Saturday, October 4, 2025
E-PAPER
Homeజాతీయంనిర్బంధం నుంచి విముక్తి కల్పించండి

నిర్బంధం నుంచి విముక్తి కల్పించండి

- Advertisement -

సుప్రీంను ఆశ్రయించిన వాంగ్‌చుక్‌ సతీమణి
హెబియస్‌ కార్పస్‌ పిటిషన్‌ దాఖలు

న్యూఢిల్లీ : జాతీయ భద్రతా చట్టం (ఎన్‌ఎస్‌ఎ), 1980 కింద తన భర్త, పర్యావరణ కార్యకర్త సోనమ్‌ వాంగ్‌చుక్‌ను అరెస్టు చేయడాన్ని వ్యతిరేకిస్తూ ఆయన సతీమణి డాక్టర్‌ గీతాంజలి అంగ్‌మో సుప్రీంకోర్టులో హెబియస్‌ కార్పస్‌ పిటిషన్‌ వేశారు. లేV్‌ాలో గత నెల 24న హింసాత్మక ఆందోళనలు తలెత్తిన నేపథ్యంలో వాంగ్‌చుక్‌ను అదుపులోకి తీసుకున్నారు. వాంగ్‌చుక్‌ ఆచూకీ గురించి స్పష్టంగా వెల్లడించాల్సిందిగా అధికారులను ఆదేశించాలని ఆమె సుప్రీంకోర్టును కోరారు. అలాగే ఆయనను తక్షణమే నిర్బంధం నుంచి విడుదల చేసేలా ఉత్తర్వులు జారీ చేయాలన్నారు. రాజస్థాన్‌లోని జోథ్‌పూర్‌లో వాంగ్‌చుక్‌ను వుంచినట్లు తెలుస్తోంది. ఇప్పటికే వారం గడిచిపోయిందని ఆమె పేర్కొన్నారు.

ఏ ప్రాతిపదికన ఆయనను నిర్బంధంలోకి తీసుకున్నారో ఎలాంటి సమాచారం లేదని, పైగా ఆయన ఆరోగ్యం గురించి కూడా తెలియరాలేదని అన్నారు. శాంతి భద్రతలకు, దేశ భద్రతకు ప్రమాదంగా భావించిన వ్యక్తులను ముందస్తు నిర్బంధం కింద అదుపులోకి తీసుకోవడానికి ఎన్‌ఎస్‌ఎలోని సెక్షన్‌ 3 వెసులుబాటు కల్పిస్తుంది. ఆ వ్యక్తి చర్యలు జాతీయ ప్రయోజనాలకు లేదా శాంతి భద్రతలకు భంగకరంగా వున్నాయని భావించి, అందుకు సంబంధించిన కీలక సమాచారాన్ని కనుగొన్న తర్వాత మాత్రమే సంబంధిత అధికారి ఉత్తర్వులను జారీ చేయాలని ఎన్‌ఎస్‌ఎ పేర్కొంటోంది. సుప్రీంకోర్టు కూడా ఇందుకు సంబంధించి వరుసగా కొన్ని మార్గదర్శకాలను జారీ చేసింది. సెప్టెంబరు 24న లేహ్‌ లో సంభవించిన పరిణామాల దృష్ట్యా వాంగ్‌చుక్‌ను లేహ్‌ జిల్లాలో వుంచరాదంటూ కేంద్ర పాలిత ప్రాంతమైన లడఖ్‌ పాలనా యంత్రాంగం ఒక ప్రకటన జారీ చేసింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -