బ్యాంకుల్లో అన్‌క్లెయిమ్డ్ సొమ్ము : మంత్రి సీతారామన్ వెల్లడి
హక్కుదారుల కోసం కేంద్రం క్యాంపెయిన్
అహ్మాదాబాద్ : బ్యాంక్‌లు, విత్త, బీమా సంస్థల్లో లక్షల కోట్ల రూపాయల ఖాతాదారుల సొమ్ము మూలుగుతోంది. ఎవరూ క్లెెయిమ్ చేయకుండా ఉన్న నగదు విలువ రూ.1.84 లక్షల కోట్లుగా ఉందని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. అర్హులైన హక్కుదారులు ఈ సొమ్మును తీసుకోవాలని మంత్రి సూచించారు. శనివారం అహ్మాదాబాద్‌లో ‘మీ సొమ్ము – మీ హక్కు’ క్యాంపెయిన్‌ను నిర్మలా సీతారామన్ లాంచనంగా ప్రారంభించారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ.. ఈ అన్‌క్లెయిమ్డ్ సొమ్మును అర్హులైన వారికి చేరేలా అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు. బ్యాంక్‌ల్లో డిపాజిట్లు, బీమా, ప్రావిడెంట్ ఫండ్, షేర్లు తదితర వాటిల్లో వివిధ రూపాల్లో రూ.1.84 లక్షల కోట్లు అన్‌క్లెయిమ్డ్ సొమ్ము పోగుబడి ఉందని మంత్రి తెలిపారు. ఈ మొత్తాలను వచ్చే మూడు నెలల్లో సరైన వ్యక్తులకు చేరేలా అధికారులు చొరవ చూపాలన్నారు. ఈ మొత్తం భద్రంగా ఉందని, సరైన పత్రాలు సమర్పించి నగదు పొందాలని హక్కుదారులకు సూచించారు. ఈ సొమ్ముకు ప్రభుత్వం కస్టోడియన్‌గా వ్యవహరిస్తోందన్నారు.
దీర్ఘకాలంలో నగదును ఎవరూ క్లెయిమ్ చేయకపోవడం వల్ల ఒక సంస్థ నుంచి ఇంకో సంస్థకు బదిలీ అవుతుంటాయని మంత్రి చెప్పారు. బ్యాంకుల నంచి ఆర్‌బిఐకి, సెబీ నుంచి ఇంకో సంస్థకు ఇలా చేరుతుంటాయని పేర్కొన్నారు. అన్‌క్లెయిమ్డ్ డిపాజిట్ల కోసం ఆర్‌బిఐ ఉడ్గామ్ పోర్టల్‌ను రూపొందించిందన్నారు. ఇందులో డిపాజిట్‌దారులు తమ అన్‌క్లెయిమ్డ్ మొత్తాలను గుర్తించవచ్చన్నారు. ఈ పోర్టల్ ద్వారా పౌరులు తమకు చెందిన నగదును క్లెయిమ్ చేసుకొనేలా అవగాహన కల్పించాల్సిన బాధ్యత బ్యాంకు అధికారులపై ఉందన్నారు. అవసరమైతే బ్యాంకులు గ్రామాల్లో స్టాళ్లు ఏర్పాటు చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో గుజరాత్ ఆర్థిక మంత్రి కానుభాయ్ దేశాయ్, వివిధ బ్యాంకులు, ఆర్థిక శాఖకు చెందిన సీనియర్ అధికారులు పాల్గొన్నారు.