నవతెలంగాణ – హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల ప్రజలకు వాతావరణ శాఖ కీలక హెచ్చరిక జారీ చేసింది. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం కారణంగా రానున్న రెండు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రకటించింది. ఈ నేపథ్యంలో నేడు కోస్తాంధ్ర, తెలంగాణ ప్రాంతాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ప్రజలు, అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
ప్రస్తుతం బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన అల్పపీడనం వేగంగా బలపడుతోందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఇది పశ్చిమ వాయవ్య దిశగా కదులుతూ రేపు తెల్లవారుజాము నాటికి వాయుగుండంగా మారే అవకాశం ఉంది. ఆ తర్వాత కూడా ఇదే దిశలో ప్రయాణించి, 3వ తేదీన దక్షిణ ఒడిశా – ఉత్తర కోస్తాంధ్ర మధ్య తీరాన్ని దాటవచ్చని అధికారులు చెబుతున్నారు.