Sunday, October 5, 2025
E-PAPER
Homeసోపతితెలంగాణలో రీడింగ్‌ క్యాంపెయిన్‌

తెలంగాణలో రీడింగ్‌ క్యాంపెయిన్‌

- Advertisement -

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల పఠనాసక్తి పెంపుకు, విజ్ఞానాన్ని అందించేందుకు ఒక ముఖ్యమైన అడుగు వేసింది అని చెప్పవచ్చు. విద్యా రంగంలో నూతన పంథాను అనుసరిస్తూ, పాఠశాలల్లో చదివే విద్యార్థుల అభ్యసన ఫలితాలను మెరుగుపరచడానికి అనేక సంస్కరణలు చేపడుతోంది. ఈ క్రమంలో ఒక కీలక ఉపక్రమణగా ‘రీడింగ్‌ క్యాంపెయిన్‌’ ప్రత్యేక ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ కార్యక్రమం ప్రధానంగా విద్యార్థులలో చదివే అలవాటు పెంపొందించడానికి, చదవడం పట్ల ఆసక్తి పెంచడానికి, చదవడానికి సమయం కేటాయించడానికి, వారు నేర్చుకున్న విషయాలను అర్థం చేసుకుని వాటిని జీవితంలో అన్వయించుకోవడానికి దోహదపడుతుంది.

రీడింగ్‌ క్యాంపెయిన్‌ కార్యక్రమం నిజంగా అవసరమా? అవసరమైతే ఏ స్థాయిలో? దాన్ని క్షేత్రస్థాయిలో ప్రజలలోకి ముఖ్యంగా విద్యార్థులు వారి తల్లిదండ్రుల వద్దకు ఏ విధంగా తీసుకెళ్లాలి?
ఇటీవలి కాలంలో మొబైల్‌ ఫోన్ల విస్తత వాడకం, సోషల్‌ మీడియా, ఇంటర్నెట్‌ వాడకం పబ్జి గేమ్లు, ఇన్‌స్టాగ్రామ్‌ స్నాప్‌ షాట్స్‌, షార్ట్స్‌ కారణంగా విద్యార్థులలో పుస్తక పఠన అలవాటు దాదాపు తగ్గిపోయింది. మేధావులు ఉపాధ్యాయులు, తల్లిదండ్రులందరూ ఈ పరిస్థితిపై ఆలోచించవలసిన అవసరం ఉన్నది. ఒకప్పుడు పుస్తకాలను చదవడం ఒక సంస్కతిలా ఉండేది. పుస్తకం హస్తభూషణంలా ఉన్న నాడు చిన్నారుల నుండి యువత వరకు చదవడమనే అలవాటు ఉండేది. కానీ ఇప్పుడు మొబైల్‌ ఫోన్‌ హస్తభూషణంలా తయారయింది. అది ‘బుక్‌ కల్చర్‌’ నుండి ”లుక్‌ కల్చర్‌”గా మారిపోయింది. ఫోన్‌ స్క్రీన్‌పై మాత్రమే సమయాన్ని వెచ్చిస్తూ, పుస్తకాల పట్ల ఆసక్తి కోల్పోతున్నారు. నిజంగా మొబైల్‌ ఫోన్‌ అవసరానికి వాడుకుంటే తప్పు లేదు కానీ చీటికీమాటికీ, అవసరం ఉన్నా లేకపోయినా, వ్యసనంలా మొబైల్‌ వాడకం తయారైంది.

ప్రత్యేకించి కరోనా కాలంలో, తదనంతర పరిస్థితులు ఆందోళనకరంగా తయారయ్యాయి. ఆ సమయంలో స్కూళ్లు మూతబడడంతో ఆన్లైన్‌ బోధన కొనసాగించారు. అందువల్ల విద్యార్థులు ఫోన్‌ వాడకానికి పూర్తిగా అలవాటు పడ్డారు. తర్వాత పాఠశాలలు ప్రారంభమైనా, ఫోన్‌ వాడకాన్ని మానేయలేదు. పైగా మొబైల్‌ ఫోన్లో వచ్చేటువంటి కంటెంట్‌ హద్దు అదుపులో లేకుండా పోర్న్‌ వెబ్సైట్లు, హింసకు దారి తీసే ఓటీటిలు విద్యార్థుల మానసిక స్థితిపై ప్రభావం చూపి వారిని మొబైల్‌, సోషల్‌ మీడియా, పబ్జి గేమ్‌ల బానిసలుగా తయారు చేస్తున్నాయి. దీనికి కారణం విద్యార్థుల తల్లిదండ్రులు, గురువులు కూడా. ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు పిల్లల ముందు ఫోన్‌ వాడకాన్ని తగ్గించాలి. సోషల్‌ మీడియాకు దూరంగా ఉండాలి. అవసరమైతే తల్లిదండ్రులు కూడా వారి ముందు పుస్తకాలు పట్టుకుని చదువుకునే ప్రయత్నం చేయాలి.

పెద్దవాళ్లు పిల్లల ముందు ఫోన్లలో సోషల్‌ మీడియా ఎక్కువగా వాడుతుండడంతో, దీని ప్రభావంగా చదివే పుస్తకాలు, బోధన పట్ల దష్టి చాలా వరకు తగ్గిపోతోంది. ఈ పరిస్థితిని ఎదుర్కోడానికి, పఠన శక్తిని తిరిగి విద్యార్థులలో నాటి స్థాయికి తీసుకురావడానికి ‘రీడింగ్‌ క్యాంపెయిన్‌’ కీలకంగా మారుతుందని చెప్పవచ్చు. రాష్ట్ర ప్రభుత్వ ప్రణాళికలు, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర విద్యా శాఖ, తెలంగాణ రాష్ట్ర విద్యా పరిశోధన శిక్షణ సంస్థ (SCERT) సంయుక్త ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం కొనసాగుతోంది. ఆగస్టు 20 నుండి జాతీయ అక్షరాస్యత దినోత్సవమైన సెప్టెంబర్‌ 8 వరకు ప్రభుత్వం నిర్వహించిన ఈ కార్యక్రమంలో అన్ని ప్రభుత్వ, పంచాయతీ రాజ్‌ పాఠశాలల్లో విద్యార్థులకు చదువు పట్ల ఆసక్తిని కలిగించేలా ప్రత్యేక చర్యలు చేపడుతున్నారు. ఈ రీడింగ్‌ క్యాంపెయిన్‌లో ఉపాధ్యాయులు కీలక భూమిక పోషించి, విద్యార్థులలో పాఠశాల స్థాయి నుంచే చదవడం పట్ల ఆసక్తి పెంచడానికి కషి చేస్తున్నారు. విద్యార్థులలో పఠనాసక్తి పెంచడానికి ముందుగా ఉపాధ్యాయులు ప్రత్యేక శిక్షణ పొందాలి.

ఈ లక్ష్యంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎస్‌ ఈ ఆర్‌ టి డ ఎన్‌ సి ఈ ఆర్‌ టి వారి సహాయ సహకారాలతో వేసవి సెలవుల్లో కానీ దసరా సెలవుల్లో కానీ ఉపాధ్యాయులకు ప్రత్యేక శిక్షణ తరగతులు నిర్వహించాలి. ఈ విషయంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గత వేసవి కాలంలో ఉపాధ్యాయులకు శిక్షణ ఇచ్చింది. ఈ శిక్షణలో ఉపాధ్యాయులు విద్యార్థులను ఎలా ప్రోత్సహించాలి, ఎవరి స్థాయిలో వారికి పఠన అలవాటు కలిగించాలి, ఉన్నత తరగతుల వారికి ఎలా క్లిష్టమైన పాఠ్యాంశాలను అర్థమయ్యేలా చేయాలి వంటి మాడ్యూళ్లను బోధించారు. అదేవిధంగా తరగతిని బట్టి, వారి సామర్థ్యాన్ని బట్టి, వారికి నచ్చిన పాఠ్యాంశం గాని, కథను కానీ, పద్యాన్ని కానీ, కవితను గాని, సాహిత్యాన్ని గాని చదివించే ప్రయత్నం చేయాలి. ఉపాధ్యాయులు ఈ అవగాహనతో తరగతులను నిర్వహించడం వల్ల విద్యార్థుల అభ్యసన ఫలితాలు మరింత మెరుగుపడతాయి. అదేవిధంగా విద్యార్థుల్లో ఉండే సజన కూడా బయటకు వచ్చే అవకాశం ఉన్నది. నాణ్యమైన ఆలోచనల వైపు, నాణ్యమైన నిర్ణయాల వైపు, నాణ్యమైన గమ్యాల వైపు అడుగులు వేసేందుకు ఆస్కారం ఉంటుంది.

రీడింగ్‌ క్యాంపెయిన్‌ ప్రధాన ఉద్దేశాలు: విద్యార్థులు చదవడం నేర్చుకోవాలి. ప్రతి విద్యార్థికీ పుస్తకం చదవడం తప్పనిసరి పాఠ్య నైపుణ్యంగా మారాలి. చదివింది అర్థం చేసుకోవాలి. పఠనం అనేది కేవలం అక్షరాలు పలకడమే కాదు, దాని భావాన్ని గ్రహించగలిగి, ఆకళింపు చేసుకోవడం కూడా ముఖ్యమే. అర్థమయిన విషయాలను వ్యక్తీకరించాలి. అంటే విద్యార్థి తన భావాన్ని, ఆలోచనను మాట్లాడటం లేదా రాయడం ద్వారా వ్యక్తపరచగలగాలి. చదివిన విషయాన్ని జీవితంలో అన్వయించుకోవాలి. పాఠశాలలో నేర్చుకున్నది, ఆ పరిజ్ఞానం తన వ్యక్తిగత జీవితంలో, సమాజానికి ఉపయోగపడే విధంగా ఉండాలి.

పాఠశాల గ్రంథాలయాల ప్రాధాన్యత : రీడింగ్‌ క్యాంపెయిన్‌ విజయానికి పాఠశాల లైబ్రరీలు కీలక ఆధారం. ప్రతి ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలల్లో నూతన నేషనల్‌ ఎడ్యుకేషన్‌ పాలసీ ప్రకారం గ్రంథాలయం అవసరం. అయితే జాతీయ సాక్షరతా మిషన్‌ అందుకు గాను ప్రాథమిక, ప్రాథమికోన్నత, మాధ్యమిక పాఠశాలలకు గ్రంథాలయాలు ఏర్పాటు చేసుకోవడానికి ఆర్థిక సహాయ సహకారాలు అందిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం కూడా గ్రంథాలయాలకు నామినల్‌ మొత్తాన్ని పాఠశాలలకు ఇస్తుంది. కానీ ఆ పాఠశాలలో గ్రంథాలయాలు ఉన్న దాఖలాలు బహు అరుదు. ఒకవేళ ఉన్నా పాఠశాల సమయ పట్టికలో గ్రంథాలయ గంట ఏర్పాట్లు లేవు. ఖాళీ సమయంలో గ్రంథాలయానికి వెళదామన్నా విద్యార్థికి కావలసిన, నచ్చిన పుస్తకాలు తక్కువ. పాఠశాల గ్రంథాలయం అంటే పాఠ్యపుస్తకాలతో నిండి ఉండడమే అనే భావన తప్పు. పాఠ్యపుస్తకాలతో పాటు కథలు, నవలలు, నాటకాలు, పద్యాలు, గేయాలు, నిఘంటువులు లాంటి విభిన్న పుస్తకాలతో గ్రంథాలయాలు ఉండాలి. అది కూడా విద్యార్థి స్టాండర్డ్‌ను ఆధారంగా చేసుకుని పుస్తకాలు ఏర్పాటు చేయాలి (బొమ్మల పుస్తకాలు, కథల పుస్తకాలు, చందమామ, బాలమిత్ర, విక్రమార్క విజయం మొదలగు).

ఇవి విద్యార్థులలో విస్తతమైన పఠన అభిరుచిని కలిగిస్తాయి. పాఠశాల స్థాయిలోనే పిల్లలు వేర్వేరు పుస్తకాలను చదవడం అలవాటు చేసుకుంటే, భవిష్యత్తులో వారి ఉన్నత విద్యకు, పోటీ పరీక్షలకు ఎంతో దోహదం చేస్తుంది. పోటీ పరీక్షల మీద అవగాహనను, అదేవిధంగా ఓటమి పొందిన, గెలుపొందిన అభ్యర్థుల జీవిత చరిత్రను చదివేట్టు ప్రేరేపించాలి. సమాజంపై ప్రభావం చూపిన గొప్ప వ్యక్తుల జీవిత చరిత్రలు చదివేలా ప్రోత్సహించాలి. చిన్న పుస్తకాల్లోనైనా, కథాంశాల్లోనైనా ఏదో ఒక విజ్ఞానం పొందితే అదీ ఒక రకమైన అభ్యసనం అవుతుంది. ఈ రీడింగ్‌ క్యాంపెయిన్‌ వల్ల మధ్యతరగతి, బడుగు, బలహీన వర్గాల విద్యార్థులకు, మైనారిటీ విద్యార్థులకు ఎంతో ఉపయోగకరం. వీళ్ళకు పెద్ద ఎత్తున కోచింగ్‌ సెంటర్లు, ఖరీదైన మెటీరియల్‌ సాధ్యం కాని సందర్భంలో, పాఠశాల స్థాయిలోనే మంచి గ్రంథాలయం ద్వారా వారు సన్నద్ధం కావచ్చు. అదేవిధంగా అలాంటి పుస్తక వనరులు కూడా విద్యార్థులకు అందుబాటులో ఉంచే ప్రయత్నం ఉపాధ్యాయులు ప్రభుత్వం చేయాలి. ఇది వారి భవిష్యత్తును నిలబెట్టేలా సహకరిస్తుంది.

తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల బాధ్యత: ఈ కార్యక్రమాన్ని చూసి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు వీలైనంత సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఇది కేవలం పాఠశాల విద్యతో ముగిసేది కాదు. విద్యార్థుల వ్యక్తిత్వ వికాసానికి, వారి లక్ష్య సాధనకు, ఉన్నత జీవనానికి దోహదపడుతుంది. ఇందులో తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు విద్యార్థుల దృష్టిని పఠనం వైపు, పఠన అభిరుచివైపు మళ్లించే ప్రయత్నం చేయాలి. సమయం దొరికితే విద్యార్థులను, వారి పిల్లలను బుక్‌ ఎగ్జిబిషన్‌, పుస్తక పరిచయ కార్యక్రమాలు, పుస్తక రచయితతో సంభాషణలు వారి అనుభవాలు విద్యార్థులకు వివరించే ప్రయత్నం చేయాలి. పట్టణ, మండల కూడలిలో సంచార పుస్తకాలు అందుబాటులో ఉన్నప్పుడు తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు విద్యార్థులను ఆ ప్రాంతానికి తీసుకెళ్లి పుస్తక సంపదను పరిచయం చేయాలి.

అవసరమైతే విద్యాశాఖ తరఫున విద్యార్థులకు నిజంగా ఏవి తొందరగా అర్థమవుతాయి, ఏ పుస్తకాలు వారి దష్టిని ఆకర్షిస్తాయి లాంటి విషయాలు తెలుసుకుని, వాటిని ప్రతి శనివారం సాయంత్రం మండల కూడలిలలో లేదా పట్టణ కూడలిలో ప్రభుత్వ సంచార పుస్తకాలను ఏర్పాటు చేయవలసిన అవసరం ఉన్నది. అవసరమైతే ఆ ప్రాంతంలో ఉన్న పౌర గ్రంథాలయాలతోటి ఒప్పందం కుదుర్చుకొని వారానికి ఒకసారి, పక్షానికి ఒకసారి, నెల రోజులకు ఒకసారి అయినా గ్రంథాలయానికి తీసుకెళ్లి వివిధ వివిధ పుస్తకాలను, దినపత్రికలను మాస పత్రికలను పరిచయం చేయవలసిన అవసరం ఉన్నది. రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల మేలు కోసం చేపట్టిన ఈ ప్రయత్నాన్ని అందరూ అభినందించాల్సిందే.

డిజిటల్‌ యుగంలో పుస్తకాల ప్రాముఖ్యత: ఈ రోజుల్లో సాంకేతికత ఎంతగా పెరిగినా, పుస్తకాల ప్రాముఖ్యత ఎప్పటికీ తగ్గదు. పుస్తకం జీవనది. పుస్తకం సమస్త బుద్ధి జీవులకు మస్తకం లాంటిది. ఒక పుస్తకం మనసుకు ఆలోచనల దారిని చూపుతుంది. ఒక పేజీ మన జీవితాన్ని మారుస్తుంది. ఈ భావనను తిరిగి విద్యార్థులు ఆకళింపు చేసుకునేందుకు రీడింగ్‌ క్యాంపెయిన్‌ ఒక కొత్త దిశ చూపుతోంది. మొబైల్‌ ఫోన్‌ ద్వారా సులభమైన వినోదం లభించినా, పుస్తకం ఇచ్చే అనుభవం, ఊహాశక్తి, జ్ఞానం ఎన్నటికీ దానిని భర్తీ చేయలేవు. మొబైల్‌ ఫోన్‌, డిజిటల్‌ వనరులు, అంతర్జాల సౌకర్య పుస్తకాలు, ఎలక్ట్రానిక్‌ పుస్తకాలు పుస్తకానికి ఎప్పుడు కూడా సమానం కాదు. ఆల్టర్నేట్‌ మాత్రమే.

అయితే ప్రభుత్వం ప్రతి ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలో రీడింగ్‌ క్యాంపెయిన్‌ ను నిర్వహించాల్సిన అవసరం ఉన్నది. ప్రతి ప్రభుత్వ పాఠశాలలో ప్రైవేటు పాఠశాలలో గ్రంథాలయం కచ్చితంగా ఉండి తీరాల్సిందే, పాఠశాల సమయ పట్టికలో గ్రంథాలయ గంట ఉండాల్సిన అవసరం ఉన్నది. విద్యార్థులకు అభిరుచి కనుగుణంగా పుస్తక వనరులు సమీకరించవలసిన అవసరం ఉన్నది అందుకు తగిన ఆర్థిక వనరులు ప్రభుత్వం విద్యాశాఖ ద్వారా సమకూర్చవలసిన అవసరం ఉన్నది. అన్నిటికంటే ముఖ్యంగా ఈ విజ్ఞాన భాండాగారాన్ని విద్యార్థులకు ఉపాధ్యాయులకు నైపుణ్యంగా అందించే గ్రంథ పాలకుడు ఉండకుండా నైపుణ్యమైన సమాచారాన్ని, నైపుణ్యమైన జ్ఞానాన్ని విద్యార్థులకు, ఉపాధ్యాయులకు అందించడంలో విఫలమవుతాము.

డా|| రవికుమార్‌ చేగొని, 9866928327

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -