ఒక చిన్న పల్లెటూరులో అచ్చమ్మ అనే మహిళ నివసించేది. ఆమెకు ఒక పెంపుడు కోడి, ఒక కుంపటి ఉన్నాయి. రోజూ తెల్లవారుజామున అచ్చమ్మ కోడి కూయగానే వీధిలో అందరూ మేల్కొనేవారు. ఆమె ఇంటికి వచ్చి ఆ కుంపటి నుండి నిప్పు తీసుకుని వంట చేసుకునేవారు. ఆ తరువాత ఎవరి పనులకు వారు వేళ్ళే వారు. ఈ విధంగా గ్రామంలోని ప్రజలందరికీ అచ్చమ్మ కోడి, కుంపటి చాలా ఉపయోగపడేవి.
ఒక రోజు అచ్చమ్మకు ఒక దుర్మార్గమైన ఆలోచన వచ్చింది.
”నా కోడి కూయకపోతే వీళ్లెవ్వరికీ తెల్లారదు, నా కుంపటి నిప్పు లేకపోతే వీళ్లెవ్వరూ వంట చేసుకోలేరు. నా వల్లే వీరందరూ బ్రతుకుతున్నారు. వీళ్లందరికీ రోజూ సాయం చేస్తున్నా, నాకేం ఉపయోగం లేదు. నా కోడి, కుంపటి లేకపోతే వీళ్లందరూ ఏం చేస్తారో చూస్తాను,” అనుకుంది.
ఆ క్షణం స్వార్థం ఆమె కళ్ళను కప్పేసింది. ఆ రోజు సాయంత్రం, ఆమె తన కోడిని కోసి కూర వండుకుని తినేసింది. వంట పూర్తవగానే కుంపటిలోని నిప్పును ఆర్పేసి పడుకుంది.
మరుసటి రోజు ఉదయం కోడి కూత వినపడలేదు. గ్రామస్తులందరూ ఆశ్చర్యపోయారు. ఆలస్యం అవుతుందని తొందరగా పనులు పూర్తి చేసుకుని నిప్పు కోసం అచ్చమ్మ ఇంటికి వచ్చారు. అచ్చమ్మ ఇంకా నిద్రపోతూనే ఉంది. ”ఆమెకు ఆరోగ్యం బాగా లేనట్లుంది,” అనుకుని ఎవరి ఇళ్లకు వారు వెళ్లిపోయారు. అప్పుడు వారికి ఒక ఆలోచన వచ్చింది.
”అచ్చమ్మ నిప్పు ఇవ్వకపోతే మనం వంట చేసుకోలేమా? మనం సొంతంగా నిప్పు పుట్టించుకుందాం” అనుకుని రెండు రాళ్లను తీసుకుని వాటి మధ్య దూది పెట్టి కొట్టారు. వెంటనే నిప్పు వచ్చింది. ఆ నిప్పుతో కుంపటి వెలిగించుకుని వంట చేసుకుని అందరూ వారి వారి పనులకు వెళ్లిపోయారు.
బారెడు పొద్దెక్కిన తరువాత అచ్చమ్మకు మెలకువ వచ్చింది. వీధిలో ఎక్కడా శబ్దం లేదు. అందరి ఇళ్లల్లోనూ కుంపటి నుండి పొగలు రావడం చూసి ఆశ్చర్యపోయింది.
”నా కోడి కూయకపోయినా వీళ్లందరికీ ఎలా తెల్లారింది? నా కుంపటి లేకపోయినా వీళ్లంతా ఎలా వంట చేసుకున్నారు?” అనుకుంటూ బయటకు వచ్చింది. దారిలో మల్లయ్య అనే వ్యక్తి కనిపించాడు.
మల్లయ్య అచ్చమ్మను చూసి, ”అచ్చమ్మా, నీ అమాయకత్వానికి నేను చాలాసార్లు నవ్వుకున్నాను. నీ కోడి కూయకపోతే తెల్లవారదనుకోవడం, నీ కుంపటి లేకపోతే వంట చేసుకోలేరనుకోవడం కేవలం నీ అపోహ. నీ కోడి కూయక మేల్కోనిది నువ్వు మాత్రమే. నీ కుంపటి వెలగక వంట చేసుకోనిది కూడా నువ్వే. మనం ఉన్నా లేకున్నా ఈ ప్రపంచం దాని పని అది చేసుకుంటూనే ఉంటుంది. ఎవరి సాయం కోసం అది ఆగదు. ఒక దారి మూసుకుంటే మరో దారి వెతుక్కుంటుంది,” అని చెప్పాడు.
మల్లయ్య మాటలతో అచ్చమ్మ తన తప్పు తెలుసుకుంది. తన స్వార్థానికి సిగ్గుపడింది. ఆ రోజు నుండి ఆమె తిరిగి ఇతరులకు సాయం చేయడం మొదలుపెట్టింది. అప్పటినుండే ”నా కోడి, కుంపటి లేకపోతే ఊరికి తెల్లారదన్నట్లు” అనే సామెతను ప్రజలందరూ ఉపయోగించడం మొదలుపెట్టారు.
- డా.పోతగాని సత్యనారాయణ, 9182531202