ఇది వేగవంతమైన మార్పుల యుగం. టెక్నాలజీ, ఎకానమీ, పర్యావరణం, భౌమ్య రాజకీయాలు, సహకారం, అంతర్జాతీయ సంబంధాలు, పరిశోధన ఇత్యాది రంగాలు ఒకదానిని ఇంకొకటి ప్రభావితం చేస్తూ ప్రపంచంలో శరవేగంగా మార్పులు సంభవిస్తున్న విషయం మనందరం చూస్తున్నదే. అయితే ఈ మార్పులు అనేక సవాళ్లను మనముందుంచడంతో పాటు కొత్త అవకాశాలుగా కూడా మానవాళికి అందివస్తున్నాయి.
ఈ నేపథ్యంలో యునెస్కో (UNESCO) ప్రపంచ దేశాలను విధానపరంగా విద్యకు సంబంధించి ఐదు కీలకాంశాలను అమలుపరచాల్సిందిగా ఆదేశించింది. ఈ ఐదు అభ్యసన మార్గాలను విద్యాస్తంభాలు (ఫైవ్ పిల్లర్స్ ఆఫ్ ఎడ్యుకేషన్)గా యునెస్కో అభివర్ణించింది. విద్య పరిపూర్ణ విద్యగా మానవీయ విద్యగా రూపొందాలన్న బహత్ సంకల్పంతో 1993లో యునెస్కో అంతర్జాతీయ విద్యాకమీషన్‌ను ఏర్పాటు చేసింది. దీనికి అధ్యక్షుడిగా ఆధునిక ఐరోపా సష్టికర్తగా ప్రసిద్ధికెక్కిన అప్పటి యూరోపియన్ కమీషనర్ జాక్విస్ డిలోర్స్‌ను నియమించింది. గ్లోబల్ పర్స్‌పెక్టివ్‌తో అభ్యసన పద్ధతుల మీద విస్తత అధ్యయనం జరిపిన డిలోర్స్ తన రిపోర్టును యునెస్కోకు సమర్పించాడు. ఈ నివేదిక ‘లెర్నింగ్ : ది ట్రెజర్ వితిన్’ అనే పేరుతో 1996లో ముద్రితమైంది. ఇందులో విద్యార్థుల సమగ్ర వికాసానికి నాలుగు అభ్యసన స్తంభాలు (ఫోర్ లెర్నింగ్ పిల్లర్స్)ను డిలోర్స్ ప్రతిపాదించాడు.
సోక్రటిక్ మెథడ్ లాంటి అభ్యసనావగాహన, అభ్యసన ప్రయాణంపై విద్యార్థులు తామే యాజమాన్యాన్ని చేపట్టి అభ్యసన ప్రక్రియలో చురుకుగా పాల్గొంటూ తమతోపాటు సామాజిక మార్పును సాధించే దిశగా డిలోర్స్ సమాలోచన చేసినట్టు అభ్యసన స్తంభాలను గమనిస్తే తెలుస్తుంది. ‘తెలుసుకోవడమెలాగో నేర్చుకోవడం (Learning to Know), తెలిసిందాన్ని చేయడమేట్లానో నేర్చుకోవడం (Learning to Do), కలిసి జీవించడమెట్లానో నేర్చుకోవడం (Learning to Live Together), నిత్య అభ్యాసకుడిగా ఉండటం (Learning to Be) ‘ అనే నాలుగు అభ్యసన స్తంభాలను డిలోర్స్ రూపొందించాడు. వీటిని యధాతధంగా ఆమోదిస్తూనే అదనంగా 21 వ శతాబ్దపు అవసరాలను దష్టిలో ఉంచుకొని ‘ఒకరి నుండి మరొకరు మార్పుచెందడం ఎట్లానో నేర్చకోవడం (Learning to Transform Oneself and Others)’ అనే ఐదవ పిల్లర్ ను యునెస్కో జతచేసింది.
ఈ ఐదు అభ్యసన స్తంభాలు విద్యలో నాణ్యతా ప్రమాణాలతోపాటు విద్యార్థుల్లో దార్శనికతనూ ఆదర్శాలనూ నవకల్పనా పటిమను పాదుకొల్పగలవని యునెస్కో అభిప్రాయపడింది. విద్యలో తల్లిదండ్రులు, యాజమాన్యం ఉపాధ్యాయులు, విద్యార్థులు ఒక్కొక్కరిది ఒక్కో బాధ్యతాయుతమైన పాత్ర. యునెస్కో అభ్యసన స్తంభాల అమలులో గురువులదే కీలకపాత్ర. ఎందుకంటే, ఇవి ఎడ్యుకేషన్ ఫిలాసఫీకి, ఎడ్యుకేషన్ సైకాలజీకీ ఎపిస్టమాలజీకి సంబంధించిన అంశాలు. ఇవి నిరంతర అధ్యయనం, ప్రయోగాత్మక బోధన అలవడితేనే ఉపాధ్యాయులకు సాధ్యం. అయితే అభ్యసన స్తంభాల అమలుతో విద్యార్థులు విషయాన్ని బాగా అర్థం చేసుకోగలుగుతారు, ఆర్జించిన జ్ఞానాన్ని జీవితమంతా గుర్తుంచుకోలుగుతారు. భావిజీవితంలో మెరుగైన పనితీరుకు, ప్రేరణాత్మక ఆచరణకు, మెరుగైన ఉపాధిని ఎంచుకోవడానికి, ఆత్మవిశ్వాసం మరింత బలపడుతుంది.
విద్య యొక్క మౌలిక లక్షణాలను చాటిచెపుతున్న అభ్యసన స్తంభాల్లో ఒక్కోదాని గురించి విడివిడిగా పరిశీలించినపుడు తెలుసుకోవడమెలాగో నేర్చుకుంటే- అభిజ్ఞా నైపుణ్యాలు, జ్ఞాపకశక్తి, తార్కికత, సమస్యా పరిష్కారం, విమర్శనాత్మక ఆలోచలు అబ్బుతాయి. పని నేర్చుకోగలిగితే- ఉపాధి నైపుణ్యాలు, సామర్థ్యాల పెంపు, అనుభవం గడించడం, నిజ జీవితానికి నాలెడ్జ్ అప్లై చేయడం, భిన్న పరిసరాల్లో పనిచేయగలిగే సామర్థ్యాలు పెంపొందుతాయి. కలిసి జీవించడం నేర్చుకుంటే- శాంతియుత సహజీవనం, విభిన్న సామాజిక నేపథ్యాల నుండి వచ్చిన వ్యక్తుల మధ్య గౌరవ మర్యాదలు, సహకారం, తాదాత్మ్యం, భాగస్వామ్య భావన వ్యవస్థీకతమవుతాయి. తనను తాను మార్చుకుంటూ సమాజాన్ని మార్చడమనే ఈ ఐదో స్తంభం సంక్లిష్ట సవాళ్లను అర్థం చేసుకోవడానికి, ప్రతిస్పందించడానికి వ్యక్తుల సామర్థ్యాన్ని ఇనుమడింపజేస్తూ మార్పువైపుకు నడిపిస్తుంది.
సమాజ మనుగడకు భద్రతకు మరింత న్యాయమైన, స్థిరమైన భవిష్యత్తును సష్టించే దిశగా మనుషుల్ని నడిపిస్తుంది. గురుపూజితులు డా.సర్వేపల్లి రాధాకష్ణన్ నిర్వచించినట్టు ”విద్య అంటే కేవలం అక్షరాస్యత పెరగడం కాదు. విద్యార్థులను సమగ్రంగా తీర్చిదిద్దడం, గురువుల గౌరవాన్ని పెంపొందించడం, ప్రతిభాసంపత్తిని అన్ని దిశలకు పంచడం. స్వేచ్ఛాయుతమైన సజనాత్మకత కలిగిన పౌరసమాజ నిర్మాణం, చారిత్రక పరిస్థితులకు ప్రకతి ప్రతికూలతలకు వ్యతిరేకంగా పోరాడగల ధీమంతుల తయారీయే విద్య అంతిమ ఉత్పత్తి”. బహుశా! యునెస్కో ప్రకటించిన అభ్యసన స్తంభాల రూపం సారం, మన రాధాకష్ణ పండితుడి విద్యా దక్పథం ఒక్కటే కావున ఒకదాని అమలు ఫలసిద్ధి రెండోదాని సాక్షాత్కారమని ఉపాధ్యాయులు గుర్తెరగాల్సివుంది.
డా.బెల్లి యాదయ్య, 9848392690