నవతెలంగాణ ఆర్మూర్
రాష్ట్రంలోని మూడు విడుతాలలో పంచాయతీ పోరును నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్ణయించగా ,జిల్లాలో మాత్రం రెండు విడతల్లోనే పోలింగ్ పూర్తికానుంది. నియోజకవర్గంలోని కొత్తగా ఏర్పడిన మండలాలైన ఆలూర్, డొంకేశ్వర్ లలో రిజర్వేషన్ల ఖరారుతో నాయకులు నిరుత్సాహంగా ఉన్నారు .మరోపక్క కోర్టు తీర్పుపై ఉత్కాంత నెలకొంది. డివిజన్లోని నాయకుల అంచనాలు తలకిందులయ్యాయి.
2024 నుండి…
గెలుపు ధీమాగా ప్రధాన పార్టీల నేతలు గురిపెట్టగా, ఆశావాహులు టికెట్ కోసం నేతల చుట్టూ ప్రదక్షిణలు కొనసాగిస్తున్నారు. కాగా పార్టీ నేతలు మాత్రం గెలుపు గుర్రాల కోసం అన్వేషిస్తున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల గడువు ముగిసినప్పటి నుంచి ప్రత్యేక అధికారుల పాలన కొనసాగుతుంది. 2024 జూన్ లో జడ్పిటిసి, ఎంపీటీసీల పదవీకాలం ముగిసింది. సర్పంచుల పదవీకాలం సైతం ముగిసి దాదాపు 20 నెలలు అవుతుంది. ఈ మండలాల్లో బీసీలకు స్థానాలు పెరుగగా, పదవులు ఆశించిన నేతలకు రిజర్వేషన్లు కలిసి రాకపోవడం తో తీవ్ర అసంతృప్తిలో ఉన్నారు. కొత్తగా ఏర్పడిన మండలాల్లో మొదటిసారి జరగనున్న జడ్పిటిసి, ఎంపీపీ ఎన్నికల్లో గెలిచి సత్తా చాటాలని ఉత్సాహంగా ఉన్న నాయకుల ఆశలు అడియాశలు అయ్యాయి.
నియోజకవర్గంలోని ఆలూరు, డొంకేశ్వర్ కొత్త మండలాలుగా సుమారు రెండు సంవత్సరాల క్రితం ఏర్పడ్డాయి. చిన్న మండలాలు కావడంతో కొందరు నాయకులు జడ్పిటిసి, ఎంపీపీ ఎన్నికలలో పోటీ చేయాలని కసరత్తు చేస్తూ ఆ దిశగా నడుస్తున్నారు. అయితే వీరికి రిజర్వేషన్లు కలిసి రాకపోవడంతో తలలు పట్టుకుంటున్నారు. ఆలూరులో పలువురు నాయకులు పోటీ చేసేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు అలాంటి వారికి రిజర్వేషన్ అనుకూలించకపోవడంతో నిరుత్సాహానికి గురయ్యారు.
ఆలూరు జడ్పిటిసి స్థానం ఎస్సి మహిళ, ఎంపీపీ పదవిని ఎస్సీకి కేటాయించారు. డొంకేశ్వర్ మండల జడ్పిటిసి ఎంపీపీ స్థానాలు ఎస్సి మహిళలకే కేటాయించారు .దీంతో పోటీకి సిద్ధపడ్డ నాయకుల ఆశలు అడియాశలయ్యాయి. ఆర్మూరు జడ్పిటిసి ఎంపీపీ స్థానాలు రెండు జనరల్ మహిళలకే రిజర్వు కావడంతో పోటీ చేయాలనుకున్న నాయకులకు అవకాశం లేకుండా పోయింది. జడ్పిటిసిల స్థానం 20 ఏళ్ల అనంతరం మహిళలకు రిజర్వు అయింది పోటీ చేయాలని ఆశించిన నాయకులకు నిరాశే ఎదురతుంది.
రెండవ విడతలో…
రెండవ విడత పంచాయతీ ఎన్నికలు నవంబర్ 4న రెవిన్యూ డివిజన్లోని 13 మండలాలతో పాటు నిజామాబాద్ డివిజన్లో మూడు మండలాలలో మొత్తం 264 గ్రామపంచాయతీలు,2512 వార్డుల్లో ఎన్నికలు జరగనున్నాయి. రెండో విడత ఎన్నికలు డివిజన్లోని ఆలూరు, ఆర్మూర్ , బాల్కొండ ,భీంగల్ ,డొంకేశ్వర్ , జక్రాన్ పల్లి, కమ్మర్పల్లి, మెండోరా ,మోర్తాడ్, వేల్పూర్ , ఎయిర్ గట్ల పాటు నిజామాబాద్ డివిజన్లోని ధర్పల్లి, మాక్లూర్, సిరికొండ మండలాలలో జరగనున్నాయి.