Sunday, October 5, 2025
E-PAPER
Homeజోష్క్రికెట్ వర్మ

క్రికెట్ వర్మ

- Advertisement -

ఎంతో మంది హేమాహేమీలున్న భారత్‌ క్రికెట్‌ జట్టులో చోటు సంపాదించడం చాలా కష్టం. అదీ మిడిలార్డర్‌లో విరాట్‌ కోహ్లీ, సూర్య కుమార్‌ యాదవ్‌, శ్రేయస్‌ అయ్యర్‌, కేఎల్‌ రాహుల్‌ వంటి అగ్రశ్రేణి బ్యాటర్లతో విపరీతమైన పోటీ ఉంటుంది. ఇలాంటి మిడిలార్డర్‌లో నిలదొక్కుకొని రాణించాలంటే ఎంతో నైపుణ్యంతో పాటు పరిణితి ఉండాలి. ఐపీఎల్‌లో ముంబయి తరఫున మెరుపులతో 20 ఏండ్ల వయసులోనే భారత టీ20 జట్టులో చోటు దక్కించుకున్న అతడు.. ఆరంభం నుంచి నిలకడగా ఆడుతున్నాడు. నిరుడు దక్షిణాఫ్రికా పర్యటనలో వరుసగా రెండు శతకాలతో సంచలనం రేపాడీ తెలుగు కుర్రాడు. ప్రస్తుత ఆసియా కప్‌లోనూ అతను నిలకడగా రాణించాడు అతడే నంబూరి ఠాకూర్‌ తిలక్‌ వర్మ.

హైదరాబాద్‌ కు చెందిన నంబూరి నాగరాజు, గాయిత్రి దేవి దంపతులకు 2002 నవంబర్‌ 8న జన్మించాడు తిలక్‌ వర్మ. వీరిది రెక్కాడితే కానీ డొక్క ఆడని నిరుపేద కుటుంబం. తండ్రి ఎలక్ట్రీషియన్‌, తల్లి గహిణి. తిలక్‌ 11 ఏండ్ల వయసులో బర్కాస్‌ గ్రౌండ్‌ లో టెన్సిస్‌ బంతిలో కిక్రెట్‌ ఆడుతున్నాడు. దూరంగా అతని ఆట తీరును గమనించాడు బయాష్‌ అనే కోచ్‌. దగ్గరకు వచ్చి ‘నువ్వు ఏ అకాడెమీ స్టూడెంట్‌వి’ అని అడిగాడు. దానికి తిలక్‌ వర్మ ‘నేను ఎక్కడా నేర్చుకోవడం లేదు సార్‌, రోజూ ఇదే గ్రౌండ్‌ లో ఆడతుంటాను అంతే అని బదులిచ్చాడు. దానితో అతడు చాలా సంబరపడిపోయి అయితే నేను నీకు కిక్రెట్‌ నేర్పుతాను నేర్చుకుంటావా? అని అడిగాడు. తనకు కిక్రెట్‌ అంటే ఇష్టం. ఇష్టమైన ఆటను ఎవరైనా నేర్పిస్తాను అంటే వద్దంటారా? కానీ, తిలక్‌ మా నాన్నను అడగాలి అని చెప్పాడు. దీంతో బయాష్‌ తిలక్‌ తండ్రికి ఫోన్‌ చేసి విషయం చెప్పాడు. కానీ, అతడి పేదరికం కొడుకు ఆశలకు సంకెళ్లు వేసింది. అదే విషయం బయాష్‌ కు చెప్పాడు.

బయాష్‌ ముందుచూపు
తిలక్‌ వర్మ చిన్నప్పుడు ఆర్థికంగా చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. తండ్రి వద్ద ప్రయివేట్‌ కోచింగ్‌ కి పంపేందుకు సరైన వనరులు లేనప్పుడు వర్మని అతని కోచ్‌ సలాం బయాష్‌ ఆదుకున్నాడు. అతనికి ఫీజులు, క్రీడా సామాగ్రి అందించి వర్మ క్రికెట్‌కు దూరమవ్వకుండా చూసుకున్నాడు. రోజూ ఆయనే తిలక్‌ ఇంటికి వచ్చి తన బండి ఎక్కించుకొని మరి ప్రాక్టీస్‌కు తీసుకువెళ్లెవాడు. ఆ అకాడెమీ లింగంపల్లిలో ఉంది. బయాష్‌ ముందుచూపు ఇప్పుడు సత్ఫలితాలిస్తోంది. వర్మ 2018-19లో రంజీట్రోఫీలో హైదరాబాద్‌ తరపున ఫస్ట్‌ క్లాస్‌ అరంగేట్రం చేశాడు. ఒక సంవత్సరం తర్వాత దక్షిణాఫ్రికాలో జరిగే 2020 అండర్‌-19 ప్రపంచ కప్‌కు ఎంపికయ్యాడు. ఆ టోర్నీలో అతను ఆరు మ్యాచ్‌లు ఆడి మూడు ఇన్నింగ్స్‌లలో 86 పరుగులు చేసి, భారత్‌ ఫైనల్‌కు చేరుకునేందుకు దోహదపడ్డాడు. 2022 నాటికి లిస్ట్‌ ఏలో 16 మ్యాచ్లు ఆడి 784 పరుగులు చేశాడు.

తిలక్‌ వర్మకు 19 ఏండ్లు వయసులో ఉన్నప్పుడే భారత్‌ కెప్టెన్‌ రోహిత్‌ శర్మ అతని ఆటని పరిశీలించి త్వరలోనే భారత్‌ జట్టులో అన్ని ఫార్మాట్లలో రాణించగల సత్తా ఉన్న బ్యాటర్‌ అని అంచనా వేసాడు. అదే ఇప్పుడు నిజమవుతోంది. తిలక్‌ టెక్నిక్‌, ఆటతీరు, అతని షాట్‌ మేకింగ్‌ సామర్థ్యం గురుంచి రోహిత్‌ ముందే ఊహించి చెప్పడం గమనార్హం. పరిస్థితుల తగిన విధంగా తన ఆటతీరును ఎప్పటికప్పుడు మార్చుకుంటూ జట్టుని ఆదుకోవాలి. ఇలాంటి లక్షణాలు పుష్కలంగా ఉన్న బ్యాటన్‌ హైదరాబాద్‌కు చెందిన 22 ఏండ్లు తిలక్‌ వర్మ. అనతి కాలంలోనే జట్టులో నిలకడ గల బ్యాటర్‌గా తిలక్‌ వర్మ పేరు గడిస్తున్నాడు.

ఐపీఎల్‌ అనుభవం
ఆలా తన నైపుణ్యాన్ని నిరూపించుకున్న వర్మ ఐపీఎల్‌ లో ముంబై ఇండియన్స్‌ వంటి ప్రముఖ జట్టుకి ఎంపిక కావడం బాగా కలిసి వచ్చింది. శనివారం చెన్నైలో ఇంగ్లాండ్‌తో జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో తిలక్‌ వర్మ తన మ్యాచ్‌ విన్నింగ్‌ స్కోర్‌ తో చరిత్ర సష్టించాడు. తిలక్‌ కేవలం 55 బంతుల్లో నాలుగు ఫోర్లు, ఐదు సిక్సర్లతో 72 పరుగులు చేసి అజేయంగా నిలిచి తన జట్టును విజయపథంలో నడిపించాడు. ఈ ఇన్నింగ్స్‌తో, తిలక్‌ టీ20ల్లో అవుట్‌ కాకుండా 300 పైగా పరుగులు చేసి రికార్డ్‌ సష్టించాడు. భారత్‌ తరుఫున గత నాలుగు ఇన్నింగ్స్‌లలో తిలక్‌ దక్షిణాఫ్రికాపై 107 (56 బంతుల్లో), దక్షిణాఫ్రికాపై 47 బంతుల్లో 120, ఇంగ్లాండ్‌పై 19, నాటౌట్‌గా 72 పరుగులు చేశాడు. అంతకుముందు, ఈ రికార్డు న్యూజిలాండ్‌కు చెందిన మార్క్‌ చాప్‌మన్‌ పేరిట ఉండేది.

చాప్‌మన్‌ టీ20 క్రికెట్‌లో అజేయంగా నిల్చి 271 పరుగులు చేశాడు. తిలక్‌ వర్మ బాధ్యతాయుత బ్యాటింగ్‌పై కెప్టెన్‌ సూర్యకుమార్‌ యాదవ్‌ ప్రశంసలు కురిపించాడు. భారత్‌ జట్టు ఒక వైపు వికెట్లు కోల్పోతున్నా తిలక్‌ ఒత్తిడికి గురికాకుండా రాణించడం విశేషం. ”తిలక్‌ బ్యాటింగ్‌ చేసిన విధానం చాలా సంతోషం కలిగించింది. అతనిలాంటి వ్యక్తి బాధ్యతాయుతంగా ఆడుతుంటే ఇతర బ్యాటర్లపై ఒత్తిడి తగ్గుతుందనడంలో సందేహం లేదు” అని సూర్యకుమార్‌ మ్యాచ్‌ తర్వాత జరిగిన ప్రజెంటేషన్‌లో వ్యాఖ్యానించాడు.

పాక్‌ మాజీ ఆటగాడి ప్రశంసలు
తిలక్‌ ని పాకిస్తాన్‌ మాజీ ఆటగాడు బాసిత్‌ అలీ కూడా ప్రశంసించడం విశేషం. గతంలో ఒకసారి భారత్‌ భవిష్యత్‌ బ్యాటర్‌ గురుంచి అడిగినప్పుడు భారత్‌ మాజీ కెప్టెన్‌ మొహమ్మద్‌ అజారుద్దీన్‌ తిలక్‌ వర్మ పేరు చెప్పాడని బాసిత్‌ గుర్తుచేసుకున్నాడు. ”నేను మొహమ్మద్‌ అజారుద్దీన్‌ను ఇంటర్వ్యూ చేసినప్పుడు, తిలక్‌ వర్మ ఆటతీరు చూసారా అని అడిగాడు. అతను అప్పటికి చాలా చిన్నవాడు. ఐపిఎల్‌లో మాత్రమే ఆడుతునున్నాడు. నాడు అజారుద్దీన్‌ చెప్పింది నేడు నిజమైంది, అని బాసిత్‌ గుర్తు చేసుకున్నాడు. చిన్న తనంలోనే ఎంతో పరిణతిని కనబరుస్తున్న తిలక్‌ వర్మ భవిష్యత్‌ లో భారత్‌ జట్టు తరుఫున అన్ని ఫార్మాట్లలో రాణిస్తాడని ఆశిద్దాం.

తిలక్‌ ఆట శైలి – టెక్నిక్‌, క్లాస్‌
తిలక్‌ వర్మ ఆటలో రెండు ప్రధాన లక్షణాలు ఉన్నాయి.
టెక్నిక్‌: షార్ట్‌ పిచ్‌ బంతులపై అతని పుల్‌ షాట్లు, కవర్‌ డ్రైవ్‌లు, లెగ్‌ సైడ్‌ లాఫ్టీలు – ఇవన్నీ క్లాస్‌కు నిదర్శనం. స్పిన్నర్ల ముందు ఫుట్‌వర్క్‌ ఉపయోగించి రోటేషన్‌ చేయడం అతని ప్రత్యేకత.
మానసిక శక్తి : ఒత్తిడిలో శాంతంగా ఉండటం, బౌలర్ల ప్రణాళికను ముందే చదవడం, అవసరమైనప్పుడు రిస్క్‌ తీసుకోవడం – ఇవన్నీ అతన్ని క్లచ్‌ ప్లేయర్‌ (ఒత్తిడిలో ఉన్నప్పుడే రాణించే ఆటగాడు) నిలబెట్టాయి.
ఒక సమయంలో ఐపిఎల్‌లో ఒక మ్యాచ్‌లో రిటైర్డ్‌ అవుట్‌ కావాల్సి వచ్చినా, తన కోచ్‌ సలామ్‌ బయాష్‌ సూచనలతో తిరిగి ఆడాడు. అది అతని మానసిక ధైర్యానికి నిదర్శనం.

భారత క్రికిట్‌ భవిష్యత్తు
తిలక్‌ వర్మ ప్రదర్శన ఒక ప్రామిస్‌ నుంచి పెర్ఫార్మెన్స్‌గా మారింది. ఐపిఎల్‌లో స్థిరత్వం, అంతర్జాతీయ క్రికెట్‌లో శతకాలు, ఆసియా కప్‌ ఫైనల్‌లో హీరో ఇన్నింగ్స్‌ – ఇవన్నీ అతని మల్టీ-ఫార్మాట్‌ సామర్థ్యాన్ని నిరూపిస్తున్నాయి. నిపుణులు చెబుతున్నట్టు, రాబోయే 2026 టి20 వరల్డ్‌ కప్‌లో అతను భారత జట్టుకు కీలక ఆటగాడిగా మారడం ఖాయం.
తన వయసులోనే ఇంతటి ఆత్మవిశ్వాసం, క్లాస్‌, ఒత్తిడిలో గెలిపించే నైపుణ్యం – ఇవన్నీ తిలక్‌ను టీమిండియాకు కొత్త వర్షన్గా మార్చుతున్నాయి. నిజంగానే, తిలక్‌ వర్మ క్రికెట్‌ రంగంలో ఒక అద్భుతం!

  • అనంతోజు మోహన్‌కృష్ణ 88977 65417
- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -