Sunday, October 5, 2025
E-PAPER
Homeఅంతర్జాతీయంబందీల విడుదలకు సిద్ధం

బందీల విడుదలకు సిద్ధం

- Advertisement -

స్వతంత్ర సంస్థకు అధికారాన్ని అప్పగిస్తాం
మిగిలిన అంశాలపై మరింతగా చర్చలు అవసరమన్న హమాస్‌
నిరాయుధీకరణ గురించి మాట్లాడని నేతలు
మొదటి దశ అమలుకు సన్నాహాలు : ఇజ్రాయిల్‌
తాజా దాడుల్లో 20 మంది మృతి
హమాస్‌ స్పందనను స్వాగతించిన యూఎన్‌ సహా పలు దేశాలు

గాజా : తమ వద్ద వున్న బందీలందరినీ విడుదల చేయడానికి సిద్ధంగానే వున్నామని శుక్రవారం పొద్దుపోయిన తర్వాత పాలస్తీనా గ్రూపు హమాస్‌ ప్రకటించింది. అలాగే అధికారాన్ని స్వతంత్ర పాలస్తీనా నిపుణులతో కూడిన సంస్థకు అప్పగించడానికి కూడా అంగీకరించింది. కానీ ట్రంప్‌ ప్రతిపాదించిన 20 సూత్రాల శాంతి ప్రణాళికలో మిగిలిన అంశాలపై మరిన్ని చర్చలు జరగాల్సిన అవసరం వుందని స్పష్టం చేసింది. హమాస్‌ వైపు నుంచి సానుకూలంగా స్పందన వచ్చిన వెంటనే అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ స్పందిస్తూ గాజాపై బాంబు దాడులను ఇజ్రాయిల్‌ తక్షణమే ఆపాలని అన్నారు.

శాశ్వత శాంతి స్థాపనకు హమాస్‌ సానుకూలంగా వుందన్నారు. అయితే ట్రంప్‌ చేసిన ఈ వ్యాఖ్యలు ఇజ్రాయిల్‌ ప్రధాని నెతన్యాహుకు దిగ్బ్రాంతిని కలిగించాయని ఇజ్రాయిల్‌ మీడియా వ్యాఖ్యానించింది. ఈ నేపథ్యంలో నెతన్యాహు కార్యాలయం తర్వాత ఒక ప్రకటన విడుదల చేసింది. ట్రంప్‌ శాంతి ప్రణాళికలోని మొదటి దశను తక్షణమే అమలు చేయడానికి మిలటరీ సన్నాహాలు ఆరంభించిందని ప్రకటించింది. గాజాలో యుద్ధాన్ని ఆపేందుకు ఇజ్రాయిల్‌ విధించిన సూత్రాలకు అనుగుణంగా ట్రంప్‌తో కలిసి పనిచేస్తామని నెతన్యాహు కార్యాలయం ప్రకటించింది.

ప్రకటనను స్వాగతించిన పలు దేశాలు
యూఎన్‌ సంస్థల ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి ఆంటానియో గుటెరస్‌, యూఎన్‌ మానవ హక్కుల చీఫ్‌ వోల్కర్‌ టర్క్‌, డబ్ల్యూహెచ్‌ఓ అధినేత టెడ్రొస్‌ అదనామ్‌ గెబ్రియెసెస్‌, యురోపియన్‌ యూనియన్‌ కమిషన్‌ అధ్యక్షుడు ఉర్సులా వాన్‌ డెర్‌ లేయన్‌లు స్వాగతించారు. అన్నింటికంటే అత్యుత్తమమైన ఔషధమేమంటే శాంతి అని గెబ్రియెసెస్‌ వ్యాఖ్యానించారు. శాశ్వత కాల్పుల విరమణ, తర్వాత ఇజ్రాయిల్‌ మారణకాండ మిగిల్చిన విధ్వంసం నుండి బయటపడి పునర్నిర్మాణ కార్యకలాపాలు చేపట్టేలా చూడడం, చివరగా రెండు దేశాల ఏర్పాటు ఇలా వరుసగా జరగాల్సి వుందని వోల్కర్‌ టర్క్‌ పేర్కొన్నారు. తాజాగా అందివచ్చిన ఈ అవకాశాన్ని ఒడిసిపట్టుకుని శాశ్వత శాంతి దిశగా అడుగులు వేయాలని గుటెరస్‌ ఆకాంక్షించారు. హమాస్‌ స్పందన ప్రోత్సాహకరంగా వుందని ఉర్సులా వ్యాఖ్యానించారు.

నిరాయుధీకరణ ప్రస్తావనే లేదు
అయితే ఇంతవరకు వచ్చినా ఇంకా కొన్ని అంశాలపై ఉభయ పక్షాలకు ఆమోదయోగ్యమైన వైఖరి రాలేదు. నిరాయుధీకరణ గురించి హమాస్‌ అస్సలు ప్రస్తావించలేదు. ఇది ఇజ్రాయిల్‌ కీలక డిమాండ్‌గా వుంది. ట్రంప్‌ ప్రణాళికలో కూడా వుంది.

స్వాగతించిన మధ్యవర్తిత్వ దేశాలు
హమాస్‌ వైఖరిని, ప్రకటనను మధ్యవర్తిత్వం నెరుపుతున్న ఖతార్‌, ఈజిప్ట్‌, టర్కీ వంటి దేశాలు స్వాగతించాయి. శాంతికి హమాస్‌ సిద్ధంగా వుందని తాజా పరిణామాలు తెలియచేస్తున్నాయని పేర్కొన్నాయి. ఈ సానుకూల పరిణామాన్ని తాము హర్షిస్తున్నామని, గాజాలో శాశ్వత కాల్పుల విరమణకు అరబ్‌ దేశాలు, అమెరికా, యురోపియన్‌ దేశాలతో కలిసి పనిచేస్తామని చెప్పాయి.

గాజాపై సార్వభౌమాధికారం పాలస్తీనాదే : అబ్బాస్‌
పాలస్తీనా అధ్యక్షుడు మహ్మద్‌ అబ్బాస్‌ హమాస్‌ వైఖరిని స్వాగతించారు. అయితే గాజాలో సంపూర్ణ కాల్పుల విరమణను అమలు చేసేందుకు మనం కట్టుబడడం చాలా ముఖ్యమని వ్యాఖ్యానించారు. గాజాపై సార్వభౌమాధికారం పాలస్తీనా దేశానికే చెందుతుందని ఆయన ఈ సందర్భంగా స్పష్టం చేశారు. అలాగే వెస్ట్‌ బ్యాంక్‌, గాజాల మధ్య సంబంధాలను పాలస్తీనా చట్టాలు, ప్రభుత్వ సంస్థల ద్వారా సాధించుకోవాలన్నారు. ఏకీకృత వ్యవస్థ, చట్టం పరిధిలో సమైక్య పాలస్తీనా భద్రతా బలగాలు, పాలస్తీనా పాలనా యంత్రాంగ కమిటీ ద్వారా ఈ సంబంధాలు బలపడాలని ఆకాంక్షించారు.

భారత్‌ ప్రశంస
గాజాలో పరిస్థితులకు సంబంధించి నిర్ణయాత్మకమైన పురోగతి చోటు చేసుకుందని భారత ప్రధాని నరేంద్ర మోడీ వ్యాఖ్యానించారు. బందీల విడుదల సూచనలు గణనీయమైన ముందడుగు అని పేర్కొన్నారు. గాజాలో శాశ్వత శాంతి దిశగా జరిగే కృషి భారత్‌ తోడ్పాటు వుంటుందని చెప్పారు.

ట్రంప్‌ సూచన బేఖాతర్‌
గాజాపై దాడులు తక్షణమే ఆపివేయాలంటూ ట్రంప్‌ స్పష్టంగా ఆదేశించినప్పటికీ ఇజ్రాయిల్‌ వాటిని పట్టించుకోలేదు. శనివారం తాజాగా జరిగిన దాడుల్లో 20 మంది పాలస్తీనియన్లు మరణించారు. ఒక ఇంటిపై జరిగిన దాడిలో నలుగురు చనిపోగా ఖాన్‌ యూనిస్‌లో జరిగిన దాడుల్లో మరో ఇద్దరు చనిపోయారు. ఈ దాడుల్లో పలువురు గాయపడ్డారని, వారిని ఆస్పత్రులకు తరలిస్తున్నట్టు వార్తలు వచ్చాయి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -