Wednesday, October 1, 2025
E-PAPER
Homeజాతీయంఅడవి బిడ్డలపై పెరిగిన దాడులు

అడవి బిడ్డలపై పెరిగిన దాడులు

- Advertisement -

మహిళలు, చిన్నారులపై అంతులేని అఘాయిత్యాలు

న్యూఢిల్లీ : దేశంలో ఆదివాసీ తెగలను, అభంశుభం తెలియని చిన్నారులను, మహిళలను లక్ష్యంగా చేసుకొని దాడులు పెరిగిపోతున్నాయి. ఆర్థిక నేరాలకు తెగిస్తున్న సైబర్‌ మూకల దాడులు కూడా హెచ్చరిల్లుతున్నాయి. గత గణాంకాలతో పోలిస్తే ఈ తరహా దాడులు క్రమేపి పెరుగుతూనే వుండటం ఆందోళనకరం. 2023 సంవత్స రానికి సంబంధించి నేషనల్‌ క్రైమ్‌ రికార్డ్స్‌ బ్యూరో (ఎన్సీఆర్బీ) విడుదల చేసిన నివేదిక ఈ విషయాన్ని మరోసారి స్పష్టం చేసింది. అంతకుముందు ఏడాదితో పోలిస్తే 2023లో షెడ్యూలు తెగలు (ఎస్టీలు) పై దాడులు ఏకంగా 28.8 శాతం పెరిగాయి. 2022లో ఎస్టీలపై నేరాలకు సంబంధించి 10,064 కేసులు నమోదు కాగా, 2023లో ఈ కేసుల సంఖ్య 12,960కు పెరిగింది.

అలాగే, ఈ కేటగిరిలో మొత్తం నేరాల రేటు కూడా 2022తో పోలిస్తే 9.6 శాతం పెరిగింది. అంటే 28.8శాతం పెరిగాయి. అలాగే 2023లో సైబర్‌ క్రైమ్‌లు కూడా 2022తో పోలిస్తే 31.2 శాతం పెరిగాయి. 2022లో 65,893 సైబర్‌ క్రైమ్‌ కేసులు నమోదు కాగా, 2023లో 86,420 కేసులు నమోదయ్యాయి. అంటే 31.2శాతం పెరిగాయి. 2023లో నమోదైన సైబర్‌ నేరాల్లో ఎక్కువగా అంటే 59,526 కేసులు (68.9 శాతం) పౌరులను మోసం చేయడమే లక్ష్యంగా జరిగాయి. తరువాత స్థానంలో లైంగిక వేధింపుల కేసులు వున్నాయి.

అవి 4.9 శాతం (4,199)గా వుండగా దోపిడీ కేసులు గా, 3.8 శాతం (3,326)గా నమోదయ్యాయి.మహిళలపై నేరాలు కూడా అంతకుముందు ఏడాదితో పోలిస్తే 2023లో పెరిగాయి. 2022లో మహిళలపై నేరాలకు సంబంధించి 4.45 లక్షల కేసులు నమోదు కాగా, 2023లో ఈ కేసుల సంఖ్య 4,48,211కు చేరుకుంది. వీటిల్లో ప్రధానంగా 29.8 శాతం అంటే 1,33,676 కేసులు భర్త లేదా బంధువుల క్రూరత్వానికి సంబంధించినవి కాగా, మరో 19.8 శాతం (88,605) కేసులు మహిళల కిడ్నాప్‌ కేసులుగా వున్నాయి. అలాగే 18.71 శాతం కేసులు( 83,891) మహిళల గౌరవాన్ని దెబ్బతీసే ఉద్దేశంతో జరిగిన దాడులు కాగా, మిగిలిన 14.8 శాతం (66,232) పోక్సో చట్టం కింద నమోదైన కేసులు.

తగ్గిన హత్య కేసులు
2022తో పోలిస్తే 2023లో హత్య కేసుల్లో స్వల్పంగా 2.8 శాతం తగ్గుదల కనిపించింది. 2022లో దేశంలో 28,522 హత్య కేసులు నమోదు కాగా, 2023లో 27,721 కేసులు నమోదయ్యాయి. వీటిలో వివాదాలకు సంబంధించిన కేసులు అత్యధికంగా 9,209 ఉన్నాయి. తరువాత స్థానంలో ప్రతీకారం లేదా శత్రుత్వంతో హతమార్చిన కేసులు 3,458 గా ఉన్నాయి. 2023లో దేశవ్యాప్తంగా 62,41,569 కేసులు నమోదు కాగా, వీటిలో 37,63,102 కేసులు ఇండియన్‌ పీనల్‌ కోడ్‌ కింద మిగిలిన 24,78,467 కేసులు ప్రత్యేక, స్థానిక చట్టాల కింద నమోదయ్యాయి. 2022తో పోలిస్తే 2023లో కేసుల నమోదులో 7.2 శాతం (4,16,623) పెరుగుదల కనిపించింది. అలాగే, ప్రతీ లక్ష జనాభాకు నమోదైన నేరాల రేటును పరిశీలిస్తే అది కూడా పెరిగింది. 2022లో ప్రతీ లక్ష జనాభాకు 422.2 కేసులు నమోదు కాగా, 2023లో ఇది 448.3కు పెరిగింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -