– హెబ్సిబా పేరుతో యథేచ్ఛగా దోపిడీ
– అధిక లాభం ఆశ చూపి కోట్లల్లో దోచేస్తున్న ముఠా అరెస్ట్ : వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్
నవతెలంగాణ-పాలకుర్తి
పెట్టిన పెట్టుబడికి అధిక మొత్తంలో లాభం ఆశ చూపిస్తూ ప్రజల నుంచి కోట్ల రూపాయలను దోచేసిన నలుగురు సభ్యుల ముఠాను టాస్క్‌ఫోర్స్, జనగామ జిల్లా పాలకుర్తి పోలీసులు సంయుక్తంగా అరెస్ట్ చేశారు. ఈ ముఠా నుంచి రూ.5.92 లక్షల నగదు, 684.5 గ్రాముల బంగారు నాణాలు, 150 గ్రాముల బంగారు ఆభరణాలు, ఒక కారు, సెల్‌ఫోన్లు, ల్యాప్‌ట్యాప్, రసీదు పుస్తకాలు, క్యాష్ కౌంటింగ్ మిషన్, చెక్‌బుక్స్, స్టాంప్స్‌తో పాటు పొలాలు, ఇంటి స్థలాలకు సంబంధించిన పత్రాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. బుధవారం వరంగల్‌లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో జనగామ డీసీపీ రాజమహేంద్ర నాయక్‌తో కలిసి వరంగల్ సీపీ సన్ ప్రీత్ సింగ్ పాల్గొని కేసు వివరాలు వెల్లడించారు. ప్రధాన నిందితుడైన సూర్యాపేట జిల్లా గడ్డిపల్లి గ్రామానికి చెందిన తిప్పాలి సైదులుతో పాటు పెన్‌పహాడ్‌కి చెందిన పొడిల సురేష్, హుజూర్‌నగర్‌కు చెందిన పొడిల శ్రీధర్, ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా జిల్లా నందిగామకు చెందిన మనుబోతుల రామకృష్ణ.. పాలకుర్తిలో నివాసముంటూ మార్కెటింగ్ పేరుతో మనీ లాండరింగ్ మోసాలకు పాల్పడుతూ ప్రజల నుంచి అందిన కాడికి దోచుకుంటున్నారు. నిందితుడు సైదులు తన భార్య నారాయణమ్మ పేరు మీద హెబ్సిబా పేరుతో ఒక సంస్థను 2023లో ఏర్పాటు చేశాడు. 2024లో ఎలాంటి ప్రభుత్వ అనుమతులు లేకుండా అధిక లాభాలు ఆశ చూపిస్తూ చిట్టీ వ్యాపారం ప్రారంభించాడు. ఈ చిట్టీలో చేరే వారు ముందుగా రూ.6 వేలు చెల్లించాల్సి ఉంటుంది.. సభ్యులు చెల్లించిన డబ్బుల్లో రూ.4వేలు తన వద్దనే డిపాజిట్ చేసుకొని మిగితా రూ.2వేలకు సభ్యులకు ఈ సంస్థపై నమ్మకం కలిగేందుకు రూ.2 వేలు విలువ చేసే వస్తువులను అందజేస్తూ ప్రజలను మోసం చేస్తున్నాడు. వస్తువుల విలువ కేవలం రూ.300లు మాత్రమే ఉంటాయి. ఈ సంస్థలో ఒక సభ్యుడు ఎన్ని సభ్యత్వాలైన పొందవచ్చు. ఇందులో చేరిన ప్రతి సభ్యునికి నెలకు రూ. 1000 చొప్పున 20 నెలల పాటు డబ్బును తిరిగి అందజేసే వాడు. కాగా, ప్రధాన నిందితుడు మిగితా నిందితులతో కలసి గ్రామాల్లో ఏజెంట్లను ఏర్పాటు చేసుకొని సుమారు 28,493 సభ్యత్వాలను నమోదు చేసుకోవడంతో పాటు రూ.4వేల చొప్పున మొత్తం రూ.11.39 కోట్లు వసూలు చేశాడు. కాగా, మిగిలిన రూ.2వేలలో రూ300 విలువ చేసే వస్తువులు కొనిచ్చి మరో రూ.4.84కోట్లు మోసం చేసినట్టు పోలీసుల దర్యాప్తులో నిర్ధారణ అయిందని సీపీ తెలిపారు. ప్రజలు అత్యాశతో ఈ సంస్థలో లక్షల్లో పెట్టుబడులు పెట్టి మోసపోవడంతో ఈ సంస్థపై పోలీసులకు పలు ఫిర్యాదులు వచ్చాయి. దాంతో ఈ ముఠా సభ్యులు ప్రజల సొమ్ముతో పారిపోయేందుకు ప్రయత్నించగా.. గుర్తించిన పోలీసులు ముఠా సభ్యులను అదుపులోకి తీసుకొని విచారించారు.
మార్కెటింగ్ పేరుతో మనీ లాండరింగ్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES