ఉపాధ్యాయుల హోదా పెంచడానికి వారి హక్కులు, బాధ్యతలకు సంబంధించి కొన్ని నిర్దిష్టమైన సిఫార్సులతో సమగ్రమైన పత్రాన్ని ఆమోదించిన ఐక్యరాజ్య సమితి అక్టోబర్ 5వ తేదీని ”ప్రపంచ ఉపాధ్యాయుల దినోత్సవం”గా ప్రకటించింది. 1994లో యునెస్కో ఈ మేరకు ఒక తీర్మానం చేసింది. ”స్టేటస్ ఆఫ్ ద టీచర్స్”పై యునెస్కో 1966 అక్టోబర్‌లో 13 చాప్టర్లతో 145 అంశాలతో కూడిన విధాన పత్రాన్ని ఆమోదించింది. అయితే ఉపాధ్యాయుల అంతస్తు సాధనకు ఇప్పటికీ ప్రపంచవ్యాప్తంగా ఉపాధ్యాయులు ఉద్యమించాల్సి వస్తుంది. మానవాభివృద్ధిలో ఉపాధ్యాయు లది ప్రముఖ పాత్ర. కానీ విద్యాసంబంధిత లక్ష్యాలు, ప్రయోజనాల నేపథ్యంలో విద్యా అవసరాల మేరకు ఉపాధ్యాయుల హోదా ఉనికిలోకి వస్తుంది. విద్యావిధానం నిర్వహించడంలో వారిని భాగస్వాములను చేయాలి. విద్యా రంగంలో కీలక పదవులను ఉపాధ్యాయుల వర్గానికి ఇవ్వడం సముచితం.
ఉపాధ్యాయులకు వారి కుటుంబ అవసరాలు, ఉన్నత జీవనస్థాయి, మార్కెట్ ధరల సూచీలు, ఉన్నత విద్యార్హతలు పొందడానికి ఖర్చులు పరిగణనలోకి తీసుకొని గౌరవప్రదమైన జీవన వేతనాలను నిర్ణయించాలి. ఉపాధ్యాయ సంఘాలతో చర్చించి వేతన స్కేళ్లను రూపొందిం చాలి. తాత్కాలిక ఉపాధ్యాయులకు శాశ్వత ఉపాధ్యాయుల కన్నా తక్కువ వేతనాలు ఇవ్వకూడదు. వేతనాలు నిర్ణయించడంలో ఉపాధ్యాయుల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొనకుండా చూడాలి. వార్షిక వేతన అభివృద్ధితోపాటు, అప్రయత్న పదోన్నతి స్కేళ్లను కూడా ఇవ్వాలి. ప్రతిభ ప్రాతిపదికన వేతనాలు నిర్ణయించకూడదు. విద్యార్థులపై వ్యక్తిగత శ్రద్ధ ఉండే విధంగా తరగతి గదిలో విద్యార్థుల సంఖ్య నిర్ణయించాలి. ఉపాధ్యాయుల బోధనకు ఆటంకం కలగకుండా తగినంత మంది బోధనేతర సిబ్బందిని నియమించాలి. ఉపాధ్యాయులకు బోధనోపకరణాలను ప్రభుత్వమే సమకూర్చాలి. కానీ ఆ ఉపకారణాలు ఉపాధ్యాయునికి ప్రత్యామ్నాయం కారాదు. ఉపాధ్యాయుల పనిభారం నిర్ణయించడంలో ఉపాధ్యాయ సంఘాల సూచనలు, సలహాలు పాటించాలి. ఉపాధ్యాయులకు ప్రతి సంవత్సరం మానసిక, శారీరక విశ్రాంతి లభించే విధంగా సెలవులివ్వాలి. పైచదువులు చదువుకోడానికి అనారోగ్యానికి ప్రత్యేకంగా సెలవులివ్వాలి. ఇవన్నీ యునెస్కో తీర్మానంలో ఉన్నవే! ఉపాధ్యా యుల పనిభారం ప్రపంచంలో సగటున వారానికి 38 గంటలుగా ఉంది. దాన్నిబట్టి మన టీచర్ల పరిస్థితి అంచనా వేయవచ్చు.
మూడు దశాబ్దాలుగా ప్రపంచవ్యాప్తంగా ప్రభుత్వాలు అమలు చేస్తున్న ప్రయివేటీకరణ, విద్య వాణిజ్యీకరణ, నయా ఉదారవాద ఆర్థిక విధానాల నేపథ్యంలో ప్రపంచ ఉపాధ్యాయ దినోత్సవాన్ని ప్రకటించిన యునెస్కో ఆ తర్వాత అది అమలు జరుగుతున్న తీరు వైఫల్యాలు ఇబ్బందులపై సమీక్ష నివేదికలను విడుదల చేయలేదు. ప్రభుత్వ విద్యారంగానికి ప్రపంచవ్యాప్తంగా తగ్గిపోతున్న నిధులు, విద్యా ప్రయివేటీకరణ విధానాలకు వ్యతిరేకంగా అనేక దేశాల్లో ఉపాధ్యాయులు బోధన వదిలి ఉద్యమించాల్సి వస్తోంది. ప్రపంచ వాణిజ్యసంస్థ విద్యను ఇతర సేవా అంశాలతో పాటు వాణిజ్యసరుకుగా గుర్తించిన తర్వాత ఉపాధ్యాయుని హోదా అంతస్తు మరింత దిగజారింది. ప్రాచీన గురుకులాల్లో ఉన్న గురుశిష్య సంబంధాలు కానీ, పాఠశాలలు ప్రారంభమైన తొలినాళ్లలో ఉపాధ్యాయ, విద్యార్థి సంబంధాలు కానీ, గ్రామీణ ప్రాంతాల్లో నివాసం ఉన్న బడిపంతులు మేధావిగా సమాజాభివృద్ధిలో మార్గదర్శకుడుగా ఉన్న పరిస్థితులన్నీ విద్య వాణిజ్యీకరణతో వ్యాపారమయ్యాయి.
”మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలే” అన్న కార్ల్‌మార్క్స్ మాటలు విద్యారంగంలో అక్షర సత్యాలయ్యాయి! ఉపాధ్యాయుడు జ్ఞానాన్ని అమ్ముకునేవాడైతే,విద్యార్థి వినియోగదారుగా మారాడు. తాత్కాలిక, శాశ్వత ఉపాధ్యాయులు మధ్య వేతనా లలో వివక్ష ఉండరాదని యునెస్కో చెప్పింది. సుప్రీంకోర్టు కూడా ఒకే రకమైన పనికి ఒకే వేతనం ఉండాలని తీర్పు చెప్పింది. అయినా మన దేశంతో పాటు, ప్రపంచవ్యాప్తంగా తక్కువ వేతనంతో పని చేసే ఉపాధ్యాయులు విద్యావ్యవస్థలో ఉన్నారు. పెట్టుబడిదారుల పాలకుల కనుసన్నలో నడిచే ఐక్యరాజ్యసమితి, యునెస్కో ఉపాధ్యాయుల హోదా, అంతస్తు, వేతనాలు చెల్లింపులో వివక్షత పట్ల వ్యూహాత్మకంగా మౌనం పాటిస్తున్నాయి. పారా టీచర్లు, అవుట్ సోర్సింగ్ టీచర్లు, కాంట్రాక్టు టీచర్లు, విద్యావాలంటీర్లు, అకాడమిక్ కన్సల్టెంట్లు- పేరు ఏదైనా కావచ్చు ఉపాధ్యాయులు చట్టబద్ధమైన దోపిడీకి గురవుతున్నారు. ఇక ప్రయివేటు విద్యాసంస్థల్లో ఉపాధ్యాయుల పరిస్థితి వర్ణనాతీతం. యునెస్కో ప్రకటించిన ‘స్టేటస్ ఆఫ్ టీచర్స్’ విధానపత్రం అక్కడ అమలు కాదు.
కేంద్రం అమల్లోకి తెస్తున్న జాతీయ విద్యా విధానం-2020లో రెగ్యులర్ ఉపాధ్యాయుల నియామకానికి కాలపరిమితిని తోసిపుచ్చడంతో పాటు, కాంట్రాక్టు, పారా టీచర్లను రెగ్యులర్ చేసే ప్రస్తావన చేయలేదు. ఉపాధ్యాయుల పదోన్నతులు, పెన్షన్ వంటి అపరిష్కృత సమస్యల పరిష్కారాన్ని సూచించలేదు. అంతేకాకుండా కాంట్రాక్ట్, తాత్కాలిక ఉపాధ్యాయులకు వైద్య ఆరోగ్య, మాతృత్వ సెలవుల వంటి సౌకర్యాల ఊసే చేయలేదు. ఉద్యోగ ప్రొబేషన్ కాలాన్ని పెంచి ప్రభుత్వాలు, యాజమాన్యాలు ఉపాధ్యాయుల శ్రమను దోచుకోవడానికి అవకాశం కల్పిస్తుంది. ఒప్పంద ఉద్యోగ వ్యవస్థను ప్రోత్సహించే పద్ధతులు పరిచయం చేస్తుంది. ఇక మీద పదోన్నతుల కల్పనకు సీనియారిటీ, అనుభవం అనేవి అర్హతలుగా ఉండవు. పదోన్నతుల్లో రిజర్వేషన్, సామాజిక న్యాయాన్ని తొలగిస్తుంది. స్కూల్ కాంప్లెక్స్ పద్ధతిలో ప్రభుత్వ, ప్రయివేట్ పాఠశాలలను జతచేయడం వల్ల టీచర్ల వేతనా లను తగ్గించే అవకాశం ఉంటుంది. ఇంకా ప్రయివేటు విద్యాసంస్థలు ఎంతైనా ఫీజులుగా విద్యార్థుల నుంచి వసూలు చేసుకోవచ్చు. ఉపాధ్యాయులకు ఎంత తక్కువగానైనా జీతాలు చెల్లించవచ్చు. ఇక ఉపాధ్యాయుల హోదా అంతస్తు పట్టించుకునే వారెవరు?
కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయ అధ్యయనం ప్రకారం ఉపాధ్యాయుని హోదా క్షీణించడం ప్రారంభమైందని, ఉపాధ్యాయ వృత్తిని స్వీకరించడానికి యువత అనాసక్తత ప్రదర్శిస్తోందని తెలిపింది. పాఠశాలల్లో ఉపాధ్యాయులపై నియంత్రణ అధికమై స్వేచ్ఛాయుత వాతావరణంలో బోధన జరుపలేని పరిస్థితులు నెలకొన్నాయని పేర్కొంది.ఉపాధ్యాయ వృత్తి గౌరవప్రదమని భావించిన వారికి తక్కువ ప్రతిఫలం లభిస్తోందని, ఫలితంగా ఈ వృత్తిని సమాజం భావించిన విధంగా ఉపాధ్యాయులు సంతృప్తికరంగా నిర్వహించలేకపోతున్నారని తెలిపింది.ప్రపంచవ్యాప్తంగా 9.4 కోట్ల మంది ఉపాధ్యాయులు పనిచేస్తున్నారు. 2030 వరకు ప్రపంచ విద్యా అవసరాలు తీరాలంటే, అందరికీ విద్య అందించాలంటే ఇంకా 4.4 కోట్ల మంది ఉపాధ్యాయులు అవసరం. మన దేశంలో ఇంకా పదిలక్షల మంది ఉపాధ్యాయులు కావాలని నిటి ఆయోగ్ విడుదల చేసిన ‘సాత్’ (సస్టెయినబుల్ యాక్షన్ ఫర్ ట్రాన్స్‌ఫామింగ్ హ్యూమన్ కేపిటల్) నివేదిక తెలిపింది.
‘స్టేటస్ ఆఫ్ టీచర్స్’ విధానపత్రం ఆమోదం పొందిన అరవై ఏండ్ల తర్వాత కూడా ఉపాధ్యాయుల పరిస్థితులు హీనస్థితిలో ఉన్నాయని, అధిక వేతనాలిచ్చే ఉద్యోగాలకు ఉపాధ్యాయులకు వెళ్లిపోతున్నారని ఐఎల్‌ఓ నివేదిక చెప్తోంది. యునెస్కో నివేదిక ప్రకారం వర్ధమాన దేశాల్లో తరగతి గదిలో బల్లలు, కుర్చీలు, నల్లబల్లలు, చాక్పీస్ వంటి ఇతర కనీస వసతులు లేని దుర్భర పరిస్థితులు ఉన్నాయి. విద్యార్థులతో కిక్కిరిసిన తరగతి గదులతో ఉపాధ్యాయులపై పనిభారం పెరుగుదల సర్వసాధారణమైపోయింది. విద్యా విధానాల రూపకల్పనలో ఉపాధ్యాయుల పాత్ర కుదింపు జరుగుతోంది. ఈ పరిస్థితుల్లో ఉపాధ్యాయ వృత్తికి ప్రతిభావంతులైన యువకులను ఆకర్షించాలంటే ప్రభుత్వాల విధానాలు మారాలి. ఉపాధ్యాయ నియామకాలు, వారిని వృత్తిలో కొనసాగించే చర్యలు, సరైన సాంఘిక హోదా, అంతస్తు అందే పరిస్థితులు కల్పించడం ద్వారా ప్రపంచవ్యాప్తంగా బడి బయట ఉన్న 27 కోట్ల మంది చిన్నారులకు విద్యను అందించగలమని గత ఆగస్టు 28,29 తేదీల్లో జరిగిన ప్రపంచ ఉపాధ్యాయ సదస్సు సూచించింది. ప్రభుత్వాలు ఇటువంటి విధానాలు అమలు చేయాలని కార్మిక, ప్రజాసంఘాలు కోరుతున్నాయి.
కె. వేణుగోపాల్
9866514577