Thursday, October 2, 2025
E-PAPER
Homeకరీంనగర్భూ వివాదాలు... కత్తిపోట్లు

భూ వివాదాలు… కత్తిపోట్లు

- Advertisement -

– సిరిసిల్లలో వరుస కత్తిపోట్ల కలకలం..
– భూ వివాదం లో మాజీ కౌన్సిలర్ హత్య
– ఆరు నెలల క్రితం బాలుడు మృతి
– మూడు మాసాల క్రితం చిన్నమ్మను హతమార్చిన యువకుడు..బాబాయి కుటుంబంపై దాడి.
– భూ వివాదంలో ఓ కుటుంబం ప్రాణాలమీదకు…
నవతెలంగాణ – రాజన్న సిరిసిల్ల

రోజురోజుకు మానవత్వం మంట కలిసిపోతుంది. భూ వివాదాలు చిచ్చు పెడుతున్నాయి. సొంత తండ్రి, సోదరులు , స్నేహితులను హతమార్చే విధంగా ప్రేరేపిస్తున్నాయి. అమాయక ప్రజల ఆశలే ఆసరాగా పంచాయతీ పెద్దలు పూట గడుపుకుంటున్నారు. ఇలాంటి  ఘటనలకు రాజన్న సిరిసిల్ల జిల్లా వేదికయ్యింది. ఏళ్ల నుంచి తనతో ఉండే వ్యక్తులే నమ్మించి భూ వివాదంలో మాజీ కౌన్సిలర్ ను ఇటీవల హత్య చేసిన సంఘటన రాజన్న సిరిసిల్ల జిల్లాలో సంచలనం రేపింది.భూ వివాదం ఇద్దరు అన్నదమ్ముల కుటుంబాలను చిదిమేసింది. ఈ ఘటనలో ఓ కుటుంబం ప్రాణాల మీదకు రాగా, బంధువులతో సహా మరో కుటుంబం కటకటాల పాలయ్యింది. శాంతినగర్ లోని కొద్ది రోజుల క్రితం భూమి వివాదంలో సొంత బాబాయి తోపాటు సోదరుడిపై యువకుడు కత్తితో దాడి చేశాడు. మూడు మాసాల క్రితం  చంద్రంపేటలోని భూ వివాదంలో సొంత బాబాయి కుటుంబం పై ఇద్దరన్నదమ్ములు కత్తులతో దాడి చేశారు.

కత్తిపోట్ల కలకలం
సిరిసిల్లలో వరస కత్తిపోట్లు కలకలం రేపుతున్నాయి. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రానికి చెందిన మాజీ కౌన్సిలర్ సిరిగిరి రమేష్ గత 25 ఏళ్ల నుంచి రియల్ ఎస్టేట్ వ్యాపారంలో పేరు పొందాడు కొన్నేళ్ల నుంచి తనతో ఉండే ముగ్గురు వ్యక్తులు భూ వివాదంలో సమస్యలు నెలకొని రియాల్టర్ రమేష్ ను హతమార్చడం జిల్లాలో సంచలనం రేపింది.  పట్టణంలోని శాంతినగర్ కు చెందిన కలికోట పృథ్వి అనే యువకుడు ఓ భూ వివాదంలో బాబాయి కుటుంబం పై కత్తితో దాడి చేశాడు ఈ ఘటనలో బాబాయి వెంకటేష్ చిన్నమ్మ ఏంజెల్ లకు స్వల్ప గాయాలు కాగా వారి ఏడాది కుమారుడికి తీవ్ర గాయాలు కాగా ఆ బాలుడు కరీంనగర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు.  అలాగే సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని 12వ వార్డు చంద్రంపేటకు చెందిన కోలకాని నర్సయ్య, అంజయ్య ఇద్దరు అన్నదమ్ముల కుటుంబాల మధ్య కొంతకాలంగా భూ వివాదం కొనసాగుతోంది. ఇటీవల నర్సయ్య కొడుకు నాగరాజుకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు కాగా వివాదంలో ఉన్న భూమిలో ఇల్లు కట్టుకుందామని చదును చేయడానికి ప్రయత్నించాడు. ఈ క్రమంలో అంజయ్య అతని కొడుకు పర్షరాములు ఆ భూమిలో తమకు వాటా ఉందని గొడవకు దిగారు. ఆ గొడవ కాస్త చిలికి చిలికి గాలి వానగా మారి కత్తిపోట్లకు దారి తీసింది.

పథకం ప్రకారమే చేస్తున్నారా..
సిరిసిల్లలోని అంబేద్కర్ నగర్ కు చెందిన సిరిగిరి రమేష్ రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఎంతో పేరు పొందాడు ఆయన భూ వివాదంలోనే హత్యకు గురయ్యాడు. అతన్ని నమ్మించి వేములవాడ కమాన్ వద్ద గల రమేష్ వెంచర్ దగ్గరకు తీసుకువెళ్లి అతన్ని హత్య చేశారు. రమేష్ హత్య కేసులో ముగ్గురు నిందితులు కాగా ఇద్దరిని పోలీసులు  అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు మరో వ్యక్తి పరారీలో ఉన్నట్లు పోలీసులు పేర్కొంటున్నారు.అలాగే చంద్రంపేటకు చెందిన నాగరాజు తన బాబాయి అంజయ్యతో వివాదంలో ఉన్న భూమి తమకు చెందాలంటే తమ బాబాయి కుటుంబాన్ని హతమార్చాలని నాగరాజు అతని సోదరుడు శ్రీనివాస్ ముందుగానే పథకం వేసుకున్నారు. హత్య చేయడం కోసం ముందుగానే కత్తులు తీసుకువచ్చి ఇంట్లో పెట్టుకున్నారు. భూమి దగ్గర జరిగిన గొడవ పెద్దది చేసి నాగరాజు అతని సోదరుడు శ్రీనివాస్ తమ కుటుంబంతో సహా అంజయ్య అతని కుమారుడు పర్షరాములుపై దాడికి దిగారు. ముందుగానే పథకం ప్రకారం తెచ్చుకున్న కత్తులతో నాగరాజు మామ వేములవాడ రూరల్ మండలం మారుపాక కు చెందిన వేముల భూమయ్య అతని కుమారులు నాగరాజు, ప్రశాంత్, బామ్మర్ది మల్లేశం సహకారంతో కత్తులతో దాడికి చెయ్యగా, అంజయ్యకు స్వల్ప గాయాలు అయ్యాయి. ఆయన కుమారుడు పర్షరాములుకు తీవ్ర గాయాలు కాగా, స్థానికులు వెంటనే సిరిసిల్ల ప్రధాన ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో కరీంనగర్ లోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు.

ఫలించని పంచాయతీలు
మాజీ కౌన్సిలర్ సిరిగిరి రమేష్ కు సంబంధించి భూమి విషయంలో హత్యకు పాల్పడిన వారితో పంచాయతీ ఉన్నట్లు తెలిసింది. గత కొన్ని ఏళ్లుగా కొలకాని నర్సయ్య, అంజయ్య ఇరువురు అన్నదమ్ముల మధ్య వారసత్వంగా వచ్చిన భూముల విషయంలో గొడవ జరుగుతున్నాయి. కొన్నేళ్ల క్రితం నర్సయ్య మరణించగా అప్పటి నుండి ఆయన కుమారులు, సోదరుడు అంజయ్య కుటుంబం మధ్య భూ వివాదాలు కొనసాగుతూనే ఉన్నాయి. తమ ఇండ్ల వద్ద ఉన్న 13 గుంటల భూమి విషయంలో ఇరు కుటుంబాల మధ్య కొంతకాలంగా గొడవలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో అదే వార్డుకు చెందిన కొంతమంది పెద్దమనుషులను ఇరు కుటుంబాలు ఆశ్రయించగా ఆ పెద్దమనుషులు పంచాయతీలు జరుగుతున్నట్లు విమర్శలు వస్తున్నాయి. ఈ విషయంలో నాగరాజు సిరిసిల్ల పోలీసులను కూడా ఆశ్రయించినట్లు తెలిసింది. పెద్ద మనుషుల సమక్షంలో భూవివాదం పరిష్కరించుకోవాలని ఇరు కుటుంబాలకు పోలీసులు సూచించగా, పెద్దమనసులు పంచాయతీని వాయిదా వేస్తూ వచ్చినట్లు సమాచారం. పెద్దమనుషుల నిర్లక్ష్యం వల్లనే ఇరు కుటుంబాల మధ్య ఈ దారుణం జరిగిందని స్థానికులు చర్చించుకుంటున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -