కేంద్రానికి తెలంగాణ రైతు సంఘం ప్రశ్న
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
‘కుటుంబ సభ్యులంతా ఆరుగాలం చెమటోడ్చి పండించిన పంటలకు స్వామినాథన్ కమిటీ సిఫారసులు వర్తించవా? కనీస మద్దతు ధర (ఎంఎస్‌పీ) కల్పించకుండా రైతులను వంచనకు గురిచేస్తారా?’ అంటూ తెలంగాణ రైతు సంఘం కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. శనివారం ఈ మేరకు ఆ సంఘం రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పోతినేని సుదర్శన్‌రావు, టి. సాగర్ ఒక ప్రకటన విడుదల చేశారు. రబీ పంటలకు కేంద్ర ప్రభుత్వం ఆమోదించిన ఎంఎస్‌పీ ధరలు తీవ్ర నిరాశాజనకంగా ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. 2014 లోక్‌సభ ఎన్నికల సమయంలో బీజేపీ తన ఎన్నికల మ్యానిఫెస్టోలో సీి2 ప్లస్ 50 శాతం ఉండేలా ఎంఎస్‌పీ ప్రకటిస్తామని హామీ ఇచ్చిందని గుర్తుచేశారు.
ఇప్పుడు ఏ2 ఎఫ్‌ఎల్ ఫార్ములాతోనే ధరలను నిర్ణయిందని విమర్శించారు. కుసుమలకు, కాయ ధాన్యాలకు అత్యధికంగా పెంచామంటూ కేంద్రప్రభుత్వం పదేపదే గొప్పలు చెప్పుకుందని తెలిపారు. కానీ పెరిగిన ఉత్పత్తి వ్యయాన్ని పరిగణనలోకి తీసుకోకుండా ధరలను నిర్ణయించడం వల్ల రైతులకు ఉపయోగం లేదని స్పష్టం చేశారు. 11 ఏండ్లుగా ప్రధాని మోడీ పదే పదే రైతాంగాన్ని మోసం చేస్తూనే వస్తున్నారని విమర్శించారు. కచ్చితమైన సేకరణతో, చట్టబద్ధమైన ఎంఎస్‌పీకి హామీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. మోడీ ప్రభుత్వ బూటకపు వైఖరిని తేటతెల్లం చేస్తూ రాష్ట్రవ్యాప్తంగా అన్ని గ్రామాల్లో ప్రచారాలు చేపట్టాలనీ, ప్రభుత్వం చేస్తున్న మోసానికి, ద్రోహానికి వ్యతిరేకంగా నిరసనలు తెలియజేయాలని రైతాంగానికి వారు పిలుపునిచ్చారు.
రబీ పంటలకు స్వామినాథన్ కమిటీ సిఫారసులు వర్తించవా?
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES