మనువాదంతో దేశఐక్యతకు విఘాతం
కేవీపీఎస్ రాష్ట్ర అధ్యక్షులు జాన్‌వెస్లీ
ఘనంగా 28వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
దేశంలో వేల ఏండ్లుగా కొనసాగుతున్న సామాజిక, ఆర్థిక, అసమానతలను అంతం చేయడమే కేవీపీఎస్ లక్ష్యమని కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం(కేవీపీఎస్) రాష్ట్ర అధ్యక్షులు జాన్‌వెస్లీ పిలుపునిచ్చారు. గురువారం హైదరాబాద్‌లోని ఆ సంఘం రాష్ట్ర కార్యాలయం వద్ద కేవీపీఎస్ 28వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఆత్మగౌరవం, సమానత్వం, కుల నిర్మూలన లక్ష్యాలు కలిగిన ఆ సంఘ పతాకాన్ని ఆయన ఎగురవేశారు. తొలుత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ చిత్రపటానికి సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్ పూలమాలలేసి నివాళ్లర్పించారు. జ్యోతిబాఫూలే చిత్రపటానికి తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి టి సాగర్, చేతి వృత్తిదారుల సమన్వయ కమిటీ రాష్ట్ర నాయకులు ఎం వి రమణ, పి ఆశయ్య పూలమాలలేసి ఘనంగా నివాళులర్పించారు. కేవీపీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టీ స్కైలాబ్ బాబు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో జాన్‌వెస్లీ మాట్లాడుతూ ప్రపంచంలో ఎక్కడా లేని ప్రత్యేక అసమానతలు కులం రూపంలో ఈ దేశంలో వేల సంవత్సరాలుగా కొనసాగుతున్నాయని చెప్పారు.
వీటివల్ల దేశం పూర్తిస్థాయిలో వెనుకబడిపోయి, సాటి మనిషిని మనిషిగా చూడని నీచత్వం నెలకొందని అన్నారు. 78 ఏండ్ల స్వాతంత్య్రం తర్వాత కూడా నేటికీ గుడి, బడిలో వివక్ష కొనసాగడం బాధాకరమని తెలిపారు. ఇది దేశ ప్రజల ఐక్యతకు, అభివృద్ధికి విఘాతం కలిగిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. కుల వ్యవస్థను, అసమానతలను సమర్థించే పాలకులు అధికారంలో ఉండటం వల్ల వివక్ష మరింత పెచ్చరిల్లుతున్నదని విమర్శించారు. యువతరం, విద్యావంతులు కుల నిర్మూలన కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు. పాలడుగు భాస్కర్ మాట్లాడుతూ ఆర్థిక అసమానతలతో పాటు సామాజిక అసమానతలపై ఉద్యమాలు నిర్మించడం ద్వారా మాత్రమే పీడిత వర్గ ఐక్యత బలపడుతుందన్నారు. టి సాగర్ మాట్లాడుతూ కులవివక్ష, అంటరానితనం యూనివర్సిటీ స్థాయిలో కొనసాగుతున్నదని చెప్పారు. దళితులను దేవాలయాల్లోకి రానీయకపోవటమే గాకుండా, పట్టణాలతో పాటు గ్రామ సీమల్లో నేటికీ బలంగా వివక్ష కొనసాగు తున్నదని ఆవేదన వ్యక్తం చేశారు.
స్కైలాబ్ బాబు మాట్లాడుతూ 28 ఏండ్ల సామాజికోద్యమ ప్రస్థానంలో కేవీపీఎస్ ఎస్సీ, ఎస్టీ కమిషన్, ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ చట్టం, కులాంతర వివాహితులకు రూ. 2.50 లక్షల ప్రోత్సాహకాలు ఇచ్చే జీవో 12ని సాధించిందని గుర్తు చేశారు. ఇంకా అనేక విజయాలు సాధించినట్టు చెప్పారు. కార్యక్రమంలో ఆవాజ్ రాష్ట్ర కార్యదర్శి ఎండి అబ్బాస్, తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు బుర్రి ప్రసాద్, డీవైఎఫ్‌ఐ రాష్ట్ర అధ్యక్షులు కోట రమేష్, తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి ఎం శోభన్, సుందరయ్య పార్క్ వాకర్స్ క్లబ్ సెక్రెటరీ సైకం మనోహర్ రెడ్డి, పార్క్ మాజీ ప్రెసిడెంట్లు అంబటి శ్రీనివాస్‌రెడ్డి, సలిపేల రమేష్‌రెడ్డి, రూపుల వివేక్, కంటోన్‌మెంట్ బోర్డ్ అసిస్టెంట్ ఇంజినీర్ రాజేశ్వరరావు, హౌజ్ ఫెడ్ డైరెక్టర్ ఐలినేని కిషన్ రావు, వాకర్స్ క్లబ్ సీనియర్ నాయకులు ఎండి రఫీ ఖాన్, పంచాయతీ రాజ్ డిపార్ట్‌మెంట్ రిటైర్డ్ ప్రత్యేక అధికారి ఇరిగి నర్సింగరావు, ఉప్పల్ అంబేద్కర్ ఉత్సవ కమిటీ చైర్మెన్ జి విజయ్ కుమార్, వంపు లక్ష్మయ్య, ఎన్‌ఎఫ్‌సి ఎస్సీ, ఎస్టీ ఎంప్లాయీస్ యూనియన్ నాయకుడు గోవిందరావు తదితరులు పాల్గొన్నారు.