– కేఎస్ రత్నంకు కేటాయిస్తే భారీ మెజార్టీతో గెలిపించుకుంటాం
– ఎమ్మెల్యే వ్యతిరేక వర్గీయులు
– మొయినాబాద్ బీఆర్‌ఎస్ నాయకులు
నవతెలంగాణ-చేవెళ్ల
చేవెళ్ల అసెంబ్లీ అభ్యర్థిత్వంపై సీఎం కేసీఆర్ పునరాలోచించాలని మొయినాబాద్ బీఆర్‌ఎస్ నాయకులు, ఎమ్మెల్యే వ్యతిరేక వర్గీయులు కోరారు. మంగళవారం చేవెళ్ల మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో వారు మాట్లాడుతూ….అవినీతి అక్రమాలకు పాల్పడుతున్న ఎమ్మెల్యే కాలె యాదయ్య అభ్యర్థిత్వాన్ని బీఆర్‌ఎస్ ముకుమ్మడిగా వ్యతిరేకి స్తున్నట్టు తెలిపారు. రాబోయె అనెంబ్లీ ఎన్నికల్లో చేవెళ్ల నియోజకవర్గంలో బీఆర్‌ఎస్ తరుపున ఎమ్మెల్యేగా కాలె యాదయ్యను ప్రకటించడంను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్టు చెప్పారు. ఎమ్మెల్యేగా యాదయ్య తొమ్మిదేండ్ల కాలంలో మొయినాబాద్ మండలంలో అనేక అవినీతి కార్యక్రమాలకు పాల్పడ్డారని ఆరోపించారు. ఎమ్మెల్యే పదవి అడ్డుపెట్టుకుని అధికారులతో అడ్డంకులు సృష్టించి వాళ్ల వెంచర్లు చేయడానికి వచ్చిన వారి నుంచి ప్లాట్లతో ప్లాట్లు అక్రమంగా డబ్బులు వసూళ్లు చేశారని తెలిపారు. ఎమ్మెల్యేతో పాటు ఆయన కొడుకు మొయినాబాద్ జెడ్పీటీసీ కాలె శ్రీకాంత్ పెద్దమొత్తంలో అధికార దుర్వినియోగం చేస్తూ విపరీతమైన డబ్బులు వసూలు చేశారన్న విషయం మండలంలో సామాన్య ప్రజలకు సైతం తెలుసు అని వెల్లడించారు. మూడవ సారి అవకాశం ఇస్తే తండ్రీ కొడుకొడులు కలిసి చేవెళ్లను పూర్తిగా అమ్మెస్తారని ఆరోపించారు. పార్టీ నామినేటెడ్ పదవుల్లో లక్షలు తీసుకుని పదవులు ఇచ్చారని విమర్శించారు. దళిత బందు, బీసీ, బంధులో కూడా కమీషన్లు తీసుకుని బినామీలకు పథకాలు అందించారని తెలిపారు. జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో అవినీతి పరుడైన యాదయ్య పై సీఎం కేసీఆర్ స్పందించి తక్షణమే సర్వే నిర్వహించి అభ్యర్థిని మారుస్తారని ఆశిస్తున్నామని వారు తెలిపారు. అవినీతి అక్రమాలకు పాల్పడిన యాదయ్యకు టికెట్ ఇస్తే మాత్రం ఖచ్చితంగా ఓడిపోవడం ఖాయమన్నారు. యాదయ్యకు కాకుండా మాజీ ఎమ్మెల్యే కెఎస్.రత్నంకు ఎమ్మెల్యే టికెట్ ఇస్తే బీఆర్‌ఎస్ పారీ అత్యధిక మెజార్టీతో గెలిపిస్తామన్నారు. అన్ని మండలాల్లో పార్టీ నాయకులు యాదయ్యను వ్యతిరేకిస్తూన్నారని స్పష్టం చేశారు. తన అనుచరులతో కలిసి అక్రమ దందాలు చేస్తున్నారని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్ మొయినాబాద్ మండల మాజీ జెడ్పీటీసీ కంజర్ల భాస్కర్, మాజీ సర్పంచ్ లు కె. రత్నం, నీలకంఠం, మాజీ ఎంపీటీసీలు యాదయ్య, మోహన్ గౌడ్, సీనియర్ నాయకులు హన్మంత్ యాదవ్, మాదవరెడ్డి, ఆనంద్, జైపాల్ రెడ్డి, రాంరెడ్డి, పార్టీ సీనియర్ నాయకులు రాంచంద్రయ్య గౌడ్, లక్ష్మణ్, శంకరయ్య, రాజు, కిషన్, మహేందర్, ప్రశాంత్, ప్రమీద్, ప్రభాకర్, యాదవరెడ్డి, శ్రీనివాస్, హరినాధ్ సురేందర్ రెడ్డి, శ్యామ్ తదితరులు ఉన్నారు.