Sunday, October 5, 2025
E-PAPER
Homeకథకల-వరం

కల-వరం

- Advertisement -

చాచి పెట్టి ఒక్క లెంపకాయ కొట్టాడు అతను.
ఆమె బుగ్గ బాగా కందిపోయి ఉంది. కళ్ళు ఎర్రగా మారిపోయాయి. అతికష్టమ్మీద కన్నీరు ఆపుకుంటున్నట్లు ఆమెని చూస్తే అర్ధం అవుతుంది. ఆమె ఎదురుగా రాజేశ్‌ ఆవేశంతో రగిలిపోతున్నాడు. పెళ్ళైన ముఫ్ఫై మూడేళ్ళల్లో ఒక్కసారి కూడా ఆమెలో అంత కోపాన్ని అతను చూడలేదు.

ఆమెని ఎంత గట్టిగా చెంపదెబ్బ కొట్టాడంటే అరచెయ్యి ఎర్రగా కమిలిపోయింది. పెళ్ళైన దగ్గర్నుంచి ఆమెని ఏదో ఒకరకంగా హింసిస్తున్నా ఈసారి మాత్రం రాజేశ్‌ కోపం హద్దులు దాటిపోయింది. అందుకే చాచిపెట్టి చెంపమీద కొట్టాడు. ఆమెకి దంతాలు కదిలిపోయినంత పనైంది. నడివయసు దాటి సంసారంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని ఎదుర్కొని ఎంతో సహనంతో చాలా దెబ్బలు తింది…తన్నులూ కాసింది. కానీ ఈసారి తన కోడలి ముందు, చుట్టాల ముందు అంతగా అతను కొట్టేసరికి తోక తొక్కిన తాచు అయ్యింది.

”చాలు ఇక చాలు! వస్తున్న ఏడుపుని పంటి కింద బిగపట్టి అన్నది రవళి.
”రాజేశ్‌!.
ఆమె తన పేరు పెట్టి పిలిచేసరికి అతను తట్టుకోలేక పోయాడు. అతని అహం మరింత దెబ్బతింది.
”ఇన్ని సంవత్సరాలు అందరిముందు అవమానించినా భరించా, కానీ ఇప్పుడు నా మాట కూడా వినకుండా, మీ వాళ్ళ మాట వినేసి చెయ్యి చేసుకున్నావు. ఒకటి మటుకు గుర్తుపెట్టుకో., చివరికి నీకు నేను, నాకు నువ్వే ఉంటాము. నిన్ను కన్నవాళ్ళో లేక నన్ను కన్నవాళ్ళో ఉండరు, నీ అవసానకాలంలో గాని నా విలువ తెలిసి రాదు. అయినా నీకు నేను అన్నా.., నా మాట అన్నా గౌరవం కానీ విలువ కానీ ఏమీ లేదు., అంటూ రూంలోకి వెళ్ళిపోయింది.

కూతురూ, కోడలు, అల్లుడు ఇదంతా మామూలే అన్నట్లు ఎవరిగదిలోకి వాళ్ళు వెళ్ళిపోయారు. రాజేశ్‌ ఒక్కడే అక్కడ మిగిలాడు. తనని పేరు పెట్టి భార్య అలా మాట్లాడటం అతనికి మింగుడుపడటం లేదు.
రోజులు గడుస్తున్నాయి… ఎవరూ ఎవరితో మాట్లాడుకోవడాలు లేవు. కూతురు అత్తారింటికి వెళ్ళిపోయింది. కొడుకు కోడలు సిటీకి వెళ్ళిపోయారు. ఉన్నది ఇద్దరే. భార్యా భర్తలుగా భోజనాలు చేస్తున్నా… కలిసి ఉంటున్నా ఎవరితోవ వాళ్ళదే.

ఆరోజు రవళి అన్నం కూడా వండలేదు. అతను అడగలేదు. ఆమె మౌనం అతన్ని సాధిస్తోంది. అతను అరిచాడు. ఆమె విన్నది…మౌనమే సమాధానం. బైటికి వెళ్ళి ఏదో తెచ్చాడు, తిన్నాడు. ఆమె కంచం కూడా తియ్యలేదు.
అర్ధరాత్రి అయినట్లు ఉంది…హఠాత్తుగా మెలకువ వచ్చింది రాజేశ్‌కి. పొడి దగ్గు ఎక్కువైందతనికి. దగ్గుతూ, ‘మంచి నీళ్ళు ఇవ్వు’ అంటూ రవళిని అడిగాడు రాజేశ్‌. బదులు రాలేదు, టేబుల్‌ లైట్‌ వేసి పక్కన చూశాడు. రవళి లేదు, బాత్‌ రూంలోకి వెళ్లిందేమో అని అటుగా చూస్తే లైట్‌ ఆఫ్‌ చేసి ఉంది. లేవలేని పరిస్థితి, దగ్గు ఎక్కువ అవడంతో టేబుల్‌ మీద ఉన్న బాటిల్‌ అందుకోబోయాడు కానీ చెయ్యి తగిలి కిందకి పడిపోయింది.

‘రవళి… రవళి’ అంటూ అరుస్తున్నా, ఎటువంటి సమాధానం లేకపోవడంతో తన పక్కనే ఉన్న ఫోన్‌ తీసుకుని డయల్‌ చేశాడు… రింగ్‌టోన్‌ పక్కనే మోగేసరికి గాభరాగా పక్కనే ఉన్న దిండుకేసి చూసాడు. దిండు ఎత్తాడు. ఫోన్‌ అక్కడే ఉంది. దానితోపాటు ఒక కాగితం కూడా. చేతిలోకి తీసుకున్నాడు.
”మిస్టర్‌ రాజేష్‌, 35 ఏళ్ళు … , నేనేంటో…నా స్థానమేంటో తెలీకుండానే నీతో ఉన్నాను. ఇంకా నీతోనే ఉంటే.. ఆడపిల్లగానే కాదు, మనిషిగా కూడా తప్పు చేసినదాన్నవుతా. అందుకే నాకు నేను తప్ప నీకు ఏమి కానీ నేను నీ నుంచి దూరంగా వెళ్ళిపోతున్నాను. నా గురించి వెతకద్దు. నేను, నా మనసు, నా అభిమానం తప్ప నాది అంటూ ఏమి లేదు. ఏమి తీసుకెళ్ళట్లేదు. ఎటు వెళ్ళాలో ఎవరి దగ్గరకు వెళ్ళాలో తెలియని ఈ వయసులో నిన్ను వదిలి వెళ్తున్నానంటే నన్ను అనుమానిస్తే అది నీకే అవమానం.

ఇప్పటికైనా నిన్ను నువ్వు అర్ధం చేసుకో. పెళ్ళి అనే బంధంతో నీ దగ్గరికి నా అన్న వాళ్ళందరిని వదిలి వచ్చాను. కానీ నువ్వు మాత్రం నువ్వు కోరుకున్న నీ ప్రపంచంలోనే ఉన్నావ్‌. ఏ రోజు నాకు ఏది ఇష్టమో లేదో తెలుసుకునే ప్రయత్నం చేయలేదు. ప్రతి మగాడికి లైఫ్‌ లో ఎన్నో టర్నింగ్‌ పాయింట్స్‌ ఉంటాయి. కానీ ఏ ఆడపిల్లకైనా లైఫ్‌ లో ఒకటే టర్నింగ్‌ పాయింట్‌ అదే పెళ్ళి. ఎన్నో కలలు కంటుంది. కోటి ఆశలతో వస్తుంది. ఆశలు ఆవిరవుతున్నా…కలలు కల్లలవుతున్నా భర్త సంతోషం తన సంతోషం అని కాంప్రమైజ్‌ అయిపోతు బతికేస్తుంది. దీనికి నేను అతీతురాల్ని కాదు.”
అంత ఏసీ గదిలోనూ అతనికి నుదుటిమీద చమట్లు పట్టసాగాయి.

”నీకు గుర్తుందా రాజేష్‌ మన పెళ్ళిలో జరిగిన గొడవైనా కాని., భోజనాల దగ్గర మీ అమ్మ చేసిన గొడవైనా , అలాగే మా వాళ్ళని అవమానించినప్పుడు కూడా నీ నోటి నించి ఒక్క మాట కూడా రాలేదు. అప్పుడే నిన్ను అర్ధం చేసుకోలేకపోయాను. అప్పగింతలప్పుడు మా వాళ్ళు పెళ్ళిలో ఇవి మామూలేనమ్మా మనసులో ఏం పెట్టుకోకు అని సర్ది చెప్పారు. పెళ్ళి అయ్యి పది ఏళ్ళు అయినా మనకు, నువ్వు ఎప్పుడు మీ అమ్మ నాన్న మాటలు వినడం, అందరిముందు నన్ను అవమానిస్తూ వచ్చినా, నేను సర్దుకుపోయాను. నీలో మార్పు వస్తుంది అని, కానీ మార్పు కాదు కదా ఆలోచన కూడా రాలేదు. సరే జీవితాంతం మన ఇద్దరం కదా కలిసి ఉండాలి అని దానికి తలవంచా. అయినా నీలో మార్పులేదు బయట వాళ్ళు నా గురించి ఏమి చెప్పినా వాళ్ళ మాటకు విలువ ఇచ్చావు. కనీసం ఒక్కసారి నాతో మాట్లాడి అసలు ఏమి జరిగిందో తెలుసుకోవాలి అనుకోలేదు. ఇక పిల్లల విషయంలో వాళ్ళు నాకు ఎక్కడ దగ్గర అవుతారో అని వాళ్ళ పసి మనసులో ముందు నుంచే అమ్మ మీద ద్వేషం పెంచావు. వాళ్ళ పెళ్ళిళ్ళు అయ్యి వారి దారిన వాళ్ళు వెళ్ళి పోయారు.

నీ మీద గహ హింస కేస్‌ పెట్టలేక కాదు, అలా పెడితే బలవంతంగా కౌన్సెలింగ్‌ ద్వారా, లేక పోలీస్‌ వాళ్ళ భయంతోనో, పరువు కోసమో కాపురం చేస్తావు. అది ఇష్టం లేకే ఇవ్వలేదు. కాకపోతే నేను నా సంతోషాలన్నీ కోల్పోయాను కానీ నీలో మార్పు రాలేదు. ఇప్పుడు ఎందుకు వెళ్ళిపోతున్నాను అని ఆశ్చర్యపోతున్నావా, నీకు నేను తప్ప చేసే వారు లేరు. నీ పిల్లలు రారు, నిన్ను కన్నవాళ్ళు ఇంక లేరు. నా గురించి చెడ్డగా చెప్పే మీ వాళ్ళు ఇప్పుడు నీదగ్గర లేరు. మంచి చెప్పడానికి నలుగురు నీ చుట్టూ ఉన్నా ఇక నీలో మార్పు రాదు అని అర్థమైపోయింది. అందుకే వెళ్లిపోతున్నా. ఇక ఇప్పుడు నా విలువ తెలిసినా నేను రాను”. కింద రవళి అని సంతకం ఉంది.
మొహం అంతా చెమటలు పట్టి గొంతు తడి ఆరిపోయింది రాజేశ్‌కి. సడన్‌ గా కళ్ళు తెరిచి చూశాడు. రవళి పక్కన లేదు. అంటే తన భార్య వెళ్ళిపోయింది!.. కాదు కాదు, లేచిపోయింది. జీవితంలో మొదటిసారి భార్య అంటే భయపడ్డాడు. మొదటిసారి రవళి భయాన్ని పరిచయం చేసింది. ఇన్నాళ్లూ ఆమె అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని ఆటబొమ్మగా మలిచాడు. ఇప్పుడు ఆమె తన మగతనాన్ని గేలి చేస్తూ వెళ్ళీపొయిందా. అలా హఠాత్తుగా లేచిపోవడం (?) మనసుని తొలిచేస్తుంటే అతనికి వళ్ళంతా చెమట్లు కమ్ముతున్నాయి. ఇదంతా కలే అయితే బాగుణ్ణు అని మనసులో అనుకున్నాడు. అలా కూలబడి పోయాడు.

అయితె ఆమె ఎక్కడికి వెళ్లి ఉంటుందీ? పుట్టింటికి వెళ్ళడానికి అక్కడ ఎవరూ లేరు. పిల్లల దగ్గరికి వెళ్లి ఉండదు. వెళ్తే వాళ్ళు తనకు చెప్తారనే భావన ఆమెలో ఉండి ఉంటుంది. కొంపదీసి మోహన్‌ దగ్గరికి గానీ, సురేశ్‌ దగ్గరికి గానీ,వెళ్లి ఉంటుందా?
పెళ్ళైన కొత్తలో ఇంటికొచ్చిన రవళి స్నేహితుడు మోహన్‌. కాలేజ్‌లో ఆమెతో క్లోజ్‌గా ఉండేవాడు అని మాటల్లో తెలిసింది. కొంపదీసి అతని దగ్గరికి వెళ్లిపోయిందా, ఏమో! ఈ అనుమానం అతన్నే పెనుభూతంగా భయపెట్టింది.
సురేశ్‌… రవళీ బావ. ఆమెని ఇష్టపడ్డాడని అప్పట్లో అంతా అనుకునేవారు. కానీ రవళి తనని ఇష్టపడి పెళ్ళి చేసుకోవడం వల్ల అతను పెళ్ళీ పెటాకులు లేకుండా ఫారిన్‌ లో ఉన్నట్లు మాత్రమే తెల్సు. కొంపదీసి తన కొంప కొల్లేరు చేయడానికి విదేశాల నుంచి వచ్చి తీసుకుపోయాడా!?

రవళి చెంప చెళ్లుమనిపించిన చేతులు వణికిపోతున్నాయి. భార్యని చూడగానే నిప్పు కణికళ్లా మారే రాజేశ్‌ కళ్ళు ఇప్పుడు నీటిపొరతో మసకబారుతున్నాయి. ఏం చెయ్యాలి? ఈ అనూహ్య సంఘటన పరువు ప్రతిష్ఠలను కూకటివేళ్లతో పెకిలించేసింది. తలపొగరు కరిగిపోయింది. ఆమె దగ్గరికి వెళ్ళి క్షమించమని అడగాలి. అలా చేస్తే ఆమె తిరిగి వస్తుందా?.. లేదు ఎలాగైనా తన కన్నీళ్ళతో ఆమె కాళ్ళని కడిగి తిరిగి తీసుకురావాలి అని బలంగా నిశ్వాసించి లేవబోయాడు. కానీ కళ్ళు తిరగడంతో కింద పడ్డాడు.
కళ్ళు తెరిచేసరికి అతను హాస్పిటల్‌ బెడ్‌ మీద ఉన్నాడు. జాయిన్‌ అయ్యి ఎన్నాళ్ళు అయ్యింది అని అనుకున్నాడు. ఇంతలో కొడుకు వచ్చాడు.
”నీకు హార్ట్‌ స్ట్రోక్‌ వచ్చింది. పక్కింటి అతను ఇక్కడ జాయిన్‌ చేసి మాకు ఫోన్‌ చేసాడు. అమ్మేది”?

అమ్మ..
మళ్ళీ కళ్ళు బైర్లు కమ్మినట్లు అయ్యింది.
ఆమె ఎక్కడుందో తెలిస్తే అతనికీ స్ట్రోక్‌ వచ్చేదే కాదు కదా!
ఏవైందండీ అంటూ భార్య పలకరింపుతో బాటు ఆత్మియస్పర్శ ఆతని భుజాన్ని తాకింది. తలతిప్పి చూస్తే రవళి. ఏవన్నా పీడకల వచ్చిందా అని అడిగింది. ఇంతకుముందులా ఆమెలో కోపం లేదు. ఆగ్రహం లేదు. లాలన ఉంది. అంతే…
రవళి ని దగ్గరకు తీసుకొని ‘సారీ’ అన్నాడు.
‘నాకు ఒక కల వచ్చింది’. గొంతు వణుకుతోంది. ‘అంటే పీడకల కాదు, పీడ వదిలించే కల’.

ఈసారి అతగాడి గొంతులో మార్దవం.
‘అర్ధం కాలేదు’ అంది రవళి నవ్వుతూ.
అతను నవ్వలేదు. కానీ ఆమె చెవి దగ్గర గుసగుసలాడేటట్లు..” పెళ్ళైన భార్యా భర్తలు ఎలా ఉండాలో చెప్పింది ” అన్నాడు.
‘అవునా ఈ కల మీకు పెళ్ళైన కొత్తలో వస్తె బాగుణ్ణు’… అనాలనుకుంది. పైకి అనలేదు.
‘ఓV్‌ా అవునా’ రాజేశ్‌ కౌగిలిలో ఒదిగిపోయింది.
ఒక్క క్షమా గుణం కాపురాన్ని గోపురంగా నిలబెడుతుంది.

తరిగొప్పుల విఎల్లెన్‌ మూర్తి,
8008 577 834

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -