Thursday, October 2, 2025
E-PAPER
Homeజిల్లాలుRamreddy Damodar Reddy : దామోదర్ రెడ్డి చేసిన కృషి చిరస్మరణీయం

Ramreddy Damodar Reddy : దామోదర్ రెడ్డి చేసిన కృషి చిరస్మరణీయం

- Advertisement -

నవతెలంగాణ తుంగతుర్తి: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత,మాజీ మంత్రి రామ్ రెడ్డి దామోదర్ రెడ్డి(73) బుధవారం రాత్రి మరణించారు. జనహృదయనేత, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, ఉమ్మడి నల్గొండ జిల్లాకు శ్రీరామసాగర్‌ జలాలను తీసుకురావడంలో దామోదర్ రెడ్డి చేసిన కృషి చిరస్మరణీయం.

1952 సెప్టెంబర్ 14న ఖమ్మం జిల్లాలోని పాత లింగాలలో రాంరెడ్డి నారాయణరెడ్డి కమలమ్మ దంపతులకు దామోదర్ రెడ్డి జన్మించారు. వరంగల్లోని కాకతీయ యూనివర్సిటీలో బీఎస్సీ పూర్తి చేశారు. కుమారుడు సర్వోత్తమ్ రెడ్డి ఉన్నారు. భార్య వరూధినిదేవి కొన్నేళ్ల క్రితం మరణించారు.

రాజకీయ జీవితం: రాంరెడ్డి దామోదర్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి 1985లో జరిగిన ఎన్నికల్లో తుంగతుర్తి నియోజకవర్గం నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచాడు.1985లో ఉమ్మడి నల్గొండ జిల్లా నుంచి గెలిచిన ఏకైక కాంగ్రెస్ ఎమ్మెల్యే దామోదర్ రెడ్డి. ఆయన 1989లో జరిగిన ఎన్నికల్లో రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచాడు. దామోదర్ రెడ్డికి 1994 లో కాంగ్రెస్ పార్టీ టికెట్ దక్కకపోవడంతో ఆయన స్వతంత్ర అభ్యర్థిగా గెలిచి హ్యాట్రిక్ సాధించాడు. 2004 ఎన్నికల్లో తుంగతుర్తి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు, ఆ తరువాత నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణతో సూర్యాపేటకు మారి 2009 ఎన్నికల్లో సూర్యాపేట నుండి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక వరుసగా 2014, 2018, 2023 శాసనసభ ఎన్నికల్లో సూర్యాపేట నియోజకవర్గం నుంచి పోటీ చేసి స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోయాడు. అనంతరం అనారోగ్యంతో బాధపడుతూ ఇంటికే పరిమితం కావడం జరిగింది.

మంత్రిగా సేవలు: 1991-1992 వరకు నేదురుమల్లి జనార్దన్ రెడ్డి మంత్రివర్గంలో రాష్ట్ర భూగర్భ జలవనరుల శాఖ మంత్రిగా పనిచేశారు. 2008-09 వరకు వైయస్ రాజశేఖర్ రెడ్డి మంత్రివర్గంలో ఐటీ శాఖ మంత్రిగా పనిచేశారు. ఉమ్మడి నల్గొండ జిల్లా కాంగ్రెస్ రాజకీయాల్లో దామోదర్ రెడ్డిది ప్రత్యేక స్థానం. టిడిపిల ప్రభంజనం కొనసాగుతున్న రోజుల్లో దామన్న హ్యాట్రిక్ సాధించడం చాలా గొప్ప విషయం.నల్గొండ జిల్లా కాంగ్రెస్ పార్టీలో దామోదర్ రెడ్డి మాటకు ఎదురు లేదు,అన్ని పార్టీల నాయకులు ప్రజలు ఆయనను “టైగర్ దామన్న” అని పిలిచేవారు. పదవుల కోసం ప్రాకులాడకుండా మొదటి నుండి చివరి శ్వాస వరకు కాంగ్రెస్ పార్టీ కోసం కృషి చేసిన గొప్ప నాయకుడు దామోదర్ రెడ్డి. ముఖ్యంగా సూర్యాపేట, నల్లగొండ ప్రాంతాల్లో సాగు నీటి ప్రాజెక్టులు, విద్య, వైద్యం, మౌలిక సదుపాయాల అభివృద్ధిలో కీలక పాత్ర పోషించారు.

దామోదర్ రెడ్డి మరణం తెలంగాణ రాజకీయ రంగానికి పెద్ద లోటు. ఆయన అందించిన సేవలను స్మరించుకుంటూ అనేక రాజకీయ నాయకులు, మిత్రులు,శ్రేయోభిలాషులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఈ నెల 4న తుంగతుర్తిలో ఆయన అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబసభ్యులు తెలిపారు. అభిమానులు కార్యకర్తలు రాజకీయ సహచరులు పెద్ద ఎత్తున హాజరై ఆయనకు నివాళులు అర్పించేందుకు సిద్ధమవుతున్నారు. రాంరెడ్డి దామోదర్ రెడ్డి సేవలు,ఆయన కృషి,ప్రజా సమస్యలపై అవగాహన భవిష్యత్ తరాలకు ఆదర్శప్రాయంగా నిలుస్తాయి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -