మోడీ సర్కార్‌పై రాహుల్ గాంధీ విమర్శలు
కొలంబియాలోని ఈఐఏ వర్సిటీలో వ్యాఖ్యలు
ఇండియాలో ప్రజాస్వామ్య వ్యవస్థే ఉండాలి
బోగోటా: ప్రజాస్వామ్యంపై జరుగుతోన్న దాడితో ప్రస్తుతం భారత్‌కు ముప్పు పొంచి ఉన్నదని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ అన్నారు. కొలంబియా పర్యటనలో ఉన్న ఆయన ఈఐఏ విశ్వవిద్యాలయంలో విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. ఈ సందర్భంగా మోడీ ప్రభుత్వంపై పలు విమర్శలు చేశారు. ”ఇండియాలో ఎన్నో మతాలు, కులాలు, సంప్రదాయాలు ఉన్నాయి. అక్కడ ప్రతి ఒక్కరికీ ప్రజాస్వామ్య వ్యవస్థ చోటు కల్పిస్తుంది. కానీ ప్రస్తుతం ఈ ప్రజాస్వామ్య వ్యవస్థ ముప్పేట దాడికి గురవుతోంది. ఇదే ప్రస్తుతం భారత్ ఎదుర్కొంటున్న పెనుముప్పు” అని పేర్కొన్నారు. ఇంధన వినియోగంలో వచ్చిన మార్పులతో అనేక సామ్రాజ్యాల సృష్టి జరుగుతూ వస్తోందని అన్నారు. ”అప్పట్లో బ్రిటీష్‌వాళ్లు ఆవిరి యంత్రం, బొగ్గుపై నియంత్రణ సాధించారు. దీనితో వాళ్లు సూపర్‌పవర్‌గా ఎదిగారు. ఆ బ్రిటీష్ సామ్రాజ్యానికి వ్యతిరేకంగా పోరాడి 1947లో స్వాతంత్య్రాన్ని సాధించుకున్నాం.
ఆ తరువాత ప్రపంచవ్యాప్తంగా పెట్రోల్ వినియోగం బాగా పెరిగింది. దీనితో ప్రపంచ వాణిజ్యంపై అమెరికన్ల పట్టు పెరిగింది. నేడు మన ప్రపంచం ఎలక్ట్రిక్ మోటార్ వైపు మళ్లుతోంది. దీనితో అమెరికా, చైనా మధ్య గట్టి పోటీ ఏర్పడింది. అయితే ఈ విషయంలో చైనా చాలా ముందుంది. ఇక చైనా మా పొరుగు దేశం. కనుక అమెరికా, చైనాలు పోటీపడుతుంటే మధ్యలో మేం ఉన్నాం. చైనా కంటే భారతదేశ జనాభా ఎక్కువ. చైనాలో కేంద్రీకృత వ్యవస్థ ఉంటే, ఇండియాలో వికేంద్రీకృత, వైవిధ్యభరితమైన వ్యవస్థ ఉంది. అది చాలా సంక్లిష్టంగా ఉంటుంది. చైనాతో పోల్చుకుంటే భారత్‌కున్న సామర్థ్యాలు చాలా భిన్నమైనవి. మా భారతదేశం ఆధ్యాత్మిక, సైద్ధాంతిక సంప్రదాయాలను కలిగి ఉంది. అవి చాలా ఆచరణీయమైనవి.” అని రాహుల్ చెప్పారు.
అది పెద్ద సవాల్!?
”భారతదేశంలో ఆర్థిక వృద్ధి ఉంది. అది మా ఆర్థిక వ్యవస్థ సేవల ఆధారితమైనది. అయితే భారత్‌కు ఉత్పత్తి సామర్థ్యం లేకపోవడంతో ఉద్యోగాల కల్పన ఆశించిన స్థాయిలో జరగడం లేదు. చైనా చాలా ప్రజాస్వామిక వాతావరణంలో ఉత్పత్తి చేస్తోంది. కానీ భారత్‌కు ప్రజాస్వామ్య వ్యవస్థే ఉండాలి. అలాంటి వ్యవస్థను అభివృద్ధి చేయడం కాస్త సవాలుతో కూడుకున్న వ్యవహారం” అని రాహుల్ గాంధీ పేర్కొన్నారు.