నవతెలంగాణ – భువనగిరి
సమాచార హక్కు చట్టం, ఇరవై సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా తెలంగాణలో చట్టం అమలు, ప్రభుత్వ విధానాలు, స్వచ్ఛంద సంస్థల పాత్ర, పౌరుల భాగస్వామ్యం లాంటి విషయాలు చర్చించుటకు ఈనెల 5 నుండి 12 వరకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించే “ఆర్టీఐ వారోత్సవాలను” విజయవంతం చేయాలని యునైటెడ్ ఫోరం ఫర్ ఆర్టీఐ జిల్లా కన్వీనర్ కొడారి వెంకటేష్ కోరారు. శనివారం ఆయన భువనగిరి లో మీడియాతో మాట్లాడారు. ఈనెల 06 న యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ లో జరిగే వారోత్సవాల్లో ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొనాలని ఆయన కోరారు.
సమాచార హక్కు చట్టం- 2005 అక్టోబర్ 12న దేశవ్యాప్తంగా అమల్లోకి వచ్చి, ఈ ఏడాది ఇరవై ఏళ్లు పూర్తి చేసుకుంటోందని , ఈ చట్టం ప్రభుత్వ పాలనలో పారదర్శకత, జవాబుదారీతనాన్ని తీసుకురావడానికి “ప్రజల చేతుల్లో ప్రభుత్వ అధికారం” అనే లక్ష్యంతో ప్రారంభమైందని ఆయన అన్నారు. ఈ ఇరవై సంవత్సరాల ప్రయాణంలో తెలంగాణ రాష్ట్రంలో ఆర్టీఐ సాధించిన పురోగతి, సవాళ్లు,ప్రభుత్వ విధానాలు మరియు అమలు మొదలైన అంశాలను ఈ వారోత్సవాల్లో చర్చిస్తారని ఆయన అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఆర్టీఐ చట్టం రాజకీయ కారణాలతో అమలులో మిశ్రమ ఫలితాలను చూపిందన్నారు.కొన్ని ప్రభుత్వ శాఖలు సమాచారాన్ని సకాలంలో అందిస్తుండగా, మరికొన్నింటిలో జాప్యం, తిరస్కరణలు, మరియు అసంపూర్ణ సమాచారం వంటి సమస్యలు ఇంకా కొనసాగుతున్నాయని ఆయన అన్నారు.
తెలంగాణ రాష్ట్ర సమాచార కమిషన్ లో పెండింగ్‌లో ఉన్న కేసుల సంఖ్య భారీగా పెరగడం ఒక ప్రధాన సమస్యగా మారిందని, దీనివల్ల ప్రజలకు న్యాయం జరగడంలో ఆలస్యం అవుతోందన్నారు. ఈ పరిస్థితిని మెరుగుపరచడానికి ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రజా సమాచార అధికారులు కు తగిన శిక్షణ ఇవ్వడం, సమాచార కమిషన్లో ఖాళీలను భర్తీ చేయడం వంటి చర్యలు అవసరం అని అన్నారు. తెలంగాణ వ్యాప్తంగా వివిధ జిల్లాల్లో ఉన్న రాష్ట్ర కమిషనర్స్ చైతన్య సదస్సులలో పాల్గొనడం కూడా అవసరం అని ఆయన అన్నారు. సమాచార హక్కు చట్టం అమలులో స్వచ్ఛంద సంస్థల( ఎన్జీఓ) పాత్ర అనివార్యం అని ఆయన అన్నారు.