చరిత్రను తెరకెక్కిస్తూనే కొంత కళా స్వేచ్ఛ తీసుకుంటూ ఇతిహాస చారిత్రక నాటక చిత్రాలను హాలీవుడ్ నిర్మించింది. ఇలాంటి చిత్రాల వల్ల చారిత్రిక పాత్రలు వారి జీవన కాలాలు, వారి జీవితంలో ముఖ్యమైన సంఘటనలు తరువాతి తరాలకు చేరుతాయి. అలాగే అందులోని కాల్పనిక పాత్రలు ఆదర్శవంతంగా ఉంటూ కథకు బలాన్ని ఇస్తాయి. నిజానికి ఈ చిత్రాలను ప్రేక్షకులు విపరీతంగా ఆదరిస్తారు. ఇది అన్ని తరాలలోనూ గమనించవచ్చు. అలా తీసిన ఇతిహాస చారిత్రిక సినిమా గ్లాడియేటర్.
2000లో వచ్చిన ఈ సినిమాకు రిడ్లీ స్కాట్ దర్శకత్వం వహించారు. డేవిడ్ ఫ్రాంజోని, జాన్ లోగన్, విలియం నికల్సన్ కథను అందించారు. ఇందులో రస్సెల్ క్రో, జాక్విన్ ఫీనిక్స్, కోనీ నిల్సన్, ఆలివర్ రీడ్, డెరెక్ జాకోబి, డ్జిమోన్ హౌన్సౌ, రిచర్డ్ హారిస్‌లు ముఖ్య పాత్రలలో నటించారు. హాలీవుడ్ నిర్మించిన చిత్రాలలో తప్పకుండా చూడవలసిన సినిమాగా దేశ విదేశాలలోనూ పేరు పొందిన గ్లాడియేటర్ ప్రపంచ ఉత్తమ చిత్రాలలో మొదటి వరుసలో నిలుస్తుంది. 21 శతాబ్దపు గొప్ప చిత్రాలలో ఇది ఒకటి అన్నది విశ్లేషకుల అభిప్రాయం. ఈ సినిమా ఐదు అకాడమీ అవార్డులను సొంతం చేసుకుంది. ఉత్తమ చిత్రంగా గెలవడమే కాక, ముఖ్య పాత్రలో నటించిన రస్సెల్ క్రోకు ఉత్తమ నటుడిగా ఆస్కార్ అందించిన చిత్రం ఇది. క్రీ. శ. 180 సంవత్సరానికి ఈ కథ ప్రేక్షకులను తీసుకెళుతుంది. రోమన్ జనరల్ మాగ్జిమస్ డెసిమస్ మెరిడియస్ చక్రవర్తి మార్కస్ ఆరేలియస్ ఆదేశానుసారం యుద్ధాలలో పాల్గొని రోమ్‌కు విజయం చేకూర్చి చాలా కాలం తరువాత తన ఇంటికి వెళ్లడానికి ఉత్సాహంగా సన్నాహాలు చేసుకుంటాడు.
అతన్ని అభినందించడానికి వచ్చిన చక్రవర్తి ఆరేలియస్ సొంత కొడుకు కొమోడస్ తనకు వారసుడిగా, ఆ రాజ్యానికి చక్రవర్తిగా పనికి రాడని, మాగ్జిమస్‌ను తన రిజెంట్ అంటే చక్రవర్తి అనుమతితో రాజ్యభారం స్వీకరించే నమ్మకమైన వ్యక్తిగా ప్రకటించాలని అనుకుంటున్నానని చెబుతాడు. కొమోడస్ తండ్రి మనసులో ఉన్న ఉద్దేశాన్ని ముందే గ్రహిస్తాడు. మాగ్జిమస్ పట్ల తన తండ్రి కున్న ప్రేమను అర్ధం చేసుకుంటాడు. అందుకే తండ్రి ఆ ప్రకటన చేయక మునుపే నిద్రపోతున్న చక్రవర్తి మార్కస్ ఆరేలియస్‌ను దిండు ముఖంపై అదిమి పెట్టి చంపేస్తాడు కొమోడస్. ఆ తరువాత తనను రోమ్‌కు చక్రవర్తిగా ప్రకటించుకుని మాగ్జిమస్ విధేయత కోరతాడు. అతనితో కలిసి పని చేయడానికి మాగ్జిమస్ ఇష్టపడడు. అందుకని అతన్ని ఖైదు చేస్తాడు కొమోడస్. తనను బంధించిన వారిని చంపి తన కుటుంబాన్ని రక్షించుకోవడానికి సొంతూరికి వెళతాడు మాగ్జిమస్. కాని అప్పటికే అతని భార్య, కొడుకు హత్యకు గురి అవుతారు. ఆ ఇద్దరి శవాలను ఖననం చేసి స్పహ తప్పిపోయి పడి ఉన్న మాగ్జిమస్‌ను బానిసలతో వ్యాపారం చేసే వ్యక్తులు పట్టుకుని జుకాబర్ అనే ప్రాంతానికి తీసుకెళతారు.
ఆ ఊరిలో గ్లాడియేటర్లకు తర్ఫీదు ఇచ్చే ప్రాక్సిమో మాగ్జిమస్‌ను కొనుక్కుంటాడు. కొమోడస్ చెల్లెలు లూసియా భర్త చనిపోయాక తన కొడుకు లూసియస్‌తో తండ్రి ఇంట ఉంటుంటుంది. కూతురు అంటే చక్రవర్తికి ఎంతో ఇష్టం. లూసియా ఒకప్పుడు మాగ్జిమస్‌ని ప్రేమిస్తుంది. కాని ఎవో కారణాల వల్ల వీరి వివాహం జరగదు. తన తండ్రి మరణం సహజమైనది కాదని లూసియా అర్ధం చేసుకుంటుంది. కాని తనకు ఏ మాత్రం అనుమానం వచ్చినట్లు బయటపడినా తన కొడుకు ప్రాణానికి హాని ఉంటుండని రాచరికపు రాజకీయాలను అర్ధం చేసుకున్న లూసియా జాగ్రత్తపడుతుంది. కొమోడస్ లూసియాను ఒక కంట కనిపెడుతూనే ఉంటాడు. పైగా ఆమెతో బిడ్డను కనాలని అతని కోరిక. రాచరికపు రక్తంతో కలిగే సంతానం రాజ్యానికి చక్రవర్తులుగా ఎదగగలరని ఆ రోజుల్లో అన్నా చెల్లెల్లు సంతానం కనేవారని చరిత్ర చెబుతుంది. తన కొడుకు కోసం ఈ హింస భరిస్తూ అన్నను నమ్ముతున్నట్లుగానే ఉంటూ అతనికి చిక్కకుండా, తాను గ్రహిస్తున్న నిజాలను బైట పెట్టకుండా కొమోడస్ దగ్గర రోజులు గడుపుతూ ఉంటుంది లూసియా.
ప్రాక్సిమో తనను కొనుక్కున్న తరువాత మాగ్జిమస్ అతనితో పని చేయడానికి మొదట ఇష్టపడడు. కాని తన భార్యాబిడ్డల హత్యకు ప్రతీకారం తీర్చుకోడానికి తాను జీవించే ఉండాలని నిశ్చయించుకుంటాడు. తన అధికార హోదా బైటపెట్టకుండా ఓ అనామకుడిగానే ఆ బానిసల మధ్య ఉండిపోతాడు. అతని శరీరపు రంగు, ఆకారం చూసి అతన్ని ‘స్పానియార్డ్’ అంటే స్పెయిన్ ప్రాంతపు వాడిగా అందరూ పిలవడం మొదలెడతారు. అక్కడే జూబా, హేగన్ అనే మరో ఇద్దరు బానిసలతో మాగ్జిమస్‌కు స్నేహం కుదురుతుంది. మాగ్జిమస్ కొన్ని పోటీలలో గెలిచి ప్రాక్సిమో నమ్మకాన్ని సంపాదిస్తాడు. అదే సమయంలో కొమోడస్ మరణించిన తన తండ్రి జ్ఞాపకార్థం రోమ్‌లో గ్లాడియేటర్లతో పోటీలను ప్రకటిస్తాడు. తాను ఒకప్పుడు గ్లాడియేటర్ నని, అయితే చక్రవర్తి ఆరేలియస్ తన బానిసత్వాన్ని రద్దు చేసి తనకు స్వేచ్చను ప్రసాదించాడని ప్రాక్సిమో మాగ్జిమస్‌తో చెబుతాడు.
ఈ పోటీలో గెలిచి ప్రజలను మెప్పించి మాగ్జిమస్ తన స్వేచ్చను కొనుక్కోవచ్చని అతనికి ఆశ కల్పిస్తాడు. పురాతన రోమ్‌లో గ్లాడియేటర్లు వత్తిపరమైన, సాయుధ యోధులు. ప్రజా వినోదం కోసం, వీళ్ల మధ్య పోటీలు నిర్వహించేవాళ్లు. వీళ్లు ఇతర గ్లాడియేటర్లు, అడవి జంతువులు, మరణశిక్ష వేసిన నేరస్థులతో బహిరంగంగా మైదానాల్లో యుద్ధంలో పాల్గొనేవాళ్లు. చాలావరకు ఈ గ్లాడియేటర్లు అమ్ముడుపోయిన బానిసలు, ఖైదీలు లేదా సామాజిక బహిష్కరణకు గురైనవారు. పోటీల్లో తలపడేవారిలో ఎవరో ఒకరు చనిపోవడం తప్పదు. ఈ బహిరంగ యుద్ధాలను, పాశవిక హత్యలను చూడడానికి ప్రజలంతా గుమిగూడేవాళ్లు. ఆ నాటి మానవ హింసాత్మక వినోదాలకు రోమ్ కలోసియం ప్రత్యక్ష సాక్షి.
ఈ సినీ కథలో కూడా రాజధాని రోమ్‌లోని కలోసియంలో ఈ పోటీలు మొదలవుతాయి. ప్రాక్సిమో తన గ్లాడియేటర్లతో అక్కడకు వెళతాడు. తనను ఎవరూ గుర్తుపట్టకుండా ముఖానికి తొడుగు వేసుకుని మాగ్జిమస్ ఈ పోటీల్లో పాల్గొంటాడు. అతని వీరత్వానికి ప్రజలు బ్రహ్మరధం పడతారు. గెలిచిన మాగ్జిమస్‌ను అభినందించడానికి మైదానంలోకి కొమోడస్ అతని మేనల్లుడు లూసియస్ వస్తారు. కొమోడస్ పై తనకున్న కోపాన్ని కసిని నియంత్రించుకుంటాడు మాగ్జిమస్. కాని కొమోడస్ బలవంతం చేయడంతో తన ముఖంపై నున్న తొడుగు తొలగిస్తాడు మాగ్జిమస్. తాను ప్రతీకారం కోసమే జీవించి ఉన్నానని ఏ మాత్రం భయం లేకుండా తనను గుర్తు పట్టిన కొమోడస్‌తో చెబుతాడు మాగ్జిమస్. చుట్టూ ప్రజలందరూ అతన్ని అభినందిస్తుంటే వారందరి సమక్షంలో మాగ్జిమస్‌ను గుర్తుపట్టినా ఏ హానీ తలపెట్టలేకపోతాడు కొమోడస్. మాగ్జిమస్ బతికే ఉన్నాడని కొడుకు చెప్పింది విని గ్రహిస్తుంది లూసిలా. అతన్ని రాత్రి పూట రహస్యంగా కలుసుకుంటుంది. కొమోడస్‌పై తిరుగుబాటుకు తాను సహాయం చేస్తానని అంటుంది. కాని ఆమెను మాగ్జిమస్ నమ్మడు. ఆమె సహాయాన్ని నిరాకరిస్తాడు.
మాగ్జిమస్‌ని ఎలాగయినా హత్య చేయాలని కొమోడస్ ఓ పధకం వేస్తాడు. రోమ్‌లో అతి భయంకరుడని పేరు పొందిన టైగ్రిస్ అనే గ్లాడియేటర్‌తో అతన్ని తలపడమని పోటీ పెడతాడు. టైగ్రిస్ పులులతో కలిసి పోటీల్లో పాల్గొంటాడు. పులలతో యుద్ధం చేసి టైగ్రిస్‌ను ఓడిస్తాడు మాగ్జిమస్. ఓడిన గ్లాడియేటర్‌ను గెలిచిన వాళ్లు హత్య చేయడం అక్కడి సాంప్రదాయం. దాన్ని అనుసరించి టైగ్రిస్‌ను చంపమని మాగ్జిమస్‌ను ఆజ్ఞాపిస్తాడు కొమోడస్. మాగ్జిమస్ దానికి ఒప్పుకోడు. టైగ్రస్‌ను వదిలేస్తాడు. దీనితో ప్రజలందరూ అతనికి దాసోహం అంటారు. ఇది కొమోడస్‌ను ఇంకా కోపానికి గురి చేస్తుంది. ఈ పోటీలో పాల్గొన్న మాగ్జిమస్‌ను అతని సైన్యంలో పని చేసిన సైనికాధికారి గుర్తు పడతాడు. మాగ్జిమస్‌ను కలిసి తనతో పాటు మరి కొందరు కొమోడస్‌పై తిరుగుబాటుకు మాగ్జిమస్ నేతత్వంలో పని చేయడానికి సిద్దంగా ఉన్నామని చెబుతాడు. దీనితో మాగ్జిమస్ తిరుగుబాటుకు ప్రణాళిక రచిస్తాడు. లూసిల్లా మాగ్జిమస్‌ను విడిపించడానికి సహయపడుతుంది. అయితే మేనల్లుడు అమాయకంగా విషయం బైటపెట్టడంలో కొమోడస్ జాగ్రత్తపడతాడు. మాగ్జిమస్‌కు సహాయం చేసిన వారిని చంపడానికి పన్నాగం పన్నుతాడు. ప్రాక్సిమోతో పాటు ఇతర బానిసలు మాగ్జిమస్‌కి సహయపడినా వారంతా సైన్యం చేతిలో మరణిస్తారు. మాగ్జిమస్ సైన్యం చేతికి చిక్కుతాడు.
ఈసారి కొమోడస్ స్వయంగా మాగ్జిమస్‌తో పోరుకి కోలోసియంలోకి దిగుతాడు. పోరుకి ముందు దొంగ చాటుగా మాగ్జిమస్‌ను కత్తితో గాయపరుస్తాడు కొమోడస్. అయినా భయంకరమైన పోరులో మాగ్జిమస్ కొమోడస్‌ను చంపేస్తాడు. తీవ్ర గాయాలతో మరణించబోయే ముందు గ్లాడియేటర్లకు దాస్య విముక్తి, గ్రాచెస్ అనే చక్రవర్తి మిత్రుడిని సెనేటర్‌గా నియమించాలని కోరతాడు మాగ్జిమస్. చివరి శ్వాస తీసుకుంటూ ఆవలి వైపు తన భార్యాబిడ్డని కలవబోతున్నానన్న ఆనందంతో కన్ను మూస్తాడు మాగ్జిమస్. అతన్ని రోమ్ వీరుడిగా ప్రజలు స్తుతిస్తారు. ఈ కథలో పాత్రలు చారిత్రికమైనవే అయినా కొంత అవాస్తవాలతో కథ నిర్మించారు. నిజానికి చక్రవర్తి మార్కస్ ఆరేలియస్ సహజంగా మరణించారు. కొమోడస్ అతన్ని చంపడం అన్నది సినిమా కోసం మార్చిన కథ. కొమోడస్ తండ్రి బతికి ఉండగానే చక్రవర్తి అయ్యాడు. మాగ్జిమస్ పాత్ర పూర్తిగా కల్పితం. ఇది రోమ్ వీరుడు స్పార్టకస్ ప్రేరణతో సష్టించబడ్డ పాత్ర.
కొమోడస్ కొలోసియంలో పోటీలలో పాల్గొనేవాడు, కాని అతను నిద్రలో తన మందిరంలో చంపబడ్డాడు. లూసిల్లాకి మొదటి వివాహంతో ఓ కొడుకు ఉన్నాడు. ఆ బిడ్డ చినతనంలోనే చనిపోయాడు. తరువాత ఆమె మళ్లీ వివాహం చేసుకుందని ఆమెకు మరో కొడుకు పుట్టాడని చరిత్ర చెబుతుంది. తనను చంపే పన్నాగంలో పాలు పంచుకుందన్న నేరంతో లూసిల్లకు మరణ శిక్ష విధించాడు కొమోడస్. సినిమాలో చూపినట్లు రోమ్‌లో గ్లాడియేటర్ల పోటీలను చక్రవర్తి రద్ధు చేయలేదు. కొమోడస్ మరణం తరువాత రోమ్ దాయాదుల యుద్ధాలతో, మారణహోమంతో అట్టుడికిపోయింది.
అయితే సినిమాలో ఈ నిజాలను కాస్త వక్రీకరించి చూపినా ఆనాటి రోమ్ జీవన పరిస్థితులను యధావిధంగా చిత్రీకరించారు. ఈ సినిమాకు ఫోటోగ్రఫి ప్రాణం. ముఖ్యంగా కొలోసియంలో యుద్ధ సన్నివేశాల చిత్రీకరణ చాలా గొప్పగా ఉంటుంది.
మాగ్జిమస్‌గా నటించిన రస్సెల్ క్రో ప్రపంచంలో కోట్లాది మందికి దగ్గరయ్యారు. రిడ్లి స్కాట్ దర్శకత్వం అత్యుత్తమ స్థాయిలో ఉంటుంది. ఈ సినిమా తరువాత చారిత్రిక నేపద్యంలో తీసిన సినిమాలకు ఆయన మార్గదర్శకుడిగా మారారు. గ్లాడియేటర్ సినిమాను ది పర్ఫెక్ట్ పిక్చర్‌గా ప్రస్తావిస్తారు విశ్లేషకులు. కొమోడస్ పాత్ర పోషించిన జాక్విన్ ఫీనిక్స్ విలనిజానికి కొత్తదనాన్ని తీసుకొచ్చారు. ఎక్కడా గొంతు పెంచకుండా శరీరాన్ని సౌమ్యంగా, నెమ్మదితనంతో నింపుకుని కేవలం కళ్లతో క్రౌర్యాన్ని అతను పలికించిన విధానం ఎన్నో కొత్త విలన్ పాత్రలను ఆ తరువాత సష్టించగలిగింది. హీరో కన్నా, కొన్ని సందర్భాలలో విలన్‌ని గొప్పగా విశ్లేషకులు ప్రస్తావించడం ఈ సినిమా మరో ప్రత్యేకత. రస్సల్ క్రో ఈ సినిమా చిత్రీకరణలో ఎన్నోసార్లు గాయాల పాలయ్యారట. సినీ ప్రపంచంలో దేశ విదేశాలలో ఎందరో కళాకారులకు మార్గదర్శకంగా నిలిచిన చిత్రం ‘గ్లాడియేటర్’
పి.జ్యోతి,
98853 84740