Sunday, October 5, 2025
E-PAPER
Homeఎడిట్ పేజిమొదలెట్టరా మామా…

మొదలెట్టరా మామా…

- Advertisement -

ఆట కొద్దిరోజుల్లో మొదలు కానుంది.. కానీ ఇప్పటి నుంచే వేట ప్రారంభమైంది. నిన్నటిదాకా ఊళ్లలో దసరా సందడి చేసింది. అయితే పండగ అయిపోయినా.. ఇంకా నెల రోజులపాటు ఆ హంగామా కొనసాగనుంది. మందు, విందు, చిందు.. మస్తు మజా.. ఎంజాయ్ రాజా… అంటున్నారు పల్లెల్లో యువత. ఇదంతా దేనికోసమంటారా… అదేనండీ స్థానిక సంస్థల ఎన్నికల హడావుడి. రిజర్వేషన్లు ఖరారయినా, కాకపోయినా, దానిపై హైకోర్టు తీర్పు ఎలా ఉన్నా… వాటితో సంబంధం లేకుండా కచ్చితంగా తమ వర్గం వైపు నుంచి ఒకణ్ని నిలబెట్టాలి, గెలిపించుకోవాలి… దానికి ఎంత ఖర్చయినా ఫరవాలేదు, కానీ మనోడు ఒకడు పోటీలో ఉండాలనే రీతిలో కుర్రకారు ఊగిపోతున్నారు.

ఈ స్పీడ్‌లో భాగంగా ఇప్పటి నుంచే తమ మద్దతుదారులు, సానుభూతిపరులు, ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు నానా అగచాట్లూ పడుతున్నారు. పది మందిని పోగేసుకుని బైకుల్లో పెట్రోల్‌ పోసుకుని మరీ.. గల్లీ గల్లీ తిరుగుతున్నారు. ‘అమ్మలారా.. అక్కలారా.. రిజర్వేషన్లు ఖరారైతే వీడు మావైపు నుంచి పోటీలో ఉంటాడు, ఖరారు కాకపోతే ఇదిగిదిగో వీడు రేసులో ఉంటాడు.. అందుకే మీరు మాలో ఎవరికో ఒకరికి ఓటేయాల్సి ఉంటుంది. మమ్మల్ని గుర్తుంచుకోండి.. కనికరించండి…’ అంటూ తెగ ప్రాధేయ పడుతున్నారు. ఇంతకీ మీరు గెలిచిన తర్వాత ఏయే ప్రజా సమస్యలను పరిష్కరిస్తారు? అంటే మాత్రం.. నో ఆన్సర్‌…

బి.వి.యన్‌.పద్మరాజు

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -