మావోయిస్టులతో ఎలాంటి చర్చలూ ఉండవ్ : అమిత్ షా
రాయ్ పూర్: దేశంలో మావోయిస్టుల అంతమే లక్ష్యంగా పెట్టుకున్న కేంద్రం ఆ వైపుగా చర్యలు తీసుకుంటున్నది. మావోయిస్టులు చర్చలకు సిద్ధమంటున్నా.. మోడీ సర్కారు మాత్రం ససేమిరా అంటోంది. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఇదే విషయాన్ని పునరుద్ఘాటించారు. మావోయిస్టులతో ఇక ప్రభుత్వం ఎటువంటి చర్చలూ జరపదని కీలక వ్యాఖ్యలు చేశారు. వారు ఆయుధాలు వదిలేసి లొంగిపోయేందుకు ముందుకు వస్తే స్వాగతిస్తామన్నారు. ఆ విధంగా లొంగిపోయిన వారందరికీ ప్రభుత్వం నుంచి అందాల్సిన వివిధ ప్రయోజనాలు అందిస్తామనీ, పునరావాసం కల్పిస్తామని ఆయన హామీ ఇచ్చారు.
ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్ జిల్లాలో జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడిన అమిత్ షా ఈ వ్యాఖ్యలు చేశారు. 2026 మార్చి 31 నాటికి దేశం మావోయిస్టు రహితంగా మారుతుందని పునరుద్ఘాటించారు. మావోయిస్టులు చర్చలు జరపాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారనీ, ఇప్పుడు వారితో మాట్లాడడానికి ఏముందని ప్రశ్నించారు. బస్తర్ అంతటా ఉన్న మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలను అభివృద్ధి చేయడానికి కేంద్రం, ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం సిద్ధంగా ఉన్నాయన్నారు. ఈ ప్రాంతంలో ఆయుధాలతో శాంతికి విఘాతం కలిగించే వారికి భద్రతా దళాలు తగిన సమాధానం ఇస్తాయని మావోయిస్టులను ఆయన హెచ్చరించారు.