మనకు వినోదాన్నిచ్చేది సినిమా. మనల్ని మురిపించేది సినిమా. మనం టైం పాస్ కోసమో, వినోదం కోసమో సినిమా చూస్తుంటాం. ఆనందిస్తుంటాం. కేరింతలు కొడుతుంటాం. కాని మనల్ని మెప్పించేలా ఆ సినిమాని రూపొందించిన ఘనత మాత్రం దర్శకునిదే. ఒక్కో సినిమాను తీర్చిదిద్దడం కోసం ఎన్నో కష్టాలు పడుతుంటారు దర్శకులు. రాత్రి పగలు తేడా లేకుండా శ్రమిస్తుంటారు. అలాంటి సినీదర్శకుల కృషిని, శ్రమని చాటి చెప్పే పాటను రాంబాబు గోసాల రాశాడు. 2024 లో కుమార్ స్వామి దర్శకత్వంలో వచ్చిన ‘సినిమా పిచ్చోడు’ సినిమాలోని ఆ పాటనిపుడు చూద్దాం.
రాంబాబు గోసాల తన పాటల ప్రవాహంతో తెలుగు సినీరంగంలో ఓ కొత్త ట్రెండ్ చేస్తున్నాడు. ఇప్పటికే ఆయన రాసిన ఎన్నో పాటలు చాలామందిని అలరించి ప్రత్యేకమైన ప్రశంసలను అందుకున్నాయి.
ఈ పాటలో సినీదర్శకుల కృషిని చాటి చెప్పాడు రాంబాబు. ఒక్కో సినిమాను రూపొందించడానికి నరకయాతన పడుతుంటాడు డైరెక్టర్. తీసిన షాట్ నే మళ్ళీ మళ్ళీ తీసి తనకు సంతృప్తిగా అనిపించినా, ప్రేక్షకులను మెప్పించగలనో లేదో అనుకుంటూ, మధనపడి… శిల్పంలా తీర్చిదిద్దుతాడు సినిమాని. తల్లి బిడ్డని కనడానికి ప్రసవవేదనను అనుభవించినట్టు ఓ డైరెక్టర్ సినిమాని రూపొందించడానికి అంతటి వేదనను అనుభవిస్తాడు.
ఎంత పెద్ద కథానాయకులకైనా వేషం ఎలా వేయాలో, సన్నివేశానికి తగినట్టుగా డైలాగ్ ఎలా చెప్పాలో ఆ నైపుణ్యం దర్శకునికే తెలుసు. అతడే హీరోని దగ్గర కూర్చోబెట్టుకుని నేర్పిస్తాడు. అతడు ఎంత పెద్ద హీరో అయినా డైరెక్టర్ ముందు చేతులు కట్టుకుని వినాల్సిందే. శ్రద్ధగా సన్నివేశాన్ని, డైలాగ్‌ని అవగాహన చేసుకోవాల్సిందే. అలాంటి గొప్ప నైపుణ్యత దర్శకునిది. మట్టిముద్దలను కూడా మాణిక్యాలుగా తీర్చిదిద్దే కళాప్రతిభ దర్శకునిది. సినీరంగంలో హీరోగా, హీరోయిన్‌గా నటించాలని తపన ఉన్న వాళ్ళని చేరదీసి, ఆడిషన్స్ చేయించి, వాళ్ళను సెలెక్ట్ చేసి, ఏమీ తెలియని అమాయకులకు కూడా సినీరంగం అంటే ఏమిటో చెప్పి, సినిమాలో ఎలా నటించాలో వివరించి, పల్లెల నుంచి వచ్చిన వాళ్ళను మాణిక్యాలుగా, ఆణిముత్యాలుగా తీర్చిదిద్దే ఘనత దర్శకునిదే.
ఎన్నెన్నో కథల్ని అల్లి, పాత్రల్ని సృష్టించి, వెండితెరపై ఎన్నెన్నో అద్భుతమైన విన్యాసాలు చేయించి, జనమంతా మెచ్చే విధంగా, జగమంతటికి నచ్చే విధంగా సినిమాలను రూపొందించేది దర్శకుడే. మనకు కన్నులవిందు కలిగించి, ఎన్నెన్నో అద్భుతాలకు చిరునామాగా నిలిచి, కొత్త కొత్త విషయాలను తన సినిమా ద్వారా తెలియజేసి, అజ్ఞాతంగా ఉన్న ఎన్నో విషయాలను, కథలను, మహనీయులను సినిమా ద్వారా సమస్త లోకానికి పరిచయం చేసి, చరిత్రపుటల్లో బంగారు అక్షరాలతో వెలిగే కాంతిపుంజం దర్శకుడే. ముమ్మాటికీ దర్శకుడే.
దర్శకుడు లేనిదే సినిమాలో ఏ కళాకారుడు లేడు. అతన్ని నమ్ముకునే చాలామంది కళాకారులు పని చేస్తుంటారు. బతుకుతుంటారు.
మన ఎదలో అణచిన ఆశను, మనతోనే పెరిగిన ప్రతిభను, మనలో దాగిన నటనను, కళాప్రతిభను గుర్తించి లోకానికి పరిచయం చేసేవాడు దర్శకుడు. మన కళను, మన ప్రతిభను చులకన చేసిన వారి చేతనే మనల్ని శభాష్ అనిపించేలా మనల్ని తీర్చిదిద్దగలిగే ఘనత దర్శకునిదే. సినిమా విజయం సాధిస్తే ప్రశంసలందుకుంటాడు దర్శకుడు. సినిమా పరాజయం పాలైతే నష్టాలపాలవుతాడు. విమర్శలు, ప్రశ్నల బాణాలు ఎదురుగా వచ్చినా వాటికి సమాధానాలనే ప్రత్యస్త్రాలను సంధిస్తాడు. తన కుటుంబాన్ని కూడా లెక్క చేయకుండా ప్రపంచమే తన కుటుంబంగా, సినిమానే తన జీవితంగా భావించి కష్టపడతాడు.
నవరసాలను తన ప్రతిభలో పొదుగుకున్నవాడు దర్శకుడంటే. విభిన్నమైన కళలను ఆదరించేవాడు. వెండితెరపై వెలిగించేవాడు. అద్భుతమైన సంగీతం, సాహిత్యం తోడుగా ఉండగా సన్నివేశాల్ని పరమాద్భుతంగా చిత్రించి, జనరంజకంగా మలచి అందించగలవాడు దర్శకుడంటే.
సినిమా ద్వారా మనిషికి ఊరటనిస్తాడు. అమ్మలా ఓదారుస్తాడు. సందేశాన్నిస్తాడు. జీవితమంటే ఏమిటో తెలియజేస్తాడు. సృష్టికి ప్రతిసృష్టి చేస్తాడు. అసాధ్యాలన్నీ సుసాధ్యం చేస్తాడు.
అనుభూతులను పంచుతాడు. చరిత్రలను మన కళ్ళకు చూపించి మనచే ఔరా! అనిపిస్తాడు. భవిష్యత్‌కు బంగారు బాటగా తానే మారుతాడు. బంధాల విలువలు మరిచిన వాళ్ళకి తన సినిమాకథల ద్వారా బంధాల విలువల్ని, అర్థాల్ని, పరమార్థాల్ని వివరిస్తాడు. ఓ గురువులా జీవితాన్ని బోధిస్తాడు. కాలాన్నే గెలిచి సరికొత్త అధ్యాయాన్ని, శకాన్ని సృష్టిస్తాడు దర్శకుడు.
మన తెలుగు సినిమా చరిత్రలో వెలుగు వెలిగిన మహా మహా దర్శకులైన దాసరి నారాయణరావు, కె.రాఘవేంద్రరావు, కె.విశ్వనాథ్, బాపు, కమలాకర కామేశ్వరరావు, కోడి రామకృష్ణ.. ఇలా నేటి సినీ పరిశ్రమలో శిఖరస్థాయిలో ఉన్న ఎస్.ఎస్.రాజమౌళి, సుకుమార్, శేఖర్ కమ్ముల..మొదలైన వారంతా కూడా ఎంతో కష్టపడి పైకి వచ్చిన దర్శకులే. వీరే కాక ఎందరో.. ఇంకెందరో సినీకళామతల్లికి తమ కళతో అభిషేకం చేసిన, చేస్తున్న దర్శకులున్నారు. అలాంటి సినీదర్శకులందరికి తన పాటతో అక్షరహారతి పట్టాడు రాంబాబు గోసాల. ఇలాంటి పాటను సినిమాల్లో పెట్టినందుకు ఈ సినిమా దర్శకుడైన కుమార్ స్వామిని అభినందించాలి.
పాట:
కథానాయకుడికే వేషభాషలను నేర్పే నైపుణ్యం దర్శకత్వమే/మట్టిముద్దలనే మాణిక్యాలుగా మార్చే కౌశల్యం దర్శకత్వమే/ఎన్నో ఎన్నెన్నో పాత్రలనే సష్టించేసి వెండితెరపై విన్యాసాలను చేయించి/జనరంజకంగ జగం మెచ్చే చిత్రాలను అందించి/మన కనులవిందుగా మైమరపించే అద్భుతాలు పోగేసి/చరిత్రపుటలో స్వర్ణాక్షరమై వెలిగే ప్రకాశమే దర్శకత్వమే దర్శకత్వమే/నీ ఎదలో అణచిన ఆశను నీతోనే పెరిగిన ప్రతిభను/నీలోనే దాగిన నటనను బయటకు తెచ్చేదే/నవ్వించే హాస్యపు జల్లును అలరించే విభిన్న కళలను/కదిలించే కవితల హౌరును జగతికి తెలిపేదే/మనిషికిలా ఊరటనిస్తూ మనసులనే రంజింపజేస్తూ/సష్టికిలా ప్రతిసష్టిని చేస్తూ అనుభూతిని పంచే/చరితలనే కనులకు చూపుతూ భవితకిదే బాటగ మారుతూ/బంధముకే అర్థం తెలుపుతూ కాలాన్నే గెలిచే..
డా||తిరునగరి శరత్‌చంద్ర,
sharathchandra.poet@yahoo.com
సినీ గేయరచయిత, 6309873682