ప్రస్తుత పరిస్థితుల్లో సంప్రదాయ వాణిజ్య పంటలతో పోలిస్తే పట్టుపురుగుల పెంపకం ద్వారా మంచి లాభసాటి ఆదాయాన్ని పొందవచ్చని నిరూపిస్తున్నారు మహిళా రైతు సుశీలా దేవి. మొదట ఎన్నో సవాళ్లు ఎదురైనప్పటికీ వాటిని లెక్కచేయకుండా మల్బరీ సాగుని కొనసాగించారు. ప్రస్తుతం తక్కువ సమయంలో తక్కువ పెట్టుబడితో అధిక ఆదాయాన్ని ఆర్జిస్తూ ఎంతో మంది యువ రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నారు. మరి, పట్టు పెంపకంలో ఆ మహిళా రైతు ఎదుర్కొన్న సవాళ్లేంటో వాటిని ఎలా అధిగమించారో మనమూ తెలుసుకుందాం…
పంజాబ్‌కు చెందిన నలభై ఐదేండ్ల సుశీలాదేవి దురాంగ్ ఖాడ్ అనే గ్రామంలో నివసిస్తున్నారు. తనకున్న చిన్న స్థలంలో పట్టు పురుగుల పెంపకం కోసం షెడ్డులు ఏర్పాటు చేసుకున్నారు. అందులో సెరికల్చర్ ట్రేలను రూపొందించి మల్బరీ ఆకుల సాగు చేపట్టారు. 25 ఏండ్ల కిందట సుశీలాదేవి చిన్న స్థాయిలో పట్టు పురుగులను పెంచడం మొదలుపెట్టారు. ఊరగాయలు, మురబ్బా తయారు చేయడం ద్వారా ఆమె అదనపు ఆదాయాన్ని పొందుతూ సెరికల్చర్ కొనసాగించారు. అప్పట్లో ఒక్కో పట్టు పురుగుల సైకిల్‌కి కావాల్సిన మల్బరీ ఆకులు కొనడానికి రూ.6,000 నుంచి 7,000 ఖర్చు అయ్యేదని ఆమె చెబుతున్నారు. 40 రోజుల శ్రమ తర్వాత కేవలం రూ.10,000 మాత్రమే మిగిలేవన్నారు. అదే సమయంలో దీన్ని ఇలాగే కొనసాగిస్తే భవిష్యత్తులో మంచి ఆదాయాన్ని ఇస్తుందా? లేదా? అంటూ ఎంతో సందేహించారు.
ఐఎఫ్‌ఎస్ ఆఫీసర్ నిర్ణయాలతో…
2022లో పఠాన్‌కోట్ ఫారెస్ట్ డివిజన్‌కు చెందిన ధర్మవీర్ దైరు అనే డివిజనల్ ఫారెస్ట్ ఆఫీసర్ (డీఎఫ్‌ఓ) పంజాబ్‌లోని ధార్ బ్లాక్‌లో సెరికల్చర్‌ను పునరుద్ధరించడం మొదలెట్టారు. అది సుశీలాదేవి వంటి మహిళలతో పాటు ఎంతో మంది పట్టు పురుగుల పెంపకం దారులకు మంచి అవకాశాలను తెచ్చిపెట్టింది. ఐఎఫ్‌ఎస్ ఆఫీసర్ ధర్మవీర్ దైరు తీసుకున్న నిర్ణయాలతో పట్టు పురుగుల పెంపకానికి మంచి రోజులు వచ్చాయి. మల్బరీ ఆకుల కొరత, మౌలిక సదుపాయాల రూపకల్పన, మద్దతు ధర కల్పించడం వంటి వాటిపై ఆయన చేసిన ప్రయత్నాలు ఫలించాయి. పంజాబ్ ప్రభుత్వం కూడా మల్బరీ మొక్కల, పట్టు పురుగుల పెంపకం లక్ష్యంగా రాయితీలు ఇవ్వడం మొదలుపెట్టింది.
అడ్డంకికి పరిష్కారం
PUN CAMPA (పంజాబ్ స్టేట్ కాంపెన్సేటరీ అఫారెస్టేషన్ ఫండ్ మేనేజ్‌మెంట్ అండ్ ప్లానింగ్ అథారిటీ) స్కీమ్ కింద.. అటవీ శాఖ 75 హెక్టార్ల క్షీణించిన అటవీ భూమిలో 37,500 మల్బరీ మొక్కలను నాటింది. ఇది పట్టు పురుగుల పెంపకం దారులకు ఎదురయ్యే అతిపెద్ద అడ్డంకికి పరిష్కారం చూపింది. గతంలో ఆమె 10 నుంచి15 కిలోల పట్టు కాయలను మాత్రమే పండించేది. అదే అటవీశాఖ వారు మల్బరీ మొక్కలు నాటిన తర్వాత మొదటి సీజన్‌లోనే తాను 40 కిలోల పట్టు కాయలను ఉత్పత్తి చేసినట్లు చెబుతున్నారు సుశీలాదేవి. తన సంపాదన కూడా రూ.15,000 నుంచి రూ.25,000కి, ఆపై రూ.40,000కి పెరిగిందని ఆమె ఆనందంగా పంచుకున్నారు.
సవాళ్లను ఎదుర్కొంటూనే
రెండేండ్లలో ఐఎఫ్‌ఎస్ ఆఫీసర్ ధర్మవీర్ దైరు చేపట్టిన Silk Revival Project ఐదు గ్రామాల నుంచి 11 గ్రామాలకు విస్తరించింది. ఇందులో 116 మంది రైతులు పాల్గొన్నారు. 2023లో పట్టు కాయల ఉత్పత్తి 650 కిలోలు ఉంటే 2024లో దాని ఉత్పత్తి 1000 కిలోలకు పెరిగింది. సగటు రైతు ఆదాయం సీజన్‌కు రూ. 20,000 నుంచి 25,000 పెరిగింది. కేవలం 30 నుంచి 35 రోజుల శ్రమతో 20 నుంచి 25 వేల వరకు సంపాదిస్తున్నట్లు సుశీలాదేవి చెబుతున్నారు. ప్రతి సైకిల్‌లో ఒక రిథమ్ ఉంటుంది. పట్టు పురుగులు నిశ్శబ్దంగా ఆహారం తింటాయి. కాబట్టి మొదటి 20 రోజులు ప్రశాంతంగా ఉంటాయి. చివరి 10 రోజులు పట్టు కాయలను వడకడం చాలా కష్టతరమైనది. అప్పుడు మరికొంతమంది సహకారం తీసుకుంటే మంచి ఆదాయాన్ని పొందడానికి సహాయపడుతుందంటున్నారు ఆమె. అలాగే కొన్ని సవాళ్లు ఎదురవుతాయి. వాటిని జాగ్రత్తగా ఎదుర్కొంటేనే అధిక ఆదాయాన్ని పొందడానికి అవకాశం ఉంటుందంటున్నారు సుశీలాదేవి.