Thursday, October 2, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంత్వరలో 17 వేల కానిస్టేబుల్‌ పోస్టుల భర్తీ

త్వరలో 17 వేల కానిస్టేబుల్‌ పోస్టుల భర్తీ

- Advertisement -

రాజకీయాలతో మాకు సంబంధం లేదు..మాది ఖాకీ బుక్‌
మావోయిస్టుల్లారా.. జనజీవస్రవంతిలో కలిస్తే ఆదుకుంటాం
సీఎస్‌బీ, ఈగల్‌ విభాగాలకు జవసత్వాలు కల్పిస్తాం
బేసిక్‌ పోలీసింగ్‌పై దృష్టి
స్థానిక సంస్థల ఎన్నికలను ప్రశాంతంగా జరిపిస్తాం : డీజీపీ బత్తుల శివధర్‌రెడ్డి

నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
త్వరలోనే 17 వేల పోలీస్‌ కానిస్టేబుళ్ల పోస్టులను భర్తీ చేస్తామని రాష్ట్ర పోలీస్‌ డైరెక్టర్‌ జనరల్‌ (డీజీపీ) బత్తుల శివధర్‌రెడ్డి ప్రకటించారు. స్థానిక సంస్థల ఎన్నికల బందోబస్తుపై ప్రత్యేక దృష్టిసారిస్తామనీ, ఆ ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా చూస్తామని హామీనిచ్చారు. బుధవారం హైదరాబాద్‌లోని డీజీపీ కార్యాలయంలో అదనపు డీజీ మహేశ్‌భగవత్‌ నుంచి శివధర్‌రెడ్డి ఉదయం 9:43 నిమిషాలకు డీజీపీగా బాధ్యతలను స్వీకరించారు. ఈ సందర్భంగా విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. స్థానిక ఎన్నికల సందర్భంగా రాజకీయ పక్షాలు తమ హద్దులను మీరకుండా ప్రచారపర్వాన్ని సాగించుకునేలా అన్నిరకాల జాగ్రత్తలను తీసుకుంటామన్నారు. తెలంగాణలో మావోయిస్టుల కార్యకలాపాలు దాదాపుగా తగ్గిపోయాయని గుర్తుచేశారు. మావోయిస్టులతో చర్చలు జరిపే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ప్రస్తుతమున్న మావోయిస్టులు జనజీవన స్రవంతిలో కలిస్తే వారిని అన్ని విధాలుగా ఆదుకుంటామని హామీనిచ్చారు. వారి అగ్రనేత మల్లోజుల వేణుగోపాల్‌ ఆయుధాలను వదిలేసి జనజీవన స్రవంతిలో కలిసే విషయంపై యోచన చేస్తున్నట్టు ప్రకటించారని గుర్తుచేశారు. ఈ విషయం ఎన్‌కౌంటర్‌లో మరణించిన మావోయిస్టు పార్టీ కార్యదర్శి బసవరాజు ఎలియాస్‌ నంబాల కేశవరావు బతికి ఉన్నప్పటి నిర్ణయంగా వేణుగోపాల్‌ స్టేట్‌మెంట్‌ను బట్టి తెలుస్తోందన్నారు.

రాష్ట్రంలో జరుగుతున్న ప్రతి అంశంపైనా పింక్‌బుక్‌లో నమోదు చేసుకుంటామని ప్రతిపక్ష నేతల నుంచి వస్తున్న వ్యాఖ్యలను ఆయన దృష్టికి విలేకర్లు తీసుకెళ్లగా…రాజకీయపరమైన వ్యాఖ్యలను, ప్రకటనల్ని తాము పట్టించుకోబోమనీ, తమది మాత్రం ఖాకీబుక్‌ అని చలోక్తి విసిరారు. సైబర్‌ సెక్యూరిటీ బ్యూరో, ఈగల్‌ విభాగాలకు మరిన్ని జవసత్వాలు కల్పిస్తామని హామీనిచ్చారు. పోలీసుల విధి నిర్వహణ అత్యంత ప్రాధాన్యతతో కూడుకున్నదనీ, విజిబుల్‌ పోలీసింగ్‌ వ్యవస్థ కారణంగా నేరాలకు అడ్డుకట్ట వేయగలుగుతు న్నామని వివరించారు. రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణ, నేరాల అదుపు విషయంలో ఇప్పటికే జాతీయ స్థాయిలో కీర్తిని గడించడం జరిగిందనీ, ఇకముందు కూడా పోలీస్‌ వ్యవస్థను సమిష్టిగా నడిపిస్తూ మంచి ఫలితాలను తీసుకొస్తామని హామీనిచ్చారు. తనపై నమ్మకం ఉంచి బాధ్యతలు అప్పగించిన రాష్ట్ర ప్రభుత్వానికీ, సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు కృతజ్ఞతలు తెలిపారు. తనపై ఉంచిన విశ్వాసాన్ని వమ్ముచేయబోనన్నారు. సోషల్‌మీడి యాలో హద్దులు దాటేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ కార్య క్రమంలో శాంతిభద్రతల అదనపు డీజీ మహేశ్‌భగవత్‌, మూడు పోలీస్‌ కమిషనరేట్ల సీపీలు వీసీ.సజ్జనార్‌, అవినాశ్‌మహంతి, సుధీర్‌బాబుతో పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు.

గవర్నర్‌, సీఎంలను కలిసిన డీజీపీ
బాధ్యతలు స్వీకరించిన అనంతరం రాష్ట్ర డీజీపీ బత్తుల శివధర్‌రెడ్డి నగర పోలీస్‌ కమిషనర్‌ వీసీ సజ్జనార్‌తో కలిసి రాష్ట్ర గవర్నర్‌ జిష్ణుదేవ్‌ వర్మను రాజ్‌భవన్‌లో, ముఖ్యమంత్రి నివాసంలో సీఎం రేవంత్‌రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావును ఆయన కార్యాలయంలో కలిశారు.

బాధ్యతల్లోకి ఇంటిలిజెన్స్‌ చీఫ్‌ విజయ్ కుమార్‌
రాష్ట్ర నిఘా విభాగం అధిపతిగా అదనపు డీజీ విజయ్ కుమార్‌ బుధవారం లక్డీకాపూల్‌లోని తన కార్యాలయంలో బాధ్యతలను స్వీకరించారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత ఆయన నాలుగో ఇంటిలిజెన్స్‌ చీఫ్‌గా ఎంపికయ్యారు. ఇంతకు ముందు ఆయన ఏసీబీ డైరెక్టర్‌ జనరల్‌గా, పోలీస్‌ కోఆర్డినేషన్‌ అదనపు డీజీగా, కేంద్ర ఇంటిలిజెన్స్‌ బ్యూరోలో ఎస్పీ, డీఐజీగా బాధ్యతలను నిర్వర్తించి మంచి పేరు సంపాదించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -