.
తన ఆంక్షలను ధిక్కరించి ఇండియా, రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తోందన్న కక్షతో ట్రంప్ 50 శాతం సుంకాలు విధించారు. తాజాగా ఫార్మాతో పాటు గృహోపకరణాలు, చివరికి సినిమా పరిశ్రమను సైతం వదిలిపెట్టలేదు. భారత్‌ను ఇబ్బందులు పెట్టి, బెదిరించి తన దారికి తెచ్చుకోవాలని చూస్తున్నారు. హెచ్1 బీ వీసాల వ్యవహారం కూడా ఆ కోవలోనిదే. ఇప్పటికే ట్రంప్ టారిఫ్‌ల వలన మన వ్యవసాయ, ఆక్వా తదితర రంగాలు, రైతులు సంక్షోభంలో పడ్డాయి. అయినప్పటికీ కేంద్రంలోని మోడీ ప్రభుత్వం అమెరికా-ట్రంప్ విధానాలను, వినాశకర నిర్ణయాలను గట్టిగా నిలదీసి, నిరసించడంలో, పోరాటం నిర్వహించడంలో తటపటాయిస్తోంది. న్యూయార్క్‌లో జరుగుతున్న ఐక్య రాజ్య సమితి సర్వసభ్య సమావేశాల సందర్భంగా బ్రిక్స్ దేశాలు ట్రంప్ టారిఫ్‌లను నిర్ద్వంద్వంగా వ్యతిరేకించాయి. ఆ సంయుక్త ప్రకటనలో ఇండియా కూడా ఉంది. ప్రకటనలు ఏ విధంగా ఉన్నా అమెరికాతో జరిగే వాణిజ్య, ద్వైపాక్షిక సమావేశాల్లో, అంతర్జాతీయ వేదికలపైనా ట్రంప్ ఏకపక్ష, కక్షపూరిత టారిఫ్‌లను భారత్ వ్యతిరేకించాలి. ట్రంప్ టారిఫ్‌లను వ్యతిరేకించే మిగతా దేశాలతో కలిసి నిర్వహించే పోరాటంలో భారత్ ముందుండాలి. అదే దేశ ప్రజల ప్రయోజనాలకు రక్ష. అమెరికా- ట్రంప్‌తో పెనవేసుకుంటే మన ప్రయోజనాలకు గండికొట్టి దేశాన్ని తాకట్టు పెట్టినట్లు భావించాలి. మూల్యం చెల్లించుకోక తప్పదు.
అన్నింటిపైనా సుంకాలు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES