Thursday, October 2, 2025
E-PAPER
Homeఅంతర్జాతీయంఅమెరికాలో షట్‌డౌన్‌

అమెరికాలో షట్‌డౌన్‌

- Advertisement -

ప్రభుత్వ సేవలకు అంతరాయం
భారీగా ఉద్యోగులను తొలగిస్తానంటూ ట్రంప్‌ బెదిరింపులు

వాషింగ్టన్‌ : వ్యయ బిల్లు ఆమోదంపై ప్రతినిధి సభ సభ్యులు ఏకాభిప్రాయానికి రాలేకపోవడంతో అమెరికా ప్రభుత్వం పాక్షికంగా షట్‌డౌన్‌ అయింది. ప్రభుత్వ సేవలను కొనసాగించడానికి వ్యయ బిల్లును ఆమోదించడం తప్పనిసరి కావడంతో చివరి నిమిషం వరకూ ప్రయత్నాలు జరిగాయి. కానీ డెమొక్రాట్ల ప్రతిపాదనలను రిపబ్లికన్లు, రిపబ్లికన్ల ప్రతిపాదనలను డెమొక్రాట్లు తోసిపుచ్చడంతో షట్‌డౌన్‌ అనివార్యమైంది. 1980వ సంవత్సరం నుంచి ఇప్పటి వరకూ అమెరికా ప్రభుత్వం పదిహేను సార్లు పాక్షికంగా షట్‌డౌన్‌ అయింది. అయితే వాటితో పోలిస్తే ఇప్పటి షట్‌డౌన్‌ తీవ్ర నష్టాన్ని కలిగించే అవకాశం ఉంది. వ్యయ బిల్లుకు ప్రతినిధి సభ ఆమోదం లభించక పోవడంతో అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. నిధుల కొరత ఎదురవడంతో ఉద్యోగాల సంఖ్యను భారీగా కుదిస్తానని ఆయన బెదిరించారు.

వీగిపోయిన తీర్మానాలు
ప్రభుత్వాన్ని మరో తొమ్మిది వారాల పాటు నడిపేందుకు రిపబ్లికన్‌ పార్టీ రూపొందించిన వ్యయ బిల్లును ఈ నెల ప్రారంభంలో డెమొక్రాట్లు తిరస్కరిం చారు. షట్‌డౌన్‌ను నివారించడానికి చివరి క్షణం వరకూ రిపబ్లికన్లు ప్రయత్నిం చినా ప్రయోజనం లేకపోయింది. నవంబర్‌ 21వ తేదీ వరకూ వ్యయ బిల్లుకు అనుమతిం చాలంటూ వారు ప్రవేశపెట్టిన తీర్మానం 55-45 ఓట్లతో వీగిపోయిం ది. బిల్లుకు ఆమోదం లభించాలంటే 60 ఓట్లు అవసరమౌతాయి. ఇద్దరు డెమొక్రాట్లు, ఒక స్వతంత్ర సభ్యుడు బిల్లును సమర్ధించినప్పటికీ అది సభ ఆమోదం పొందల ేకపోయింది. ఓ రిపబ్లికన్‌ సభ్యుడు బిల్లును వ్యతిరేకిస్తూ ఓటేశారు. కాగా అక్టోబర్‌ వరకూ నిధులు విడుదల చేయాలని, ఆరోగ్య రక్షణపై ప్రస్తుతం చేస్తున్న ఖర్చును ట్రిలియన్‌ డాలర్లకు పైగా పెంచాలని కోరుతూ డెమొక్రాట్లు ప్రతిపాదించిన బిల్లును రిపబ్లికన్లు తిప్పికొట్టారు. 47-53 ఓట్లతో బిల్లు వీగిపోయింది. ప్రస్తుత ప్రతిష్టంభనకు మీరంటే మీరే కారకులంటూ ఇరు పక్షాలు పరస్పరం నిందించు కున్నాయి. అమెరికాలో చిట్టచివరిసారిగా 2018లో జరిగిన షట్‌డౌన్‌ ఆ దేశ చరిత్రలోనే సుదీర్ఘ కాలం…అంటే 34 రోజులు కొనసాగింది.

బలవంతంగా సెలవుపై…
ప్రస్తుత షట్‌డౌన్‌ కారణంగా ఏడున్నర లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులు బలవంతంగా తాత్కాలికంగా సెలవుపై వెళ్లిపోవాల్సి ఉంటుందని ఆర్థికవేత్తలు ఆందోళన వ్యక్తం చేశారు. కొందరు ఉద్యోగులను ట్రంప్‌ శాశ్వతంగా ఇంటికి సాగనంపు తారన్న అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది. కాగా ప్రభుత్వ షట్‌డౌన్‌ను సాకుగా చూపించి కంపెనీలు విషపూరిత కాలుష్యాన్ని వాతావరణంలోకి వదిలే ప్రమాదం ఉన్నదని పర్యావరణవేత్తలు హెచ్చరించారు.

పని చేసినా జీతం ఉండదు
‘షట్‌డౌన్‌ సమయంలో మనం కొన్ని పనులు చేయవచ్చు. అవి తిరుగులేనివి. వాటిని మార్చడం ఎవరికీ సాధ్యం కాదు. ఆ పనులు డెమొక్రాట్లకు నష్టం కలిగిస్తాయి. వాటిని వారు మార్చలేరు. ఉద్యోగులను ఇంటికి సాగనంపడం, డెమొక్రాట్లకు ఇష్టం లేని పనులు చేయడం, వారు ఇష్టపడే కార్యక్రమాలలో కోత విధించడం…ఇలాంటి పనులు ఎన్నో చేయవచ్చు’ అని ట్రంప్‌ అధ్యక్ష భవనంలో విలేకరులకు చెప్పారు. కాగా 2018 తర్వాత అమెరికాలో షట్‌డౌన్‌ జరగడం ఇదే మొదటిసారి. దీని కారణంగా అత్యవసరం కాని కొన్ని ప్రభుత్వ సేవలు నిలిచిపోతాయి.

కీలక ఆర్థిక డేటా ప్రచురణ, చిన్న చిన్న వ్యాపారులకు రుణ అనుమతులు వంటి సేవలకు ఆటంకం కలుగుతుంది. అత్యవసర విధులు నిర్వర్తించే పోలీసు అధికారులు, సైనిక సిబ్బంది, ట్రాఫిక్‌ నియంత్రణ సిబ్బంది వంటి వారి ఉద్యోగాలకు ఎలాంటి ఢోకా ఉండదు. అయితే షట్‌డౌన్‌ కాలంలో వారికి జీతం లభించదు. సామాజిక భద్రత, ఆహార సాయం వంటి పనులకు నిధులు అందజేస్తారు. వేలాది మంది ప్రభుత్వ ఉద్యోగులను తాత్కాలిక సెలవుపై పంపించి వేస్తారు. గతంలో షట్‌డౌన్లు జరిగినప్పుడు వీరు విధులకు హాజరైన తర్వాత జీతాలు చెల్లించారు. ఇప్పుడు ఉద్యోగులను అధిక సంఖ్యలో ఇంటికి సాగనంపుతానని ట్రంప్‌ హెచ్చరికలు జారీ చేశారు. వారంతా డెమొక్రాట్లేనని నిందించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -