Saturday, October 4, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్కామారెడ్డిలో జరిగినవి కత్తిపోట్లు కాదు, గ్లాస్ పోట్లు

కామారెడ్డిలో జరిగినవి కత్తిపోట్లు కాదు, గ్లాస్ పోట్లు

- Advertisement -

– ఈ గొడవలకు పాత కక్షలే కారణం 
– కామారెడ్డి ఏఎస్పి చైతన్య రెడ్డి
నవతెలంగాణ –  కామారెడ్డి 

కామారెడ్డి జిల్లా కేంద్రంలో విజయదశమి రోజు కత్తిపోట్లు జరిగాయని సోషల్ మీడియాలో ప్రచారం జరిగిందని అది కత్తిపోట్లు కాదని గ్లాస్ పోట్లు అని, అవి పాత కక్షల కారణంగానే  దాడులు జరిగాయని కామారెడ్డి ఏఎస్పీ చైతన్య రెడ్డి తెలిపారు. శనివారం కామారెడ్డి పట్టణంలో డీఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ..  విజయదశమి  రోజు అర్ధరాత్రి కలకలం రేపిన దాడుల ఘటనపై పోలీసులు విచారణ ముమ్మరం చేశారనీ, ఘటనకు కారకులైన ఒకరిని అరెస్ట్ చేసి రిమాండ్ తరలించడం జరిగిందన్నారు.

విజయదశమి రోజు అర్ధరాత్రి తమకు ‘100’కు కాల్ వచ్చిందని, వెంటనే తమ సిబ్బంది ఆ ప్రాంతానికి వెళ్లగా.. అక్కడ రెండు గ్రూప్లు కొట్టుకుంటున్నాయని తెలిపారు. వెంటనే ఆ గ్రూపులను అక్కడనుండి చెదరగొట్టడం జరిగిందని, ఈ ఘటనలో పలువురిని అదుపులోకి తీసుకుని విచారించగా గాజుముక్కతో దాడి జరిగినట్లు తేలిందన్నారు. కేతన్, ప్రఫుల్ అనే ఇద్దరు యువకులపై సిద్దార్థ్ అనే వ్యక్తి పాత కక్షల నేపథ్యంలో గాజు ముక్కతో దాడి చేశాడన్నారు. ఈ దాడిలో నలుగురికి గాయాలయ్యాయని, సిద్దార్థ్ అనే వ్యక్తిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు తెలిపారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు ఎవరు పాల్పడినా వదిలిపెట్టేది లేదని ఏఎస్పీ హెచ్చరించారు. 

100 కు ఫోన్ చేస్తే పోలీసులు స్పందించాలి..

100 నెంబర్కు అక్కడ గొడవ జరగకముందే ఆ కాలనీవాసులు అక్కడ డీజే పెట్టుకుని డాన్స్ చేస్తుండడం వల్ల తమకు ఇబ్బంది కలుగుతుందని రాత్రి 12 గంటలకు 100కు డయల్ చేస్తే స్పందించలేదని ఆ కాలనీవాసులు పేర్కొన్నారని విలేకరులు అడిగిన ప్రశ్నకు సమాధానం ఇస్తూ 100 కాల్ రెండు గంటలకు వచ్చిందని వెంటనే పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని అక్కడ రెండు గ్రూపులు కొట్టుకుంటుండగా వారిని చెదరగొట్టడం జరిగిందన్నారు. 

ప్రెస్ మీట్ పెట్టడానికి ఆలస్యం ..

కత్తిపోట్ల జరగాయని   పట్టణంలో వార్తలు వ్యాపించి ప్రజలు ఆందోళన పడుతుంటే ప్రెస్ మీట్ పెట్టడానికి ఇంత ఆలస్యం ఎందుకు అయిందని విలేకరులు అడిగిన ప్రశ్నకు ఆమె సమాధానమిస్తూ పూర్తి సమాచారం వచ్చిన తర్వాతనే విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. పూర్తి సమాచారం లేకపోతే తప్పుడు సమాచారం ప్రజల్లోకి వెళుతుందని, అందుకే ప్రెస్ మీట్ ఆలస్యమైందన్నారు.

నాలుగు కిలోల గంజాయిని సీజ్ చేశాం..

కామారెడ్డి పట్టణంలో 10 కిలోల గంజాయిని పట్టుకున్నట్లు తెలిసిందని విలేకరుల ప్రశ్నించగా 10 కిలోలు కాదని నాలుగు కిలోలు గంజాయిని పట్టుకొని సీజ్ చేయడం జరిగిందన్నారు.

ఎక్కడైనా అసాంఘిక కార్యక్రమాలు జరిగితే సమాచారం ఇవ్వాలి..

ఎక్కడైనా అసాంఘిక కార్యక్రమాలు జరుగుతే తమ దృష్టికి తేవాలన్నారు. కామారెడ్డి పట్టణంలోని  టీ పాయింట్లలో ధూమపానం ఎక్కువగా జరుగుతుందని అక్కడ గంజాయి సరఫరా అయ్యే అవకాశం ఉందని విలేకరులు పేర్కొనగా అలాంటి చోట్ల ఉంటే తమకు సమాచారం ఇవ్వాలని, వెంటనే దానిని అరికట్టేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. ఇప్పటికే డాబాల్లో సిట్టింగ్ బంద్ చేయించడం జరిగిందని ఆమె పేర్కొన్నారు.

గ్రూపులుగా మద్యం సేవించి తిరిగితే కఠిన చర్యలు తీసుకుంటాం 

కామారెడ్డి పట్టణంలో కొందరు యువకులు మద్యం సేవించి రాత్రి పొద్దుపోయిన తర్వాత వాహనాలపై తిరుగుతూ ఇతరులకు ఇబ్బందులు కలగజేస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందనీ అలాంటివారిని పట్టుకొని కేసులు చేస్తామన్నారు. బస్టాండ్ ఏరియాలలో ప్రధాన కూడలిలో మద్యపానంపై అలాగే త్రిబుల్ రైడింగ్ పై అవగాహన కార్యక్రమాలను ఏర్పాటు చేస్తున్నామన్నారు. తల్లిదండ్రులు ఉత్తమ పిల్లల పై దృష్టి పెట్టి ఇలాంటి అలవాట్లు లేకుండా ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.   ఈ సమావేశంలో పట్టణ సీఐ నరహరి, ఎస్సై నరేష్ లు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -