Saturday, October 4, 2025
E-PAPER
Homeజాతీయంమీకెలాంటి బాధ్యత లేదా ?

మీకెలాంటి బాధ్యత లేదా ?

- Advertisement -

తొక్కిసలాట జరిగిన వెంటనే అక్కడ నుంచి పారిపోతారా?
టీవీకే నేతలపై మండిపడ్డ మదురై బెంచ్‌…ఇంత ఉదాసీనంగా వుంటారా?
పోలీసులపై ఆగ్రహించిన న్యాయస్థానం…కరూర్‌ ఘటనపై సిట్‌ ఏర్పాటు


చెన్నై
: కరూర్‌ తొక్కిసలాట ఘటనకు సంబంధించి తమిళగ వెట్రి కళగం (టీవీకే) నేతలపై మద్రాసు హైకోర్టు మదురై బెంచ్‌ తీవ్రమైన వ్యాఖ్యలు చేసింది. తొక్కిసలాట జరిగిన వెంటనే పార్టీ చీఫ్‌ విజయ్ సంఘటనా స్థలం నుంచి పారిపోయారని విమర్శించింది. కనీసం జరిగిన సంఘటనపై పార్టీ పశ్చాత్తాపం కూడా వ్యక్తం చేయలేదని పేర్కొంది. ఈ తొక్కిసలాట ఘటనపై దర్యాప్తుకు సీనియర్‌ ఐపిఎస్‌ అధికారి ఆస్రా గార్గ్‌ నేతృత్వంలో ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేయాలని బెంచ్‌ ఆదేశాలు జారీ చేసింది. ఇదంతా చూస్తుంటే నటుడు, రాజకీయ నేత అయిన విజయ్ మానస్థిక స్థితి ఎలాంటిదో తెలుస్తోందని కోర్టు పేర్కొంది. 41మంది ప్రాణాలను హరించిన ఈ తొక్కిసలాట ఘటన విషయంలో నిర్వహణా తీరు సరిగా లేదని పైగా విజయ్ పట్ల ప్రభుత్వం కొంత ఉదాసీనంగా వ్యవహరించిందని జస్టిస్‌ సెంథిల్‌ కుమార్‌ వ్యాఖ్యానించారు.

ఈ ఘటనపై బాధ్యత విషయంలో నిర్వాహకులను, పోలీసులను జస్టిస్‌ సెంథిల్‌కుమార్‌ ప్రశ్నించారు. ఒక ఈవెంట్‌ నిర్వాహకునిగా మీకెలాంటి బాధ్యత లేదా? అని ఘాటుగా ప్రశ్నించారు. అలాగే ప్రభుత్వ ఉదాసీనతపై విచారం వ్యక్తం చేసింది. సంఘటన జరిగిన వెంటనే విజయ్ అక్కడ నుండి అదృశ్యమైపోయారని కోర్టు వ్యాఖ్యానించింది. ఇటువంటి ప్రవర్తనను, వ్యవహార శైలిని తీవ్రంగా ఖండించాల్సి వుందని హెచ్చరించింది. టీవీకే నేతలు బస్సీ ఆనంద్‌, సిటిఆర్‌ నిర్మల్‌ కుమార్‌లు దాఖలు చేసిన ముందస్తు బెయిల్‌ పిటిషన్లపై ఉత్తర్వులను బెంచ్‌ రిజర్వ్‌ చేసుకుంది. ముందస్తు బెయిల్‌కు సంబంధించి విచారణ సందర్భంగా ప్రభుత్వం తన వాదనలు వినిపిస్తూ పార్టీ స్వంత కార్యకర్తల వ్యవహార శైలి కారణంగానే ఈ తొక్కిసలాట జరిగిందని పేర్కొంది. నేతలు కూడా బాధ్యతారాహితంగా వ్యవహరించారని పేర్కొంది. 41మంది అమాయకుల ప్రాణాలు పోతే కోర్టు కళ్ళు మూసుకుని కూర్చోదని బెంచ్‌ వ్యాఖ్యానించింది. మౌన ప్రేక్షకురాలిగా, చేతులు ముడుచుకుని, తన బాధ్యతలు విడనాడదని పేర్కొంది.

ఈ సంఘటన ఎలా జరిగింది, తదనంతర పర్యవసానాలు ఎలా వున్నాయనేది యావత్‌ ప్రపంచం చూసిందని బెంచ్‌ పేర్కొంది. ఒక వీడియో ఫుటేజీని ప్రస్తావిస్తూ బెంచ్‌, టివికె బస్సు కింద ద్విచక్ర వాహనాలు పడిపోయినా ఆ బస్సు డ్రైవర్‌ చూసినా బస్సును ఆపడం లేదు. ఇది వాహనాన్ని ఢీ కొట్టిన కేసుగా పరిగణించలేమా? అని ప్రశ్నించింది. ఎందుకు హిట్‌ అండ్‌ రన్‌ కేసును నమోదు చేయలేదని పోలీసులను కూడా బెంచ్‌ ప్రశ్నించింది. దాన్ని ఎందుకు పోలీసులు పరిగణనలోకి తీసుకోలేదని అడిగింది. పార్టీ నేత అద్‌ అర్జునా పెట్టిన వివాదాస్పద పోస్టును పరిగణనలోకి తీసుకున్న కోర్టు ”ఈ అర్జున చట్టానికి అతీతుడా? కోర్టు ఆదేశిస్తేనే మీరు చర్యలు తీసుకుంటారా? అని పోలీసులను ప్రశ్నించింది. తక్షణమే అద్‌ అర్జునపై చర్యలు తీసుకోవాలని పోలీసులను కోర్టు ఆదేశించింది. రోడ్‌ షోలకు సంబంధించి సమగ్ర మార్గదర్శకాలు జారీ చేసేంతవరకు వాటికి అనుమతి ఇవ్వవద్దని హోం కార్యదర్శిని, డీజీపీని కోరుతూ దాఖలైన ప్రజా ప్రయోజనాల వ్యాజ్యాన్ని కూడా కోర్టు పరిగణనలోకి తీసుకుంది. నిర్వాహకులకు తమ స్వంత కార్యకర్తలకు హాని కలిగించాలనే ఉద్దేశ్యం లేదని దీన్ని నేరపూరితమైన హత్యగా పరిగణించవద్దని బస్సీ ఆనందర్‌ నిర్మల్‌ కుమార్‌ల తరపు న్యాయవాది రాఘవాచారి పేర్కొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -