Saturday, October 4, 2025
E-PAPER
Homeఆటలురెండో వన్డేకు వర్షం అడ్డంకి

రెండో వన్డేకు వర్షం అడ్డంకి

- Advertisement -

నిరాశపరిచిన అభిషేక్‌
ఇండియా-ఎ 247ఆలౌట్‌

కాన్పూర్‌: ఆస్ట్రేలియా-ఎతో జరుగుతున్న రెండో అనధికారిక వన్డేకు వర్షం అడ్డంకిగా నిలిచింది. తొలిగా బ్యాటింగ్‌కు దిగిన భారత్‌-ఎ జట్టు 247పరుగులకే పరిమితమైంది. అనంతరం ఆస్ట్రేలియా జట్టు బ్యాటింగ్‌కు దిగి వర్షం కారణంగా ఆట నిలిచే సమయానికి వికెట్లేమీ నష్టపోకుండా 48పరుగులు చేసింది. అంతకుముందు బ్యాటింగ్‌కు దిగిన టీమిండియాకు యువ స్టార్‌ ఓపెనర్‌ అభిషేక్‌ శర్మ నిరాశరిచాడు. తొలి వన్డేలో సెంచరీ చేసిన ప్రియాన్ష్‌ ఆర్య స్ధానంలో ఈ మ్యాచ్‌ ప్లేయింగ్‌ ఎలెవన్‌లోకి వచ్చిన అభిషేక్‌ తన మార్క్‌ను చూపించలేకపోయాడు. అభిషేక్‌ తను ఎదుర్కొన్న తొలి బంతికే పెవిలియన్‌కు చేరాడు. భారత ఇన్నింగ్స్‌ రెండో ఓవర్‌ వేసిన జాక్‌ ఎడ్వర్డ్‌ తొలి బంతిని అభిషేక్‌కు వైడ్‌-ఆఫ్‌ డెలివరీగా సంధించాడు.

ఆ బంతిని ఈ పంజాబ్‌ ఆటగాడు కవర్స్‌పై నుంచి షాట్‌ ఆడాలని చూశాడు. కానీ బంతి మాత్రం అవుట్‌సైడ్‌-ఎడ్జ్‌ తీసుకుని మొదటి స్లిప్‌లో ఉన్న సదర్లాండ్‌ చేతికి వెళ్లింది. దీంతో అభిషేక్‌ గోల్డెన్‌ డక్‌గా వెనుదిరిగాడు. టాస్‌ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన భారత్‌-ఎ 60 పరుగులకే మూడు కీలక వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. భారత ఇన్నింగ్స్‌ను రియాన్‌ పరాగ్‌, తిలక్‌ వర్మ చక్కదిద్దారు. గత మ్యాచ్‌లో సెంచరీతో చెలరేగిన కెప్టెన్‌ శ్రేయస్‌ అయ్యర్‌ ఈ రెండో వన్డేలో నిరాశపరిచాడు. కేవలం 8 పరుగులు మాత్రమే చేసి ఔటయ్యాడు. ప్రభ్‌సిమ్రాన్‌ సింగ్‌ సైతం(1) సింగిల్‌ డిజిట్‌ స్కోర్‌కే పరిమితమయ్యాడు. మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా జరిగిన తొలి వన్డేలో భారతజట్టు 171పరుగుల తేడాతో ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -