Thursday, October 2, 2025
E-PAPER
Homeప్రధాన వార్తలుసమరానికి సిద్ధం

సమరానికి సిద్ధం

- Advertisement -

అన్ని పార్టీలకూ ‘స్థానిక’ ఛాలెంజ్‌
అధికార పార్టీని కలవర పెడుతున్న ఎన్నికల హామీలు
క్షేత్రస్థాయిలో కమిటీల్లేక కళతప్పిన బీఆర్‌ఎస్‌
గ్రామీణంలో బీజేపీకి పట్టు అంతంతే
జిల్లా, మండల కమిటీల్లో అంతర్గత కుమ్ములాటలు
బలమున్న చోట్ల సీపీఐ(ఎం) ఒంటరిపోటీ
కాంగ్రెస్‌తో కలిసి వెళ్లేందుకే సీపీఐ మొగ్గు


నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
రాష్ట్రంలో స్థానిక ఎన్నికల సమరానికి సర్వం సిద్ధమైంది. రాష్ట్ర ఎన్నికల సంఘం కూడా షెడ్యూల్‌ను ప్రకటించింది. ఈ ఎన్నికలపై హైకోర్టులో కేసు పెండింగ్‌లో ఉన్నా, 8వ తేదీ నాటికి తీర్పు వెలువడు తుందని భావిస్తున్నారు. కోర్టు వ్యవహారం ఎలా ఉన్నా, స్థానికంగా రాజకీయపార్టీల్లో ఎన్నికల వేడి మొదలైంది. అభ్యర్థుల ఎంపికల పై ఊహాగానాలు మొదలయ్యాయి. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో సర్పంచ్‌, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో గెలుపొందటం అన్ని పార్టీలకూ పెద్ద ఛాలెంజే. ఈ ఎన్నికల్లో యువతరం ఓట్లే కీలకం కానున్నాయి. స్థానిక సంస్థల ఎన్నికల్లో జాతీయ అంశాలు ప్రభావం చూపే అవకాశాలు తక్కువ. రాష్ట్ర, స్థానిక అంశాలే ప్రధాన ఎజెండాగా మారతాయి. ఇది బీజేపీకి మైనస్‌గా మారే అవకాశముంది. క్షేత్రస్థాయిలో పట్టులేకపోవడంతో ఆ పార్టీకి పెద్దగా బలం కనిపించట్లేదు. అసెంబ్లీ ఎన్నికల్లో 8 స్థానాలే దక్కించుకున్న బీజేపీ, పార్లమెంట్‌ ఎన్నికల్లోనూ 8 స్థానాల్లో విజయం సాధించింది.

ఇది రాష్ట్రంలోని సగం సీట్లకు ప్రాతినిధ్యం వహించినట్టే. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను రాజకీయంగా దెబ్బకొట్టేందుకు బీఆర్‌ఎస్‌ ఓటు బ్యాంకు పెద్దఎత్తున బీజేపీకి బదిలీ అయిందనేది బహిరంగ రహస్యమే! ఎన్నికల ఫలితాల్లో ఈ విషయం స్పష్టంగా కనిపించింది. అయితే స్థానిక ఎన్నికల్లో రాజకీయ పరిస్థితులు పూర్తి భిన్నంగా ఉంటాయి. రాష్ట్రంలో క్షేత్రస్థాయిలో ఇప్పటికీ బీజేపీకి బలం లేదు. ఆపార్టీ అనుబంధం కమిటీలన్నీ కలగూర గంప తరహాలోనే ఉన్నాయి. మండల, జిల్లా కమిటీల్లో అంతర్గత కుమ్ములాటలు ఉన్నాయి. సిద్దిపేట, వికారాబాద్‌ జిల్లాల్లో జిల్లా అధ్యక్షులనే మార్చాలనే డిమాండ్‌తో క్యాడర్‌ రోడ్డెక్కిన విషయం తెలిసిందే. ఉమ్మడి మహబూబ్‌ నగర్‌, నల్లగొండ, ఖమ్మం, కరీంనగర్‌, నిజామాబాద్‌, రంగారెడ్డి, హైదరాబాద్‌ జిల్లాల నాయకుల మధ్యా విభేదాలు తీవ్రస్థాయిలో ఉన్నాయి. ఈ విషయాన్ని ఆపార్టీ నుంచి బహిష్కృతుడైన ఎమ్మెల్యే రాజాసింగ్‌ స్వయం గా వెల్లడించిన విషయం తెలిసిందే.

అసెంబ్లీ, పార్లమెంట్‌ ఎన్నికల్లో వరుస ఓటముల తర్వాత బీఆర్‌ఎస్‌ పార్టీలో ఎలక్షన్‌ జోష్‌ తగ్గింది. మాజీ సీఎం కేసీఆర్‌ అసలు జనంలోకి రావడమే మానేశారు. నియోజక వర్గాల్లో ఓటమిపాలైన నేతలు క్యాడర్‌ను పట్టించుకోకపోవడం మానేశారు. కుటుంబ కలహాలు, ఎమ్మెల్సీ కవిత బహిష్కరణ, లిక్కర్‌ కుంభకోణం, కాళేశ్వరం, ఈ-కార్‌రేస్‌ వంటి అనేక అంశాల్లో బీఆర్‌ఎస్‌ అగ్రనాకత్వంపై అవినీతి ఆరోపణలు వెంటాడుతూనే ఉన్నాయి. దీనితో ఆ పార్టీ శ్రేణులన్నీ గందరగోళం లో ఉన్నాయి. ఎక్కడా గ్రామ, జిల్లా స్థాయిల్లో కమిటీల్లేవు. బీఆర్‌ఎస్‌ కేవలం సోషల్‌ మీడియాలో మాత్రమే యాక్టివ్‌గా ఉందనే విమర్శలు లేకపోలేదు. కాంగ్రెస్‌ ప్రభుత్వ బాకీ కార్డు తమను గట్టెక్కిస్తుందనే ఏకైక విశ్వాసంతో ఆపార్టీ అగ్రనాయకత్వం ఉంది.

కాంగ్రెస్‌పార్టీ బీసీలకు 42 శాతం రిజర్వేషన్లపైనే ఆశలు పెట్టుకుంది. అవి అమల్లోకి వస్తే రాజకీయంగా తిరుగుండదనే ప్రచారం జరుగుతోంది. అయితే ఈ విషయం కోర్టు తీర్పుపైనే ఆధారపడి ఉండటం గమనార్హం. ఒకవేళ రిజర్వేషన్ల అమలుకు అవాంతరాలు ఏర్పడితే, బీజేపీ, బీఆర్‌ఎస్‌పై నెపాన్ని నెట్టేయాలనే రాజకీయ వ్యూహరచన కూడా సాగుతోంది. మరోవైపు అధికార కాంగ్రెస్‌ పార్టీ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీల్లో మెజారిటీ ఇప్పటికీ అమలుకాలేదు. ఆరు గ్యారెంటీల్లో మూడు ఇంకా పెండింగ్‌లోనే ఉన్నాయి. ఖజానా ఖాళీ అని సీఎం రేవంత్‌రెడ్డి ప్రజల్లో చర్చను లేవనెత్తే ప్రయత్నం చేస్తున్నా, ప్రజలు దాన్ని ఆమోదిస్తారా అనే సంశయం లేకపోలేదు.

స్థానిక సమరాన్ని దృష్టిలో ఉంచుకొనే ప్రభుత్వం ఉపాధి హామీ ఉద్యోగులు, గ్రామ కార్యదర్శుల పెండింగ్‌ బిల్లులను రెండ్రోజుల క్రితమే క్లియర్‌ చేసింది. సీపీఐ బలమున్న చోట్ల ఒంటరిగా పోటీ చేస్తూనే, కాంగ్రెస్‌తో కలిసి వెళ్లాలని భావిస్తున్నట్టు సమాచారం. సీపీఐ(ఎం) బలమున్న చోట్ల, ప్రజా ఉద్యమాలు బలంగా జరిగిన స్థానాల్లో స్థానిక ఎన్నికల్లో ఒంటరిగానే పోటీచేస్తామని ఆపార్టీ రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ ఇప్పటికే ప్రకటిం చారు. ఈ నేపధ్యంలోనే ఈనెల 4వ తేదీ జరిగే పార్టీ రాష్ట్ర కమిటీ సమావేశంలో నిర్ణయాలు తీసుకుంటామని తెలిపారు. మొత్తానికి స్థానిక పోరులో అన్ని రాజకీయ పార్టీలు తమ బలాలు, బలహీనతల్ని అంచనా వేసుకుంటూ, ముందుకు సాగాలని ప్రయత్నిస్తున్నాయి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -