వంటిల్లు లేని ఇల్లు లేనట్లే
ఆమె గుండెకు అలవాటుకాని
మాటల సూదులుండవు
గాసంకోసం నోళ్లుతెరిచి చూసే పక్షిపిల్లల్లా
లేచింది మొదలు ఆ ఇల్లంతా
చాయ టిఫిన్ల కోసం క్యూ కడుతుంది.
వంట గదిలో దిగడంతోనే
అన్ని రకాల అందరి రుచుల తిండ్ల కోసం
చేతులు, కండ్లు, కాళ్ళు తండ్లాడుతుంటయి
ఆమెకు తెలియకుండానే.
పగలంతా పైరు పాపలకు పాలు పట్టి
పొత్తిగండ్రలు పరిచి గాలిపంకలు పెట్టి
రాత్రి పూట ఇల్లు గడవడానికి
కట్టెలు, కాయగూరలు వెంట మోసుకస్తది
బడిలో పాఠాలు చెప్పినా
ఆఫీసు ఫైల్లతో ఘర్షణపడ్డా
వెన్ను మోపే దాకా
చెవిలో గున్నాళ్ళాగా కోపులు గిన్నెలను
మెడలో పుస్తెల్లాగా చెంచాలను, గంటెలను
తనకంటే మిన్నగా తళ తళ మెరిపించనీకి
కార్మికురాలిగా మసిబారిపోతది
ఆ పూట బడ్జెట్ లోటును
పెరడి గైనినుంచి పదిలంగా తెచ్చి భర్తీ చేస్తది
ఉప్పెక్కు వైందని ఒక శార్థులం
మిరెం తక్కువైందని మగమత్తెభం
బుక్కకూడా దిగడంలేదని పడుచు బల్లూకం
నేనన్నది తట్టిలో లేదని పిల్లకోకిల
ఒక్కొక్కరు వంతులవారిగా కండ్లనుంచి, నాలుక నుంచి
చేతులనుంచి చెంపల దాకా
దాడులమీద దాడులమోత వినిపిస్తుంటది
వాళ్ళ నిప్పుల వానకు
ఎన్నిసార్లు కొంగు తడిసి ముద్దయిపోతదో
కనబడని చిన్న చిన్న గాయాలకు
పోపుల డబ్బానే ఔషదము ఐన్ట్మెంట్
తల్లింటి గేటు చప్పుడైనా
ఐనవాళ్ళ అలికిడి చెవితాకినా
అంతలోనే మహానటిలో దూరి
చిరునవ్వుల పలుకరింపులు చిలుకరిస్తది
అచానక్ గా అసలు రూపం పొక్కకుండా
పక్కన ఉల్లి పాయను దోస్తీ చేసుకుంటది
అందరూ నిండిన కడుపులతో
పడకలను చేరుకున్నాక
రేపటి కోసం మళ్ళీ సుదీర్ఘ
ఊపిరి పీల్చుకొని ఓపిక నింపుకొని
తనను తానే ఓదార్చుకొని
నిద్రముసుగేసుకుంటది
ఆమెను మాత్రం ఏమిలేనట్లు
ఆమె జీవితాన్ని అనేక భాషల్లోకి
కవులు రచయితలు అనువదిస్తుంటారు.
డా. ఉదారి నారాయణ, 9441513666
వంట గది
- Advertisement -
- Advertisement -