స్థానిక ఎన్నికల్లో బీజేపీని ఓడించడమే లక్ష్యం
సర్దుబాట్లపై 4న రాష్ట్ర కమిటీలో నిర్ణయం
ఏజెన్సీలో గిరిజనేతరులకు రిజర్వేషన్లు ఆపాలి : సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
రాష్ట్రంలో సీపీఐ(ఎం) బలంగా ఉన్న ప్రాంతాలు, ప్రజా ఉద్యమాలను నిర్మించిన చోట స్థానిక సంస్థల ఎన్నికల్లో సొంతంగానే పోటీకి సన్నద్ధమవుతున్నామని ఆపార్టీ రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ చెప్పారు. బుధవారం హైదరాబాద్‌లోని ఎంబీ భవన్‌లో తనను కలిసిన విలేకర్లతో ఆయన మాట్లాడారు. వామపక్ష పార్టీలతో అవసరమైన చోట్ల సీట్ల సర్దుబాటు చేసుకోవాల్సి ఉంటుందన్నారు. వాటిపై చర్చించుకుని ముందుకెళ్తామని చెప్పారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీని ఓడించ డమే తమ రాజకీయ కర్తవ్యమని స్పష్టం చేశారు. ఆపార్టీ దేశవ్యాప్తంగా ప్రజాస్వామిక హక్కులు, లౌకిక విలువలు, రాజ్యాంగాన్ని నిర్వీర్యం చేస్తున్నదనీ, మతోన్మాద రాజకీయాలు చేస్తున్న బీజేపీని ఓడించాలని ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు.
రాష్ట్రంలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లకు బీజేపీ అడ్డుపడిందని విమర్శించారు. కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధులను ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. భూమి కోసం, భుక్తి కోసం, పేద ప్రజల విముక్తి కోసం తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం సాగిందని గుర్తు చేశారు. దాన్ని హిందూ, ముస్లింలకు మధ్య జరిగిన పోరాటంగా బీజేపీ చరిత్రను వక్రీకరిస్తు న్నదని ఆక్షేపించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో సీపీఐ(ఎం), వామపక్ష పార్టీలను ప్రజలు బలపర్చాలనీ, బీజేపీని ఓడించాలని పిలుపు నిచ్చారు. తాము పోటీ చేయని చోట్ల ఎన్నికల్లో సర్దుబాటు, కార్యాచరణ ఎలా ఉండాలనే దానిపై అక్టోబర్ 4వ తేదీ పార్టీ రాష్ట్ర కమిటీ సమా వేశంలో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు.
ఆ జెడ్పీ చైర్మెన్ స్థానాలు ఎస్టీలకే ఉండాలి
ఏజెన్సీ ప్రాంతం స్థానికసంస్థల ఎన్నికల్లో గిరిజనేతరులకు రిజర్వేషన్లు కేటాయించడాన్ని వెంటనే నిలిపేయాలని జాన్‌వెస్లీ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఐదో షెడ్యూల్ ప్రాంతంలో గిరిజనేతరులకు రిజర్వేషన్ అమలు చేయొద్దంటూ నిబంధనలున్నాయని చెప్పారు. ఐదో షెడ్యూల్ ప్రాంతంలోని జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలను కూడా గిరిజనులకే రిజర్వ్ చేయాలనీ, ఏజెన్సీ బయట ఉన్న ప్రాంతంలో మిగిలిన వారికి రిజర్వేషన్లు ఇవ్వాలని సూచించారు. షెడ్యూల్ ప్రాంతంలో గిరిజనేతరులకు అవకాశమిచ్చే రొటేషన్ పద్ధతిని ఆపాలని డిమాండ్ చేశారు. గిరిజన జనాభా అధికంగా ఉన్న జిల్లాల్లో జిల్లా పరిషత్ చైర్మెన్ స్థానాలకు ఎస్టీ రిజర్వేషన్ ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వానికి సూచించారు.
ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన జిల్లా పరిషత్ రిజర్వేషన్లలో గిరిజనులకు తీవ్ర అన్యాయం జరుగుతున్నదనీ, ఆదివాసీలు అధికంగా ఉన్న భద్రాద్రి కొత్తగూడెం, ఆదిలాబాద్, కొమరం భీం ఆసిఫాబాద్, మహబూబాబాద్ జెడ్పీ చైర్మెన్ స్థానాలను జనరల్ స్థానాలుగా ప్రకటించడం సరైంది కాదని చెప్పారు. రిజర్వేషన్లు రాజ్యాంగంలోని ఐదో షెడ్యూల్ హక్కులకు, పీసా చట్టాలను నీరుగార్చేలా ఉన్నాయని విమర్శించారు. ఐదో షెడ్యూల్ ప్రాంతంలో ఉన్న జెడ్పీ చైర్మెన్, జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాల్లో ఎస్టీ రిజర్వేషన్ కొనసాగించేలా ఉత్తర్వులను సవరించాలని డిమాండ్ చేశారు. ఐదో షెడ్యూల్ హక్కులను హరించేలా, అక్కడ నివసిస్తున్న స్థానిక ఆదివాసీ ప్రజల అవకాశాలను దూరం చేసేలా ఉన్న ఈ నిర్ణయాలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.