సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ ఖండన
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
సీపీఐ(ఎం) గ్రేటర్ హైదరాబాద్ సెంట్రల్ సిటీ జిల్లా కార్యదర్శివర్గసభ్యులు ఎం మహేందర్‌పై అంబర్‌పేట్ ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ చేసిన అనుచిత వ్యాఖ్యలు, దుర్భాషలాడటాన్ని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ తీవ్రంగా ఖండించారు. అనునిత్యం ప్రజల్లో ఉంటూ వారి తరఫున పోరాటం చేస్తున్న తమ పార్టీ నాయకులపై దౌర్జన్యాలకు పాల్పడితే తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. ఈ మేరకు ఆయన మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. అంబర్‌పేట్‌లో వరదబాధితులకు పురుగులతో కూడిన బియ్యాన్ని ఎమ్మెల్యేతోపాటు అధికారులు పంచారని తెలిపారు. దాన్ని మహేందర్‌తోపాటు సీపీఐ(ఎం) నాయకులు, కార్యకర్తలు అడ్డుకుని నాణ్యమైన బియ్యం పంపిణీ చేయాలంటూ విజ్ఞప్తి చేశారని పేర్కొన్నారు.
దీన్ని జీర్ణించుకోలేని స్థానిక ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ నోటికొచ్చినట్టు బూతులు తిడుతూ అక్కడి నుంచి ఈడ్చుకెళ్లాలనీ, తర్వాత వాడి అంతు చూస్తానని మహేందర్‌ను బెదిరించారనీ, ఇది సరైంది కాదని తెలిపారు. ప్రజాప్రతినిధిగా ఉండి ప్రజాస్వామ్యబద్ధంగా ఉండాల్సిన ఎమ్మెల్యే సీపీఐ(ఎం) నాయకునిపై ఈ తరహా బెదిరింపులకు పాల్పడటం సరైంది కాదని పేర్కొన్నారు. సీపీఐ(ఎం) నాయకులు, కార్యకర్తలు ఇలాంటి బెదిరింపులు, దౌర్జన్యాలకు భయపడేవారు కాదని గుర్తు చేశారు. ఇలాంటి ఘటనలు పునరావృతమైతే తీవ్ర మూల్యం చెల్లించకతప్పదంటూ ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్‌ను ఆయన హెచ్చరించారు.
మహేందర్‌పై ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ దౌర్జన్యం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES