Thursday, October 2, 2025
E-PAPER
Homeజాతీయంలడఖ్‌ ప్రజలను జాతి వ్యతిరేకులుగా చిత్రీకరిస్తారా?

లడఖ్‌ ప్రజలను జాతి వ్యతిరేకులుగా చిత్రీకరిస్తారా?

- Advertisement -

ప్రభుత్వాన్ని నిలదీసిన మాజీ సైనిక, పోలీస్‌ అధికారులు
దేశ భద్రతా పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరిక


న్యూఢిల్లీ : లడఖ్‌ ప్రజలను జాతి వ్యతిరేకులుగా చిత్రీకరించడంపై పలువురు సీనియర్‌ సైనిక, పోలీసు మాజీ అధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి ప్రచారం తీవ్రమైన దేశ భద్రతా పరిణామాలకు దారితీస్తుందని హెచ్చరించారు. లడఖ్‌ ఉద్యమాన్ని కించపరచడానికి బీజేపీ అనుకూల సామాజిక మాధ్యమాలు, ప్రభుత్వంలోని కొన్ని వర్గాలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. ఉద్యమాన్ని పాకిస్తాన్‌ లేదా ఇతర విదేశీ శక్తులు ప్రభావితం చేస్తున్నాయని అవి ఆరోపించాయి. అయితే ఈ వాదనను పలువురు ఖండించారు. ఇలాంటి తప్పుడు ప్రచారం చేయవద్దని వారు హితవు పలికారు. లడఖ్‌ జనాభా మూడు లక్షల కంటే తక్కువే అయినప్పటికీ వేలాది మంది సైనికాధికారులకు, సైనికులకు, మాజీ సైనిక సిబ్బందికి అది స్వస్థలం. ఇటీవల జరిగిన పోలీసుకాల్పుల్లో కార్గిల్‌ యుద్ధ వీరుడు సెవాంగ్‌ తార్చిన్‌ చనిపోయారు. ఆయన తండ్రి కూడా సైన్యంలో గౌరవ కెప్టెన్‌గా పనిచేశారు. కాగా లడఖ్‌ వాసులపై జరుగుతున్న దుష్ప్రచారాన్ని బీజేపీ అనుకూల మాజీ మేజర్‌ జనరల్‌ జీడీ బక్షి సైతం తప్పుపట్టారు.

అత్యంత కీలకమైన, వ్యూహాత్మక సరిహద్దు రాష్ట్రంలో నివసిస్తున్న సాహసోపేతులు, దేశభక్తులైన ప్రజలను ఈ దేశం వదులుకోబోదని ఆయన తెలిపారు. ‘లడఖ్‌వాసుల డిమాండ్లు విపరీతమైనవేమీ కావు. వారు రాజ్యాంగంలోని ఆరో షెడ్యూలును కోరుకుంటున్నారు. అందులో తప్పేముంది? దానికి బీజేపీ హామీ ఇచ్చింది కూడా. దానిని ఎందుకు ఇవ్వకూడదు?’ అని ప్రశ్నించారు. కాగా అత్యంత విధేయులైన దేశభక్తులను తమ నుంచి దూరం చేస్తే ఈ దేశం భారీ మూల్యాన్ని చెల్లించుకోవాల్సి ఉంటుందని మాజీ లెఫ్టినెంట్‌ జనరల్‌ జీఎస్‌ పనగ్‌ హెచ్చరించారు. స్వతంత్ర ప్రతిపత్తి కల్పిస్తామని ఇచ్చిన హామీని గాలికి వదిలేసినందునే ఈ ప్రాంతంలో ఉగ్రవాద కార్యకలాపాలు ముమ్మరమ య్యాయని బీఎస్‌ఎఫ్‌ మాజీ డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ పోలీస్‌ ప్రకాష్‌ సింగ్‌ చెప్పారు. ఆరో షెడ్యూలు దేశ వ్యతిరేకమైనదైతే బీజేపీ తన 2019 ఎన్నికల మ్యానిఫెస్టోలో దానిని ఎందుకు చేర్చిందని పలువురు ప్రశ్నించారు. ఇటీవల జరిగిన హింసలో తన కుమారుడు తర్చిన్‌ను కోల్పోయిన మాజీ సైనికాధికారి వీడియోను కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ అప్‌లోడ్‌ చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -