Wednesday, October 1, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంచదువులో మహిళలు, ఖైదీలు ఆదర్శం

చదువులో మహిళలు, ఖైదీలు ఆదర్శం

- Advertisement -

తెలంగాణ గవర్నర్‌ జిష్ణుదేవ్‌ వర్మ
ఘనంగా అంబేద్కర్‌ వర్శిటీ 26వ స్నాతకోత్సవం
కవి, రచయిత గోరటి వెంకన్న, రచయిత ప్రేమ్‌ రావత్‌కు గౌరవ డాక్టరేట్‌ల ప్రదానం


నవతెలంగాణ-సిటీబ్యూరో
విద్యను అభ్యసించడంలో, అవకాశాలను అందిపుచ్చుకోవడంలో మహిళలను, ఖైదీలను యువత ఆదర్శంగా తీసుకోవాలని తెలంగాణ గవర్నర్‌ జిష్ణుదేవ్‌ వర్మ అన్నారు. డా.బిఆర్‌.అంబేద్కర్‌ సార్వత్రిక విశ్వవిద్యాయలయం (ఓపెన్‌ యూనివర్శిటీ) 26వ స్నాతకోత్సవం మంగళవారం విశ్వవిద్యాలయ ప్రాంగణంలో వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా గవర్నర్‌ మాట్లాడుతూ.. ప్రతిభ గల విద్యార్థులకు అనేక అవకాశాలు ఉన్నాయని, అయితే చదువుతోపాటు ఇండిస్టీకి అవసరమైన సాంకేతిక నైపుణ్యం, డిజిటల్‌ లిటరసీ నైపుణ్యాలను పెంపొందించుకోవాలని సూచించారు. డిజిటల్‌ విద్య, నైపుణ్య సాధికారత, విద్యార్థులకు ఉపాధి కల్పనకు అంబేద్కర్‌ ఓపెన్‌ యూనివర్సిటీ చేస్తున్న కృషిని అభినందించారు.

ఆదివాసీ, గిరిజన విద్యార్థులకు ఉచిత విద్య అందించడం, సమాజంలో అందరికీ సమాన అవకాశాలు కల్పించడానికి యూనివర్సిటీ చేస్తున్న ప్రయత్నం గొప్పదని ప్రశంసించారు. ట్రాన్స్‌జెండర్‌ విద్యార్థులు, వికలాంగులకు స్కాలర్‌షిప్‌ కూడా అందించడం సంతోషకరమన్నారు. ఉద్యోగం చేస్తూ చదువుకోవడం, గృహిణులు, సీనియర్‌ సిటిజన్లు, వికలాంగులు, పేద విద్యార్థులు, ఖైదీలకు అంబేద్కర్‌ యూనివర్సిటీ ఓ గొప్ప అవకాశంగా గవర్నర్‌ అభివర్ణించారు. ఇందిరాగాంధీ నేషనల్‌ ఓపెన్‌ యూనివర్సిటీ (న్యూఢిల్లీ) వీసీ ప్రొ.ఉమా కాంజీలాల్‌ మాట్లాడుతూ.. మారుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో సాంకేతిక పరిజ్ఞానం కీలక భూమిక పోషిస్తోందని, దేశ విద్యావ్యవస్థను రూపొందించడంలో దూర, డిజిటల్‌ విద్య ఓ కీలక శక్తిగా మారిందని అన్నారు.

దీని ద్వారా విద్యార్థి తనకు నచ్చిన విద్యా సంస్థలో నచ్చిన కోర్సును అభ్యసించే వెసులుబాటు ఏర్పడిందని చెప్పారు. మూక్స్‌ ద్వారా వర్చువల్‌ ల్యాబ్‌లు, కృత్రిమ మేధస్సు వంటి సాంకేతికతలను విస్తృత పరచడంలో ఓడిడీఎల్‌ కీలకం కానుందన్నారు. కరోనా వంటి మహమ్మారి దేశ విద్యా వ్యవస్థను చిన్నాభిన్నం చేయగా.. అంబేద్కర్‌ ఓపెన్‌ యూనివర్సిటీ అవలంబిస్తున్న ఓడీఎల్‌ సిస్టం ద్వారా అందరికీ మార్గదర్శిగా నిలిచిందని, ఉన్నత విద్యా వ్యాప్తిలో ఓపెన్‌ యూనివర్సిటీ కృషిని ఆమె ప్రశంసించారు. విశ్వవిద్యాలయ ఉప కులపతి ప్రొ.ఘంటా చక్రపాణి విద్యా సంవత్సర వార్షిక నివేదికను సమర్పించారు.

గోరటి వెంకన్న, ప్రేమ్‌ రావత్‌కు గౌరవ డాక్టరేట్‌లు
ఈ స్నాతకోత్సవంలో ప్రఖ్యాత గేయ రచయిత, కవి గోరటి వెంకన్న తెలుగు సాహిత్యానికి చేసిన సేవలకుగాను గౌరవ డాక్టరేట్‌ను గవర్నర్‌, వీసీలు అందించారు. అదేవిధంగా శాంతి విద్యా ప్రచారకులు, పాఠశాలల్లో విద్యార్థుల చేరికలను పెంపొందించి, నేరాల శాతం తగ్గించడానికి కృషి చేసిన రచయిత ప్రేమ్‌ రావత్‌కు గౌరవ డాక్టరేట్‌ అందజేసి సన్మానించారు. ఈ సందర్భంగా 86 మంది విద్యార్థులకు బంగారు పతకాలతోపాటు డిగ్రీలు/డిప్లొమాలు/సర్టిఫికెట్‌ కోర్సుల్లో ఉత్తీర్ణులైన 60,288 మందికి పట్టాలను ప్రదానం చేశారు. అలాగే, 203 మంది ఖైదీలకు డిగ్రీ పట్టాలిచ్చారు. వారిలో ఇద్దరు బంగారు పతకాలు అందుకున్నారు. ఈ స్నాతకోత్సవంలో పలువురు విశ్వవిద్యాలయ పాలకమండలి సభ్యులు, విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి డా.యోగితా రాణా, అన్ని విభాగాల డీన్‌లు, డైరెక్టర్స్‌ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -